6

1 మనుషులు చూడాలని వాళ్ళ ఎదుట మంచి పనులను చెయ్యొద్దు. అలా చెయ్యాలనుకుంటే మాత్రం పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మీకు ఎలాంటి బహుమానమూ ఇవ్వడు. 2 కాబట్టి, మీరు దానం చేసేటప్పుడు కపట భక్తులలాగా ఇతరులు మిమ్మల్ని చూడాలని సొంత డబ్బా కొట్టుకోకండి. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపటభక్తులు సమాజ మందిరాల్లో ప్రధాన వీధుల్లో అలా చేస్తారు. 3 వాళ్ళు చేసినట్టుగా మీరు అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా పేదవారికి మీరు ఏదైనా సాయం చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా చెయ్యండి. 4 ఎప్పుడైతే మీరు ఎవరికీ తెలియకుండా దానం చేస్తారో అప్పుడే మీ తండ్రి అయిన దేవుడు మీకు బహుమానం ఇస్తాడు.

5 ఆలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా కపట భక్తుల్లాగా ఉండొద్దు. మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.

6 ఐతే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. ఎక్కువగా మాట్లాడితేనే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. 8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామాన్ని అందరూ ఘనపరుస్తారు గాక.
10 ప్రతి ఒక్కరిపై , ప్రతిదానిపై పూర్తిగా నీ అధికారం చెల్లు గాక.
పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ప్రసాదించు.
12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
13 శోధన పాలైనప్పుడు మేము తప్పటడుగు వెయ్యకుండా చెయ్యి.
మాకు హాని చెయ్యాలని చూసే సాతాను నుండి మమ్మల్ని కాపాడు.

14 మీకు వ్యతిరేకంగా మనుషులెవరైనా తప్పులు చేస్తే వారిని క్షమించండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్నీ క్షమిస్తాడు. 15 మీరు మనుషుల తప్పులు క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ తప్పులు క్షమించడు.

16 దేవుని సంతోషపెట్టాలని మీరు ఉపవాసం ఉన్నప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు ఉసూరుమంటూ పెట్టుకోవద్దు. తాము ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడాలని వాళ్ళు తమ ముఖాలను నీరసంగా చేసుకుంటారు. గుర్తుంచుకోండి. అదే ఆ మనుషులకు దొరికే బహుమానం. 17 మీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఉపవాసం చేసినప్పుడు ఎప్పటిలాగానే తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కోండి. 18 అప్పుడు మీరు ఉపవాసం ఉన్నట్టు మనుషులు గమనించరు. కానీ ఎవరికీ కనిపించని మీ తండ్రి అయిన దేవుడు మీరు ఉపవాసం ఉన్నారని గమనిస్తాడు. ఎవరూ మిమ్మల్ని చూడకపోయినా ఆయన చూస్తాడు. మీకు ప్రతిఫలమిస్తాడు.

19 పెద్దమొత్తంలో ధనాన్నీ వస్తువులనూ స్వార్ధంతో మీకోసం భూమి మీద కూడబెట్టుకోకండి. ఎందుకంటే భూమి మీద ఉన్నదంతా నశించిపోయేదే. చెదలు బట్టలను నాశనం చేస్తాయి. లోహాలు తుప్పు పట్టి పాడైపోతాయి. దొంగలు దొంగిలిస్తారు. 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.

22 “నీ శరీరానికి దీపం నీ కన్నే. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది. 23 నీ కన్ను పాడైతే నువ్వు ఇంక దేన్నీ సరిగ్గా చూడలేవు. ఇదే గనక జరుగుతూ ఉంటే కొంతకాలానికి అస్సలు ఏదీ చూడలేవు. అదే కొనసాగితే కొంత కాలానికి నువ్వసలు ఏమీ చూడలేని గుడ్డివాడివైపోతావు. పూర్తిగా చీకటిలో ఉంటావు. ఆలాగే, నువ్వు అత్యాశపరుడివిగా ఉంటే ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉంటావు. నీ కళ్ళు చూసేవీ నీ మనస్సు ఆలోచించేదీ అత్యాశాపూరితమైన కోరికలతో నిండిన ఈ లోక సంపద గురించే అయితే నువ్వు చేస్తున్నదంతా దుర్మార్గమే.

24 ఇద్దరు యజమానులకు ఎవరూ ఒకేసారి సేవ చేయలేరు. అలా చెయ్యాలని ప్రయత్నిస్తే అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవుడికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.

25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయో లేదోనని దిగులు పెట్టుకోకండి. మీరు తినే భోజనం కన్నా మీ జీవం గొప్పది. కట్టుకునే బట్టలకన్నామీ శరీరం గొప్పది. 26 పిట్టలను చూడండి. అవి విత్తనాలు చల్లవు. పంట కోయవు, ధాన్యం నిలవ చేసుకోలేవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు ఆ పక్షుల కంటే తప్పకుండా గొప్పవాళ్ళే. మీకేది అవసరమో దేవుడు మీకు ఇస్తాడని నమ్మండి.

27 మీరు బెంగ పెట్టుకుంటే లాభమేమిటి? బెంగ పెట్టుకోవడం వల్ల జీవితకాలానికి ఒక్క నిమిషమైనా కలుస్తుందా. కాబట్టి దేని విషయంలోనూ దిగులు పెట్టుకోవద్దు.

28 కట్టుకోడానికి బట్టల గురించి కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పువ్వులెలా పూస్తున్నాయో చూడండి. సంపాదనకై అవి పనిచేయవు. తమ బట్టలు తయారు చేసుకోలేవు. 29 అయితే నేను అనేదేమిటంటే పూర్వకాలం సొలోమోను రాజు అందమైన బట్టలు ధరించేవాడు గదా, అతని బట్టలు సైతం ఈ గడ్డి పువ్వుల ముందు దిగదుడుపే.

30 గరిక మొక్కలు కొంచెం కాలమే ఉంటాయి. వాడిపోయాక వాటిని తగలబెట్టేస్తారు. దేవుడు వాటిని భలే ముస్తాబు చేస్తాడు గదా. అయితే గడ్డిమొక్కల కంటే మీరే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఆయన మిమ్మల్నే ఎక్కువగా పట్టించుకుంటాడు. మీకు ఆపాటి నమ్మకం కూడా లేదు. 31 కాబట్టి ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏమి కట్టుకుంటాం అని బెంగ పెట్టుకోకండి. 32 దేవుని ఎరగని వాళ్ళు ఇలాంటి వాటి కోసం దిగులుపడుతుంటారు. అయితే పరలోకంలో ఉండే మీ తండ్రికి మీకేది అవసరమో తెలుసు. 33 కాబట్టి మీ ఆలనా పాలనా చూసే దేవుని మీ వాడుగా చేసుకోవడం అనేదాన్ని మీ జీవితాల్లో అతి ముఖ్యమైనదిగా ఎంచండి. అప్పుడు ఆయన కూడా మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. 34 కాబట్టి రేపు ఏమి జరుగుతుందా అని దిగులుపడొద్దు. దాని కష్టాలు దానికే ఉంటాయి. ఏ రోజు కష్టాలు ఆ రోజుకు చాలు.