11

1 యేసు తన పన్నెండు మంది శిష్యులకి సూచనలు ఇవ్వడం ముగించిన తరువాత ఆయన వాళ్ళను వివిధ ఇశ్రాయేలీ పట్టణాలకు పంపించాడు. తక్కిన ఇశ్రాయేలీ పట్టణాల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బోధించి, నేర్పించడానికి ఆయన స్వయంగా వెళ్ళాడు.

2 బాప్తిసమిచ్చే యోహాను జైల్లో ఉండి క్రీస్తు చేస్తున్నవన్నీ విన్నాడు. తన శిష్యుల్లో కొందరిని ఆయన దగ్గరికి పంపించాడు. 3 "ప్రవక్తలు వస్తాడని చెప్పిన క్ర్రీస్తువు నువ్వేనా? లేకపోతే ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలా?" అని అడిగించాడు.

4 యోహాను శిష్యులతో యేసు, "మీరు వెళ్ళి ప్రజలు నా గురించి చెప్పుకుంటూ ఉండగా మీరు విన్నవీ నేను చేయగా మీరు చూసినవీ యోహానుకి చెప్పండి. 5 కుంటివాళ్ళు నడుస్తున్నారు. గుడ్డివాళ్ళు చూస్తున్నారు. కుష్ఠు రోగులు స్వస్థపడుతున్నారు. చెవిటి వాళ్ళు వింటున్నారు. చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు. పేదలకు దేవుని శుభవార్త ప్రకటన జరుగుతున్నది. 6 యోహానుతో ఇది కూడా చెప్పండి, నాలో విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండే వాళ్ళను చూసి దేవుడు సంతృప్తిపడతాడు. ఎందుకంటే నేను చేసేది క్రీస్తు ఏమి చెయ్యాలని వాళ్ళనుకుంటున్నారో అది కాదు" అని చెప్పాడు.

7 యోహాను శిష్యులు వెళ్ళిపోయాక యేసు యోహాను గురించి ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన వాళ్ళతో, "యోహానును చూడడానికి మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడాలనుకున్నారు? ఎత్తుగా పెరిగి గాలికి ఊగుతున్న గడ్డిని చూడడానికి అక్కడికి మీరు వెళ్ళలేదు. ఔనా? 8 ఎలాంటి వ్యక్తిని చూడాలనుకుని మీరు వెళ్ళారు? ఖరీదైన బట్టలు వేసుకున్న వాణ్ణి చూడడానికి మాత్రం కచ్చితంగా కాదు. అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు రాజులు ఉండే కోటల్లో ఉంటారని మీకు బాగా తెలుసు."

9 "మరి ఎలాంటి వాణ్ణి చూడాలనుకున్నారు? ప్రవక్తనా? ఔను. నిజమే, కానీ మీకు ఒక సంగతి చెప్పాలి. యోహాను మామూలు వ్యక్తి కాదు. 10 దేవుడు రాయించిన లేఖనాల్లో,
"ఇది గమనించండి. నీ రాక కోసం ప్రజల్ని సిద్ధ పరచడానికి
నీకంటే ముందుగా నా వార్తాహరుణ్ణి పంపుతున్నాను" అని ఎవరి గురించి రాసారో అతడే ఈ యోహాను."

11 "ఇది గమనించండి. బాప్తిసమిచ్చే యోహాను కంటే ఇంతవరకు ఈ లోకంలో పుట్టిన వాళ్ళెవ్వరూ గొప్పవాళ్ళు కాదు. కానీ ఆయన రాజ్యంలో ముఖ్యం కాకపోయినా పరలోకం నుండి దేవుడు ఎవరినైతే ఏలుతున్నాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో యోహాను కంటే గొప్పవాడు. 12 బాప్తిసమిచ్చే యోహాను బోధించిన కాలం నుండి ఇంతవరకు కొందరు వాళ్ళ సొంత పద్ధతిలో పరలోకం నుండి దేవుడు తమను ఏలాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోజనం కోసం వాళ్ళు తమ సొంత శక్తిని వాడుతున్నారు."

13 "బాప్తిసమిచ్చే యోహాను కాలం వరకు అతని గురించి నేను చెప్తూ ఉన్నదంతా ధర్మశాస్త్రం చెప్పిందీ ప్రవక్తలు రాసిందీ మాత్రమే. అది మీరు చదవొచ్చు. 14 అంతేకాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకు చెప్తున్నాను. నిజానికి యోహాను భవిష్యత్తులో రావాల్సిన రెండవ ఏలీయా. 15 ఇది మీకు అర్థం కావాలంటే నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి."

16 "ఇప్పుడున్న మీరూ ఇంకా ఇతరులు వీధుల్లో ఆటలాడుకునే పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు 17 "మీకోసం వేణువు మీద ఉషారు పాట వాయించాం, కాని మీరు చిందులెయ్యలేదు. ఏడుపు పాట వాయించాం, కాని మీరు ఏడవలేదు" అంటారు."

