10

1 యేసు తన పన్నెండుమంది శిష్యులను తన దగ్గరికి పిలిచాడు. మనుషులను అదుపులో పెట్టుకొనే దురాత్మల్ని వదిలించే శక్తినీ, అన్ని రకాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థ పరిచే అధికారాన్నీ వాళ్ళకి ఇచ్చాడు. 2 ఆయన పిలిచిన పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి- పేతురు అనే కొత్త పేరు పొందిన సీమోను, పేతురు తమ్ముడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని తమ్ముడు యోహాను, 3 ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, పన్ను వసూలుదారుడు మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, 4 తీవ్ర వాది సీమోను, ద్రోహబుద్ధితో యేసును అధికారులకు పట్టిచ్చిన ఇస్కరియోతు యూదా.

5 వేరు వేరు చోట్ల శుభవార్త ప్రకటించడానికి ఆ పన్నెండు మంది అపొస్తలుల్ని పంపే ముందు యేసు ఈ సూచనలు ఇచ్చాడు. "యూదులు కానివారు ఉండే చోటికీ సమరయులుండే చోటికీ పోవద్దు. 6 గొర్రెల కాపరి లేక చెదిరిపోయిన గొర్రెల్లా ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి. 7 వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకం నుండి దేవుడు తొందరలో ఏలడం మొదలు పెడతాడు అని చెప్పండి. 8 రోగుల్ని స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళను బ్రతికించండి. కుష్టురోగుల్ని బాగుచేసి మళ్ళీ సమాజంలో కలిసేలా చెయ్యండి. దయ్యాల అదుపులో ఉన్నవాళ్ళను విడిపించండి. దేవుడు మీకు ఉచితంగా సాయం చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రజలకి ఉచిత సాయం చెయ్యండి. 9 మీతో డబ్బులు తీసుకు పోవద్దు. 10 చేతిసంచీ, అదనంగా చెప్పుల జత, చేతికర్రా కూడా తీసుకు పోవద్దు. పనిచేసే ప్రతివాడూ జీతం తీసుకుంటాడు కదా. అలాగే మీరు వెళ్ళిన వాళ్ళ దగ్గర భోజనం తినే అర్హత మీకు ఉంది."

11 "మీరు ప్రవేశించిన ఊళ్ళో మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించే వాళ్ళను చూసుకోండి. 12 మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్లకి మేలు చెయ్యమని దేవుని అడగండి. మీరు ఆ ఊరు వదిలి పోయే దాకా ఆ ఇంట్లోనే ఉండండి. 13 మిమ్మల్ని ఆ ఇంటివాళ్ళు సంతోషంతో రానిస్తే దేవుడు నిజంగా వాళ్లకి మేలు చేస్తాడు. కాని వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అంగీకరించకపోతే వాళ్ళకు మీ ప్రార్థన ఏమాత్రం సాయపడదు. దేవుడు వాళ్లకి మేలు చేయడు. 14 ఏ ఇంటి వాళ్లైనా మిమ్మల్ని రానివ్వకపోతే మీ మాటల్ని ఒప్పుకోకపోతే అక్కడినుంచి వెళ్ళిపొండి. వెళ్ళే ముందు మీ కాలి దుమ్ము అక్కడ దులిపేయండి. అలా చెయ్యడంలో వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించినట్టే దేవుడు కూడా వాళ్ళను తిరస్కరిస్తాడని హెచ్చరించండి."

15 "ఇది జాగ్ర్రత్తగా గుర్తుంచుకోండి. దేవుడు మనుషులందరికీ తీర్పు తీర్చేటప్పుడు సొదొమ, గొమొర్రా పట్టణాల్లోని చెడ్డవాళ్లను శిక్షిస్తాడు. కానీ మిమ్మల్ని తిరస్కరించిన వాళ్లకి పడే శిక్ష ఇంకా తీవ్రంగా ఉంటుంది."

