8

1 యేసు కొండ దిగి వచ్చాక ప్రజలు గుంపులుగా ఆయన్ని వెంబడించారు. 2 యేసు ఆ జనాన్నివదిలి వస్తుండగా కుష్టు వ్యాధి ఉన్న ఒక రోగి వచ్చి ఆయన ముందు మోకరించాడు. అతడు యేసుతో, "ప్రభూ దయచేసి నన్ను బాగుచెయ్యి. నీకిష్టమైతే నన్ను నువ్వు స్వస్థపరచగలవు" అన్నాడు. 3 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకాడు. ఆయన అతనితో, "నిన్ను స్వస్థపరచడానికి నేను ఇష్ట పడుతున్నాను. ఇప్పుడే నిన్ను బాగుచేస్తాను" అన్నాడు. వెంటనే అతను స్వస్థపడ్డాడు. 4 అప్పుడు యేసు అతనితో, "యాజకునికి తప్ప నేను నిన్ను స్వస్థపరచినట్టు ఎవరికీ చెప్పొద్దు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మోషే ఆజ్ఞాపించినట్టు కానుక చెల్లించు. అప్పుడు ప్రజలే దీని గురించి తెలుసుకుంటారు" అని చెప్పాడు.

5 యేసు కపెర్నహోం పట్టణానికి వెళ్ళినప్పుడు వందమంది రోమన్ సైనికులకు అధికారిగా ఉన్నవాడు యేసు దగ్గరికి వచ్చాడు. తనకు సాయం చెయ్యమని బ్రతిమాలాడు. 6 ఆ అధికారి ఆయనతో, "ప్రభూ, ఇంటి దగ్గర నా పనివాడు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అతడు చాలా నొప్పి అనుభవిస్తున్నాడు" అన్నాడు. 7 యేసు అతనితో, "నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను" అన్నాడు. 8 కానీ ఆ అధికారి ఆయనతో, "నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. నా పనివాడు స్వస్థపడ్డాడని నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, అతను స్వస్థపడతాడు. 9 నేను ఒక సైనికుణ్ణి. నేను నా అధికారుల ఆజ్ఞలకి లోబడాలి. అలాగే నా కింద నా ఆజ్ఞలకి లోబడే సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకణ్ణి "వెళ్ళు" అంటే వెళ్తాడు. ఇంకొకడితో "రా" అంటే వస్తాడు. నా పనివాడితో "ఇది చెయ్యి" అంటే చేస్తాడు" అన్నాడు.

10 యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. తనతోపాటు నడిచే వాళ్ళతో ఆయన, "ఇది వినండి. ఇతడు యూదుడు కాకపోయినా నా మీద అతనికి ఉన్న విశ్వాసం ఇంకెవరిలోనూ, నాపై విశ్వాసం ఉంచుతారని నేను ఎదురుచూసిన ఇశ్రాయేలు వారిలో కూడా చూడలేదు. 11 నేను నిజంగా చెప్తున్నాను. ఇంకా చాలా మంది యూదులు కానివాళ్ళు నాలో విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు వేరు వేరు దేశాల నుండి వస్తారు. తూర్పు నుండీ, పడమర నుండీ, వస్తారు. ప్రతి వారిపై, ప్రతి దానిపై పరలోకం నుండి దేవుని పరిపాలన మొదలు కాగానే వీళ్ళందరూ వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి విందులో కూర్చుంటారు."

12 "కానీ దేవుడు తాను ఏలుదామని అనుకున్న యూదుల్నినరకంలోకి తోసేస్తాడు. అక్కడ కారుచీకటి ఉంటుంది. అక్కడ వాళ్ళు పడే బాధకు ఏడుస్తూ ఉంటారు. తీవ్రమైన నొప్పితో పళ్ళు నూరుతూ ఉంటారు" అన్నాడు. 13 తరవాత ఆ అధికారితో యేసు, "ఇంటికి వెళ్ళు. నువ్వు నమ్మింది నీకు జరుగుతుంది" అన్నాడు. అప్పుడు ఆ అధికారి ఇంటికి వెళ్ళి, యేసు తనతో ఆమాట చెప్పిన సమయంలోనే తన పనివాడు స్వస్థపడ్డాడని తెలుసుకున్నాడు.

14 యేసు, ఆయన శిష్యుల్లో కొందరు పేతురు ఇంటికి వెళ్ళారు. యేసు పేతురు అత్తగారిని చూశాడు. ఆమె జ్వరంతో పడుకుని ఉంది. 15 యేసు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమెకి జ్వరం తగ్గి పోయింది. అప్పుడు ఆమె లేచి వాళ్లకు భోజనం వడ్డించింది.

16 ఆ సాయంత్రం విశ్రాంతి దినం గడిచి పోయినప్పుడు ప్రజలు దయ్యాలు పట్టిన వాళ్ళని, ఇతర రోగుల్ని తీసుకు వచ్చారు. ఆయన కేవలం మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగులందరినీ స్వస్థపరిచాడు. 17 ఈ విధంగా యెషయా ప్రవక్త మాటలు,
"ఆయన ప్రజలను రోగాల నుండి విడిపించాడు, వాళ్ళను బాగుచేసాడు"

అని రాసినవి నిజమయ్యాయి.

