9

1 యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కారు. వారు ఉంటున్న కపెర్నహోము నుండి సరస్సు అవతల వైపుకు వెళ్ళారు. 2 అక్కడ పక్షవాతం వచ్చిన మనిషిని పరుపు పైన కొందరు మనుషులు తీసుకువచ్చారు. తాను ఆ పక్షవాత రోగిని స్వస్థపరుస్తాడనే విశ్వాసం వాళ్లకు ఉన్నదని గ్రహించిన యేసు, "అబ్బాయ్, ధైర్యం తెచ్చుకో. నేను నీ పాపాలు క్షమిస్తున్నాను" అన్నాడు. 3 యూదు పండితుల్లో కొందరు తమలో తాము "తాను దేవుడినని అనుకుంటున్నాడా ఏమిటి. ఇతడు పాపాలనెలాక్షమిస్తాడు?" అనుకున్నారు.

4 వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్న యేసు "మీరు చెడు ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? 5 ఏది సులువు? నీ పాపాలు క్షమించాను అనడమా? నువ్వు లేచి నడువు అని చెప్పడమా? 6 పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి, అంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడని మీరు తెలుసుకొనేలా చేస్తాను" అని, ఆ పక్షవాత రోగితో, "లేచి నీ పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళు" అన్నాడు. 7 వెంటనే ఆ మనిషి లేచి, తన పరుపు చుట్టుకుని వెళ్ళిపోయాడు. 8 జన సమూహం ఇది చూసి అవాక్కయ్యారు. మనుషులకు అలాంటి అధికారం ఇస్తున్నందుకు దేవుని స్తుతించారు.

9 అక్కడి నుండి యేసు వెళ్ళిపోతూ, "మత్తయి" అనే పేరు గల మనిషిని చూశాడు. రోమన్ ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే బల్ల దగ్గర అతను కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో "నాతో రా, నా శిష్యుడిగా ఉండు" అన్నాడు. అప్పుడు మత్తయి లేచి ఆయనతో వెళ్ళాడు.

10 యేసు, ఆయన శిష్యులు ఒక ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నారు. వాళ్ళు తింటూ ఉండగా వాళ్ళతో పాటు చాలా మంది పన్ను వసూలుదార్లూ ఇతరులూ భోజనం చేస్తూ ఉన్నారు. 11 పరిసయ్యులు అది చూసి, శిష్యులతో, "మీ బోధకుడు అలాంటి పన్ను వసూలుదార్లతో, తక్కిన వాళ్లతో స్నేహంగా భోజనం చేయడం బాగోలేదు" అన్నారు. 12 వాళ్ళు అన్నది యేసు విని వాళ్ళకి ఈ ఉదాహరణ చెప్పాడు. "జబ్బు పడ్డ వాళ్ళకే డాక్టర్ అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి కాదు. 13 "బలులు అర్పించడమే కాదు, మనుషుల పట్ల కనికరం చూపండి" అనే మాటల అర్థం తెలుసుకోండి. మేము నీతిమంతులం అనుకునే వాళ్ళు పాప జీవితాలను వదిలి నా దగ్గరికి రమ్మని పిలవడానికి నేను రాలేదు. మేము పాపులం అని తెలుసుకున్న వాళ్ళని పిలవడం కోసం వచ్చాను. ఇది మనస్సులో పెట్టుకోండి."

14 బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు వచ్చి "మేము పరిసయ్యులు తరచుగా దేవుని మెప్పించడం కోసం ఉపవాసం ఉంటాం. మరి మీ శిష్యులు చెయ్యరెందుకు?" అని అడిగారు. 15 యేసు జవాబిస్తూ, "పెళ్ళి వేడుకల్లో పెళ్ళికొడుకు తన స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళు విలపించరు. అవునా? ఎందుకంటే ఆ సమయంలో వారికి విచారం ఉండదు. కానీ పెళ్ళికొడుకు వాళ్ళను వదిలి వెళ్ళిపోయినప్పుడు విచారంగా ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉంటారు."

16 "చిరుగు పూడ్చడానికి కొత్త గుడ్డకు పాత గుడ్డ అతుకు వెయ్యొద్దు. అలా చేస్తే ఆ బట్ట ఉతికినప్పుడు కుచించుకుపోయి, బట్టను చింపేస్తుంది. ఆ చినుగు పెద్దదవుతుంది. 17 అలాగే పాత చర్మంతో చేసిన సంచుల్లో కొత్త ద్రాక్షరసం పొయ్యరు. అలా చేస్తే ఆ ద్రాక్షరసం పులిసి వ్యాకోచించినప్పుడు సంచులు సాగి పిగిలిపోతాయి. ఆ ద్రాక్షరసం సారాయిగా మారుతున్నప్పుడు ఆ ద్రాక్ష సంచులు చిల్లులుపడి రసం కారిపోతుంది. తాజా ద్రాక్షరసం కొత్త సంచుల్లో పోస్తే అది పులిసినప్పుడు ఆ సంచులు సాగుతాయి. ఈ రకంగా రసమూ సంచులూ రెండూ భద్రంగా ఉంటాయి" అన్నాడు.