16 "గమనించండి. తోడేళ్ళ వంటి మనుషుల మధ్యకు అమాయకమైన గొర్రెల్లా మిమ్మల్ని పంపుతున్నాను. పాముల్లాగా చురుకుగా ఉండండి. పావురాల్లాగా సాధు జీవులుగా ఉండండి. 17 మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బంధించి, న్యాయ స్థానాలకు అప్పగించి, న్యాయ విచారణకు గురి చేస్తారు. సమాజమందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. 18 మీరు నాకు చెందినవాళ్ళు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రాజుల దగ్గరికీ గవర్నర్ల దగ్గరికీ తీసుకు వెళ్ళి విచారణ జరిపి శిక్ష విధిస్తారు. కానీ మీరు నా గురించి యూదులు కాని వాళ్లకీ పాలకులకీ సాక్ష్యమిస్తారు.

19 వాళ్ళు మిమ్మల్ని బంధించినప్పుడు ఏమి చెప్పాలీ అని కంగారు పడొద్దు. మీరు ఏమి చెప్పాలో అప్పటికప్పుడు మీకు తెలుస్తుంది. 20 అది మీరు అనుకోవడం వల్ల కాదు, మీ పరలోకపు తండ్రి ఆత్మ మీకు తెలిపినది మీరు మాట్లాడతారు."

21 "నాలో విశ్వాసం ఉంచినందుకు అధికారులు మీకు మరణ శిక్ష విధిస్తారు. మనుషులు తమ సోదరులకు ఇలా చేస్తారు. తండ్రులు తమ పిల్లలకి చేస్తారు. పిల్లలు తలిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు. అది వాళ్ళ చావుకు దారి తీస్తుంది. 22 నన్ను నమ్మినందుకు చాలామంది మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ ఎవరైనా చనిపోయేంత వరకూ నమ్మకంగా నాలో విశ్వాసం ఉంచితే దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. 23 ఇది గుర్తుంచుకోండి. ఒక ఊరి వాళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉంటే ఇంకొక ఊరికి వెళ్ళిపొండి. ఒక ఊరినుండి ఇంకొక ఊరికి వెళ్తూ నా గురించి చెప్పడం పూర్తయ్యే లోపలే మనుష్య కుమారుణ్ణి అయిన నేను తిరిగి వస్తాను."

24 "గురువు కంటే గొప్పవాణ్ణని శిష్యుడు అనుకోకూడదు. యజమానికంటే సేవకులు ఎక్కువ కాదు. 25 గురువు కన్నా విద్యార్థి మెరుగైన వాడుగా ఉంటాడని ఎవరూ అనుకోరు గదా! అలాగే నేను మీ యజమానిని, గురువును. మనుషులు నన్ను హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారనే మీరు అనుకోవాలి. వాళ్ళ దృష్టిలో సాతాను ఇంటికి నేను యజమానిని. నా పట్ల వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మీ విషయంలో మరింకెంత దుర్మార్గంగా ఉంటారో గదా!"

26 "వాళ్ళ గురించి మీకు భయంవద్దు. కప్పిపెట్టిన ప్రతిదీ బయట పడకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. 27 భయపడడానికి బదులుగా రాత్రిపూట చెప్పినట్టు నేను రహస్యంగా మీతో చెప్పింది మనుషులు పగలు చేసే పనుల్లా బాహాటంగా చెప్పండి. మనుషులు గుసగుసలుగా చెప్పుకున్నట్టు నేను ఏకాంతంలో చెప్పినవి ఇల్లెక్కి ప్రచారం చెయ్యండి."