18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి, తన శిష్యులతో పడవలో సరస్సుకు అవతలి వైపుకు తీసుకెళ్ళమన్నాడు.

19 వాళ్ళు పడవ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక యూదుల ధర్మశాస్త్ర పండితుడు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో, "బోధకా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నేనూ అక్కడికే వచ్చి, నీతోనే ఉంటాను" అన్నాడు. 20 యేసు జవాబిస్తూ, "నక్కలకి గుంటలు ఉంటాయి, పిట్టలకి గూళ్ళు ఉంటాయి. నేను మనుష కుమారుణ్ణి అయినా నాకు తల వాల్చుకునే స్థలం కూడా లేదు" అన్నాడు.

21 తరవాత యేసును అనుసరించే వాళ్ళల్లో ఒకడు, "ప్రభూ, ముందు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు. మా నాన్న చనిపోయాక పాతిపెట్టి , ఆ తరవాత నేను నీతో వస్తాను" అన్నాడు. 22 కానీ యేసు అతనితో, "నాతో ఇప్పుడే రా. చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ మనుషులు చనిపోయే వరకూ ఎదురు చూడనివ్వు" అన్నాడు.

23 తరవాత యేసు పడవ ఎక్కాడు. శిష్యులు ఆయన్ని వెంబడించారు. 24 అకస్మాత్తుగా బలంగా గాలి వీచింది. పెద్ద అలలు రావడంతో పడవలోకి నీరు చేరి పడవ నిండిపోసాగింది. యేసు నిద్రపోతున్నాడు. 25 శిష్యులు వెళ్ళి ఆయన్ని లేపి ఆయనతో, "ప్రభూ, రక్షించు. మేము మునిగిపోతున్నాం" అన్నారు. 26 ఆయన వాళ్ళతో, "భయమెందుకు? నేను మిమ్మల్ని రక్షిస్తానని మీరు పూర్తిగా నమ్మడం లేదు" అన్నాడు. ఆయన లేచి గాలిని గద్దించి, అలలకు సద్దుమణిగి పొమ్మని చెప్పాడు. వెంటనే గాలి ఆగిపోయింది, అలలు ఎగిసి పడటం ఆగిపోయింది. 27 పడవలోని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు "ఈయన అసాధ్యుడు! ప్రకృతి సైతం ఈయన మాట వింటున్నది. గాలీ నీళ్ళు కూడా ఆయనకి లోబడుతున్నాయి" అనుకున్నారు.

28 వాళ్ళు సరస్సుకు తూర్పు వైపుకు చేరుకున్నారు. గదరేనీ ప్రాంతం వారు నివసించే చోటికి వచ్చారు. అక్కడ దయ్యం పట్టిన ఇద్దరు వ్యక్తులు ఊరి బయట సమాధి గుహల్లో ఉంటున్నారు. వాళ్ళు అటు వచ్చిన వాళ్ళపై దాడి చేసేవారు. ఆ దారిలో ఎవరూ ప్రయాణించే ధైర్యం చెయ్యడం లేదు. 29 వాళ్ళు యేసును చూసి, అకస్మాత్తుగా కేకలు పెడుతూ "నువ్వు దేవుని కుమారుడివి. నీకూ మాకూ ఏం సంబంధం? మమ్మల్ని వదిలెయ్యి. దేవుడు మమ్మల్ని శిక్షించక ముందే మమ్మల్ని నువ్వు వేధించడానికి వచ్చావా?" అన్నారు.

30 అక్కడ దగ్గరలో పందుల మంద మేస్తూ ఉంది. 31 ఆ దయ్యాలు , "నువ్వు ఎలాగూ మమ్మల్ని వీళ్ళల్లో నుండి బయటికి పంపించి వేస్తావు కాబట్టి ఆ పందుల్లోకి వెళ్లనివ్వు" అని యేసును బ్రతిమాలాయి. 32 యేసు వాటితో "మీకు అదే కావాలంటే అలాగే, పొండి" అన్నాడు. అప్పుడు దయ్యాలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని వదిలి పందుల్లోకి దూరాయి. అప్పుడు ఉన్నట్టుండి ఆ పందుల మంద దొర్లుకుంటూ పోయి కొండ వాలులో ఉన్న లోతైన నీటిలో పడి మునిగి చచ్చాయి.

33 ఆ పందుల్ని కాసేవాళ్ళు బెదిరిపోయారు. ఊళ్ళోకి వెళ్ళి దయ్యం పట్టిన ఆ ఇద్దరు మనుషులకి జరిగిన విషయంతో సహా అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. 34 అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా యేసును కలవడానికి వచ్చారు. వాళ్ళు ఆయన్ని, ఆ దయ్యాల అదుపు నుండి బయటపడిన వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు యేసును ఆ ప్రాంతం వదిలి పొమ్మని బ్రతిమాలారు.