18 యేసు ఇలాచెబుతున్నప్పుడు ఊరి అధికారి ఒకడు ఆయన ఎదుటికి వచ్చి కాళ్ళపై పడ్డాడు. ఆయనతో, "నా కూతురు ఇప్పుడే చనిపోయింది. కానీ నువ్వు వచ్చి ఆమెపై చేతులు వేస్తే, ఆమె బ్రతుకుతుంది" అన్నాడు. 19 యేసు లేచి తన శిష్యులతో కలిసి అతనితో వెళ్ళాడు.

20 అప్పుడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుకు దగ్గరగా వచ్చింది. వెనకగా వచ్చి ఆయన వేసుకున్న అంగీ అంచు తాకింది. 21 ఆమె "ఆయన వస్త్రం తాకితే చాలు, నేను స్వస్థపడతాను" అనుకుంది. 22 అప్పుడు యేసు తనను ఎవరు తాకారో అని చుట్టూ చూశాడు. ఆయన ఆ స్త్రీని చూసి ఆమెతో, "అమ్మా, ధైర్యంగా ఉండు. నేను నిన్ను బాగుచేస్తానని నువ్వు నమ్మావు కాబట్టి నిన్ను స్వస్థపరిచాను" అన్నాడు. ఆ క్షణంలోనే ఆమె బాగుపడింది.

23 యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి సమాధి చేసే సమయంలో సంగీతం వాయించే వాళ్ళను, చనిపోయిన అమ్మాయి కోసం శోకాలు పెడుతున్న వాళ్ళను చూశాడు. 24 "ఈ శోకాలు, సంగీతం చాలించండి. వెళ్ళిపొండి. ఈ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతూ ఉంది, అంతే" అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళకి ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసు గనక ఆయన్ని చూసి నవ్వారు. 25 యేసు వాళ్ళందర్నీ బయటికి పంపేసి, ఆ అమ్మాయి పడుకుని ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి బ్రతికి లేచి కూర్చుంది. 26 ఆ ప్రాంత ప్రజలంతా ఈ వార్త విన్నారు.

27 యేసు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఇద్దరు గుడ్డివాళ్ళు "దావీదు కుమారా, మాపై దయ చూపు, మమ్మల్ని బాగుచెయ్యి" అని కేకలేస్తూ వెంటబడ్డారు. 28 యేసు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ గుడ్డివాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. యేసు "నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని మీరు అనుకుంటున్నారా?" అని అడిగాడు. వాళ్ళు ,"ఔను ప్రభూ" అన్నారు. 29 అప్పుడు ఆయన వాళ్ళ కళ్ళు ముట్టుకుని, "మీ కళ్ళు నేను బాగు చెయ్యగలనని మీరు నమ్మారు కాబట్టి బాగుచేస్తున్నాను" అన్నాడు. 30 వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళు ఆయన్ని చూడగలిగారు. ఆయన "మిమ్మల్ని బాగుచేసిన ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు" అని గట్టిగా చెప్పాడు. 31 కానీ వాళ్ళు బయటికి పోయి ఆ ప్రాంతమంతా ఈ విషయాన్ని చాటించారు.

32 ఆ ఇద్దరూ వెళ్తుండగానే మూగ దయ్యం వశపర్చుకున్న ఒకడిని కొందరు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మనిషి మాట్లాడడం మొదలుపెట్టాడు. జన సమూహం ఇది చూసి ఆశ్చర్యపోతూ "ఇశ్రాయేలులో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాటి అద్భుతం చూడలేదు" అని చెప్పుకున్నారు. 34 పరిసయ్యులు మాత్రం, "దయ్యాల రాజు సాతానే, దయ్యాలను వదిలించడానికి ఇతనికి అధికారం ఇచ్చాడు" అన్నారు.

35 తరువాత యేసు, ఆయన శిష్యులు గలిలయ లోని చాలా గ్రామాలకు వెళ్ళారు. పరలోకం నుండి దేవుని ఏలుబడి గురించిన శుభవార్త ప్రకటిస్తూ సమాజ మందిరాలలో యేసు బోధించాడు. ఆయన ప్రజల్లో ఉన్న రకరకాల వ్యాధుల్ని కూడా స్వస్థపరిచాడు. 36 జన సమూహాన్ని ఆయన చూసినప్పుడు వాళ్ళంతా కలతగా దిగాలుగా ఉండడం చూసి జాలిపడ్డాడు. వాళ్ళు కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు.

37 తరువాత ఆయన తన శిష్యులతో, "నా సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలం వంటివాళ్ళు. కానీ ఆ పంట కోసి సమకూర్చడానికి ఎక్కువమంది లేరు. 38 కాబట్టి ప్రభువైన దేవుని ఇంకా కోత పనివాళ్ళని పంపమని ప్రార్థన చెయ్యండి" అన్నాడు.