28 "శరీరాన్ని చంపే వాళ్లకు భయపడకండి. వాళ్ళు మీ ఆత్మను నాశనం చేయలేరు. కానీ నరకంలో మీ శరీరాన్నీ ఆత్మనూ కూడా దేవుడు నాశనం చేయగలడు కాబట్టి ఆయనకి భయపడండి. 29 పిచ్చుకలు చూడండి. రెండు పైసలకు రెండు పిచ్చుకలు కొనొచ్చు. వాటి విలువ చాలా తక్కువే. కానీ పరలోక తండ్రి అయిన నీ దేవుడికి తెలియకుండా ఏ పిచ్చుకైనా నేలరాలదు. ఆయనకు తెలియనిదేమీ లేదు. 30 నీ గురించి కూడా అంతా తెలుసు. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు. 31 పిచ్చుకల కంటే నిన్ను విలువైన వాడిగా దేవుడు చూస్తాడు. కాబట్టి చంపుతానని బెదిరించే వాళ్లకి భయపడకండి."

32 "ఎవరైనా నాకు చెందిన వాళ్ళుగా చెప్పుకోడానికి ఇష్టపడితేనే నేను కూడా పరలోక తండ్రి అయిన దేవుడికి నాకు చెందిన మనుషులుగా వాళ్ళ గురించి చెప్తాను. 33 కానీ నాకు చెందిన మనుషులని ఇతరులకి చెప్పుకోడానికి భయపడే వాళ్ళ గురించి నేను కూడా పరలోకంలో నా తండ్రి దగ్గర వాళ్ళు నా వాళ్ళు కాదని చెప్తాను."

34 "మనుషులు ప్రశాంతంగా ఉండేలా చేయడానికి నేను భూమికి వచ్చానని అనుకోవద్దు. నేను వచ్చిన కారణంగా నన్ను వెంబడించే కొందరు చనిపోతారు. 35 నేను భూమికి వచ్చినందువల్ల నాపై విశ్వాసం ఉంచని వాళ్ళు నాపై విశ్వాసం ఉంచిన వాళ్లకు వ్యతిరేకమౌతారు. ఉదాహరణగా కొందరు తమ తండ్రులకు వ్యతిరేకమౌతారు, కొందరు తమ కూతుళ్ళకు వ్యతిరేకమౌతారు. కొందరు కోడళ్ళు వాళ్ళ అత్తలకు వ్యతిరేకమౌతారు. 36 ఒకే ఇంట్లో సభ్యులు వాళ్ళల్లో వాళ్ళే శత్రువులౌతారు."

37 "నాకంటే ఎక్కువగా తమ తలిదండ్రుల్ని ప్రేమించే వాళ్ళకు నా వాళ్ళు అయ్యే అర్హత లేదు. 38 నా సంబంధిగా చనిపోవడానికి సిద్ధంగా లేకపోతే నా వాడుగా ఉండే అర్హత నీకు లేదు. 39 చావు తప్పించుకోడానికి నన్ను తిరస్కరిస్తే అలాటి వాళ్ళకు నిత్య జీవం లేదు. నాపై విశ్వాసం ఉంచి అందుకోసం ప్రాణాలు వదులుకోడానికి ఇష్టపడితే వాళ్ళు దేవునితో నిత్యం జీవిస్తారు."

40 "మిమ్మల్నిఆహ్వానించే ప్రతివాడు నన్ను ఆహ్వానించినట్టే. నన్ను ఆహ్వానించే ప్రతివాడు దేవుని ఆహ్వానించినట్టే. 41 ప్రవక్త అని ప్రవక్తను ఆహ్వానించే వాళ్ళకు ఆ ప్ర్రవక్తకు దేవుని నుండి దక్కే ప్ర్రతిఫలం దక్కుతుంది. నీతిమంతుడని తెలుసుకుని నీతిమంతుణ్ణి ఆహ్వానించే వాళ్ళంతా ఆ నీతిమంతుడు పొందే ప్ర్రతిఫలాన్నే పొందుతారు."

42 "ఇది గమనించుకోండి. మీరు ప్రాముఖ్యమైన వాళ్ళు కానప్పటికీ మీరు నా శిష్యుల్లో ఒకరు కాబట్టి మీకు దాహంగా ఉన్నప్పుడు చూసి ఎవరైనా మీకు తాగడానికి చల్లని నీళ్ళు ఇస్తే, అలా చేసిన వాళ్లకి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు."