7

1 "ఇతరులు చేసిన తప్పుల గురించి పాపాల గురించి మీరు ఎప్పుడూ వేలెత్తి చూపించొద్దు. అప్పుడు దేవుడు మీ పాపాల గురించీ మాట్లాడడు. 2 మీరు ఇతరులను ఖండిస్తే దేవుడు మిమ్మల్నీ ఖండిస్తాడు. మీరు ఎంతవరకు వారిని తోసిపుచ్చుతారో, దేవుడు కూడా అంతవరకు మిమ్మల్నీ తోసిపుచ్చుతాడు. 3 మీలో ఎవరూ ఇతరులలో ఉన్న చిన్న చిన్న తప్పుల గురించి పట్టించుకోనక్కర లేదు. అది ఎలా ఉంటుందంటే ఎదుటివాడి కంట్లో ఒక చిన్న గడ్డిపోచను చూసినట్టుగా ఉంటుంది. కాని మీరు మాత్రం పెద్ద తప్పుల గురించి పట్టించుకుంటూ ఉండాలి. నీ కంట్లోని కొయ్య దుంగను నువ్వు చూసుకోవు. 4 నీ కంట్లో పెద్ద దుంగను ఉంచుకుని నువ్వు ఇతరులతో "నీ కంట్లో నలుసు తీయనివ్వు" అని చెప్పకూడదు. 5 నీ కంట్లో ఉన్న దుంగను మొదట తీసేసుకో. అప్పుడు నీ సాటిమనిషి కంట్లో ఉన్న నలుసు తీసివేయవచ్చు."

6 "మీపై దాడి చేసే కుక్కలకు దేవునికి చెందిన వస్తువులను ఇవ్వొద్దు. మీ ముత్యాలను పందుల ఎదుట వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో. అలాగే, దేవుని గురించిన అద్భుతమైన సంగతులను దుర్మార్గులకు చెప్పకండి. వాళ్ళు తిరిగి మీకు హాని చేయవచ్చు."

7 "మీకు ఏది అవసరమో అది దేవుని అడుగుతూనే ఉండండి. ఆయన మీకు తప్పక ఇస్తాడని నమ్మండి. 8 దేవుని అడిగి దాన్ని ఆయన ఇస్తాడని నమ్మే ప్రతివాడికీ అది దొరుకుతుంది.

9 నీ కొడుకు నిన్ను రొట్టె ఇమ్మని అడిగితే వాడికి రాయినిస్తావా? 10 వాడు చేప కోసం అడిగితే పామునిస్తావా? 11 మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచివి ఇవ్వాలన్న సంగతి మీకు తెలుసు. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వాళ్ళకి అంతకంటే మంచివి కచ్చితంగా ఇస్తాడు."

12 "కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వాళ్ళకి చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, చాలా కాలం క్రితం ప్రవక్తలు రాసిన వాటి అర్థం ఇదే."

13-14 "పరలోకంలో దేవునితో కలిసి జీవించాలంటే చాలా కష్టం. అది చాలా కష్టమైన దారిలో వెళుతున్నట్టుగా ఉంటుంది. చాలా మంది మనుషులు నడిచే దారి ఇంకోటి ఉంది. అది చాలా విశాలంగా ఉంటుంది. కాని దానిలో ఉన్నది మరణమే. అందుకే నేను చెప్తున్నాను. పరలోకంలో దేవునితో కలిసి ఎప్పటికీ జీవించాలంటే కష్టమైన దారిలో నడిచి ఇరుకుగా ఉన్న గేటులోనుంచి ప్రవేశించాలి."

15 "అబద్దాలు చెప్పే వారిని జాగ్రతగా గమనించండి. దేవుడు చెప్పాడని ఏవేవో కల్పించి మీకు చెప్తుంటారు. వాళ్ళు గొర్రె తోలు కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు, మేకవన్నె పులులు. 16 చెట్టుకు కాసిన పండ్లు చూసి అది ఏమి చెట్టో సులువుగా తెలుసుకోగలుగుతాం. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరుపండ్లు గానీ కోసుకోలేము గదా."

17 "ఇంకొక ఉదాహరణ. ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19 పనివాళ్ళు మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు 20 చెట్టుకు కాసిన పండ్లను చూసి అది ఏ రకమైన చెట్టో మనం తెలుసుకున్నట్టుగానే మనకెదురైన మనుషులు చేసేది చూసి వాళ్ళు మంచివారా కాదా అనేది మనం గుర్తించాలి.

21 చాలామంది నన్ను అలవాటుగా ప్రభూ ప్రభూ అని నా అధికారాన్ని అంగీకరించినట్టే పిలుస్తారు కాని అలా పిలిచిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ప్రవేశించరు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇష్ట ప్రకారం చేసేవారు కాదు. పరలోకంలో దేవుని ఇష్ట ప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. 22 దేవుని తీర్పు రోజున చాలామంది నాతో, "ప్రభూ, ప్రభూ మేము నీ పేరున ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?" అంటారు. 23 అప్పుడు నేను "దుర్మార్గులారా, మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి పొండి" అంటాను."

24 "కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. కాబట్టి నేను చెప్పేది మీరు తప్పక వినాలి."

28 యేసు ఈ మాటలు చెప్పడం ముగించినప్పుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాకుండా అధికారం గల వాడిలాగా వాళ్ళకి బోధించాడు.