18 "ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు యోహానును చూసినా నన్ను చూసినా తృప్తి లేదు. యోహాను వచ్చి మీకు బోధిస్తున్నప్పుడు అతడు అందరిలాగా మంచి భోజనం తినడం లేదు, ద్రాక్షరసం తాగడం లేదు అన్నారు. అతన్ని తిరస్కరించి దయ్యం పట్టినవాడు అన్నారు. 19 యోహానులా కాకుండా మనుష్య కుమారుణ్ణి అయిన నేను మీరు తినే భోజనమే తింటున్నాను, మీలా ద్రాక్షరసం తాగుతున్నాను. కాని నన్ను కూడా మీరు తిరస్కరించి, "చూడండి, ఇతడు తిండిబోతు, తాగుబోతు. పన్ను వసూలుదారులూ పాపులూ అతని స్నేహితులు" అంటారు. కానీ ఎవడైనా నిజంగా తెలివైన వాడైతే, మంచి పనులు చేయడంలో తెలివితేటలు చూపిస్తాడు" అన్నాడు.

20 యేసు ఎక్కువగా అద్భుతాలు చేసిన పల్లెల్లో ప్రజలు ఇంకా దేవుని వైపు తిరగడం లేదు. కాబట్టి ఆయన వాళ్ళను గద్దిస్తూ 21 "కొరాజీను బేత్సయిదా ప్రజలారా! మీ స్థితి ఎంతో ఘోరం. మీ వీధుల్లో నేను గొప్ప అద్భుతాలు చేసాను. కానీ మీరు పాపం చేయడం మానలేదు. ఎప్పటినుండో ఇక్కడ చేసినవే తూరు, సీదోనుల్లో చేసినట్టైతే అక్కడి పాపులు కచ్చితంగా పాపం చేయడం మానేసేవారు. పాపం చేసినందుకు పాతబట్టలు కట్టుకుని, బూడిదలో కూర్చుని విచారం వెళ్ళబుచ్చే వాళ్ళు. 22 మీకు చెప్తున్నాను. దేవుడు తూరు, సీదోను పట్టణాల్లో ఉన్న చెడ్డవాళ్ళను శిక్షిస్తాడు కానీ ఆయన మనుషులపై తీర్పు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా శిక్షిస్తాడు."

23 "కపెర్నహోం పట్టణంలో నివసించే వాళ్లకు కూడా నేను చెప్పాల్సింది ఉంది. ఇతరులు నిన్ను పొగిడినట్టు నువ్వు తిన్నగా పరలోకం వెళ్తావని అనుకుంటున్నావా? అది జరగదు. చనిపోయిన తరవాత దేవుని శిక్షగా నువ్వు పాతాళానికి పోతావు. చాలా కాలం క్రితం నేను సొదొమలో ఇవే అద్భుతాలు చేసి ఉన్నట్టయితే అక్కడి చెడ్డవాళ్ళు పాపం చెయ్యడం తక్షణం మానేసే వారు. మీరు మాత్రం పాపం చెయ్యడం మానలేదు. 24 నేను ఇంకా చెప్తున్నాను. సొదొమలో ఉన్న చెడ్డవాళ్లను దేవుడు శిక్షిస్తాడు. కానీ ప్రజలందరినీ ఆయన శిక్షించే అంతిమ దినాన నిన్ను ఆయన మరీ ఎక్కువగా శిక్షిస్తాడు" అన్నాడు.

25 ఆ సమయంలో యేసు ప్రార్థన చేస్తూ, "తండ్రీ! నువ్వు భూమీ పరలోకాల్లో అన్నిటి మీదా రాజ్యమేలుతున్నావు. మేమే తెలివైన వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం అనుకునే వాళ్ళని ఈ విషయాలు తెలుసుకోకుండా అడ్డుకున్నందుకు వందనాలు. పెద్దలు చెప్పినప్పుడు చిన్న పిల్లలు నమ్మినట్టు నీ సత్యాన్ని అంగీకరించిన వాళ్లకి నువ్వు వాటిని బయలు పరిచావు. 26 ఔను తండ్రీ, అలా చేయడం మంచిదని నువ్వు అలా చేసావు" అన్నాడు.

27 తరువాత యేసు ప్రజలతో, "నా పని నేను చేసుకునేలా నా తండ్రి అయిన దేవుడు నేను తెలుసుకోవలసినవి అన్నీ నాకు బయలుపరిచాడు. నిజంగా నేనెవరో నా తండ్రికే తెలుసు. ఇంకా చెప్పాలంటే ఎవరికైతే నేను వెల్లడిస్తానో వాళ్లకి మాత్రమే తండ్రి తెలుసు."

28 "మీ నాయకులు మీకు చెప్పిన ఆజ్ఞలన్నీపాటించడానికి ప్రయత్నం చేసి, అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరికి రండి. వాటన్నిటి నుండి మీకు విశ్రాంతిని ఇస్తాను. 29 ఎద్దు తన కాడికి కిందకు వచ్చినట్టు మీరు నాకు లోబడండి. నేను అణకువ, సున్నితత్వం ఉన్న వాణ్ణి. మీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. 30 నేను మీపై పెట్టే భారం చాలా తేలిక. మోయలేని బరువు మీ మీద పెట్టను."