5

1 యేసు ఆ జనాలను చూసి కొండ ఎక్కి కూర్చుని తన శిష్యులతో మాట్లాడసాగాడు. 2 ఆయన వాళ్ళకి ఇలా బోధించడం మొదలుపెట్టాడు.

3 "దేవుని అవసరత తమకు ఉంది అని ఒప్పుకునే మనుషులను చూసి దేవుడు ఆనందిస్తాడు. పరలోకం నుండి దేవుడు వాళ్ళను పరిపాలిస్తాడు.
4 ఈ లోకంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను భరించలేక దుఃఖించే వారంటే దేవుడికి ఇష్టం. ఆయన వారిని ఆదరిస్తాడు.
5 నమ్రత కలిగిన వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. త్వరలో చేయబోయే కొత్త భూమికి వాళ్ళు వారసులు అవుతారు.
6 అన్నపానాలకు ఆశ పడినట్టుగా నీతిగా బతకాలని ఆశ పడే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఆయన వారికి నీతిగా బతికే సామర్థ్యం ఇస్తాడు.
7 ఇతరులను కరుణించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు కూడా వారిని దయగా చూస్తాడు.
8 దేవుడికి సంతోషం కలిగించాలని చూసే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. వాళ్ళు దేవునితో ఉంటారు, ఆయన్ని చూస్తారు.
9 ఇతరులు శాంతి సమాధానాలతో జీవించటానికి సాయపడే వారిని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అలాంటి వారిని తన బిడ్డలుగా చేసుకుంటాడు.
10 నీతి న్యాయాలతో జీవించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. మనుషులు వారి నీతిని చూసి వారిని అవమానించి, దూషించినప్పుడు దేవుడు గౌరవం పొందుతాడు. ఇలాంటి నీతిగల మనుషులను దేవుడు పరలోకం నుండి ఏలుతాడు.
11 మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు.వారు మిమ్మల్ని హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు దేవునికి గౌరవం కలుగుతుంది.
12 అప్పుడు సంతోషించండి. ఉప్పొంగి పొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు."

13 "ఉప్పు ఆహారానికి ఎంత రుచి ఇస్తుందో మీరు ఈ లోకానికి అంత ఉపయోగకరంగా ఉండాలి. ఒకవేళ ఉప్పు తన రుచిని పోగొట్టుకుంటే దాన్ని బాగుచేయటం ఎవరి వల్లా కాదు. మనుషులు దాన్ని బయట పారేసి దాన్ని తొక్కుతూ నడుస్తారు. 14 చీకటిలో ఉన్న మనుషులకు వెలుగు ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఈ లోకానికి అలాంటి వెలుగుగా ఉండాలి. కొండమీద కట్టిన ఊరును మనుషులు అందరూ ఎలా చూస్తారో, అలాగే మిమ్మల్ని చూడాలి. 15 ఎవరు కూడా దీపాన్ని వెలిగించి బుట్ట కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే కదా అది ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది? 16 అలాగే మీరేం చేస్తారో మనుషులు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ మంచి పనులే చెయ్యాలి. అప్పుడు వాళ్ళు పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు."

17 "దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ నేను రద్దు చేయటానికి వచ్చానని మీరు అనుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను. 18 నేను కచ్చితంగా చెబుతున్నాను. దేవుడు ఆకాశాన్నైనా భూమినైనా తొలగిస్తాడు కాని ధర్మశాస్త్రం అంతా నెరవేరేవరకు దాంట్లో నుండి ఒక్క సున్నా అయినా ఒక్క పొల్లు అయినా తొలగించడు. 19 ఎందుకంటే ఈ ఆజ్ఞలలో ఎంత చిన్నదానినైన సరే పాటించకుండా పైగా ఇతరులకు అలా చేయమని చెప్పేవాణ్ణి పరలోకరాజ్యంలోఅతి తక్కువవాడిగా చూస్తారు. కానీ ఎవడైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధిస్తాడో వాణ్ణి పరలోకరాజ్యంలో గొప్పవాడిగా చూస్తారు. 20 నేను మీతో చెపుతున్నాను, ధర్మశాస్త్ర పండితుల కంటే కూడా ఎక్కువగా మీరు ఆ ఆజ్ఞలకు లోబడాలి. ఇంకా మీ మనసుకి ఏది సరైనదిగా అనిపిస్తుందో అది మీరు తప్పక చేయాలి."

21 "హత్య చెయ్యకూడదు. హత్య చేస్తే ఉరిశిక్ష పడుతుంది, అని మన పితరులు చెప్పింది మీరు విన్నారు కదా. ఐతే నేను చెప్తున్నాను. మీరు ఎవరితోనైనా కోపంగా ఏమన్నా అంటే చాలు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. 22 మీరు ఎవరిమీదనైనా కోప్పడితే దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరినైనా "చవటా" అని తిడితే మీమీద కోర్టులో కేసు పెట్టొచ్చు. ఎవరినైనా "తెలివి తక్కువ దద్దమ్మా" అంటే, దేవుడు మిమ్మల్ని నరకంలోకి తోస్తాడు."

23 "దేవుడికి నువ్వు కానుక సమర్పించే ముందు ఎవరితోనైనా గొడవ ఉన్నట్టు నీకు గుర్తుకు వస్తే 24 నీ కానుకను అక్కడే వదిలి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. నువ్వు అతనికి చేసిన దాన్ని గురించి అతణ్ణి క్షమాపణ అడగాలి. ఆపైన వచ్చి నీ కానుకను అర్పించ వచ్చు.

25 నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే వాడు నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాడనుకో. దారిలోనే నువ్వు వాడితో రాజీ పడిపో. లేకపోతే వాడు నిన్ను జడ్జీకి అప్పగిస్తాడు. అతడు నిన్ను జైల్లో పెడతాడు. 26 ఇంకా ఇది కూడా మనసులో పెట్టుకో. ఒకవేళ నువ్వు గనక జైల్లో పడితే చచ్చినా బయటికి రావు. ఎందుకంటే జడ్జీ నువ్వు కట్టాల్సిన జరిమానా డబ్బు మొత్తం చెవులు పిండి వసూలు చేసే దాకా నిన్ను వదలడు. కాబట్టి నీ సాటి మనుషులతో ఎప్పుడూ శాంతి సమాధానాలతో ఉండాలని గుర్తుపెట్టుకో."

27 "వ్యభిచారం చేయకూడదు, అని దేవుడు మన పూర్వికులతో చెప్పిన మాట నువ్వు వినే ఉంటావు కదా. 28 కాని నేను చేప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే చాలు అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టుగానే దేవుడు పరిగణిస్తాడు."

29 "నువ్వు పాపం చేయడానికి నీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారెయ్యి. పాపం చేయడానికి నీ రెండు కళ్ళు కారణం అయితే వాటిని పీకేసెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే గుడ్డివాడిగా ఉండి పాపం లేకుండా ఉండడం ఎంతో మేలు. 30 నువ్వు పాపం చేయడానికి నీ చెయ్యి కారణమైతే దాన్ని నరికి పారెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మేలు."

31 "భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి, అని చెప్పడం కూడా మీరు విన్నారు. 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకొనేవాడూ వ్యభిచారం చేస్తున్నాడు."

33 "నువ్వు అసత్య ప్రమాణం చేయకూడదు. మీ ప్రమాణాలను ప్రభువు మీ ఎదుట నిలబడి ఉంటే చేసినట్టుగానే ఉండాలి, అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే అసలు ఏ కారణంగానైనా ఒట్టు పెట్టుకోవద్దు. మీరు ప్రమాణం చేసిన వాటికి హామీ ఇవ్వటానికి దేవుని నివాస స్థలమైన పరలోకాన్ని ప్రస్తావించ వద్దు. ఎందుకంటే అది దేవుని సింహాసనం. అక్కడ నుండే ఆయన అన్ని విషయాలను శాసిస్తాడు. 35 భూమి తోడు అని ఒట్టు పెట్టుకో వద్దు. ఎందుకంటే అది దేవుడి పాద పీఠం. యెరూషలేము తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. అది మన మహారాజు దేవుని నగరం."

36 "ఇంకా ఎవరికైనా ఏదైనా పని చేస్తానని నా తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. ఒక్క వెంట్రుకను సైతం తెల్లగాగానీ నల్లగా గానీ నువ్వు మార్చలేవు గదా, అలాంటప్పుడు అంత ముఖ్యమైన పని చేస్తానని ఎలా మాటిస్తావు? 37 ఏదైనా పని చెయ్యాలనుకుంటే మీరు "అవును, నేను చేస్తాను" లేదా "కాదు, నేను చెయ్యలేను" అన్నట్టే ఉండాలి. మీరు అంతకన్నా ఎక్కువ ఏదైనా అంటే మీచేత అలా మాట్లాడించినవాడు సాతానే."

38 "మన పూర్వీకులు చెప్పిన మాట మీరు వినే ఉంటారు. ఎవరైనా మీ కంటికి గాయం చేస్తే మీరు అతని కంటికి గాయం చెయ్యాలి. ఒకవేళ నీ పన్ను రాలగొడితే వాడి పన్ను రాలగొట్టాలి. 39 కానీ ఇప్పుడు నేను చేప్పేది వినండి. మీరు ఆపాలని ప్రయత్నించినా మీకు హాని కలిగించాలని చూసే వారిపై ప్రతీకారం తీర్చుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని అవమానించాలని మీ చెంప మీద కొడితే రెండవ చెంపమీద కొట్టడానికి వీలుగా అతని వైపు తిప్పు.

40 ఎవరైనా మీ చొక్కా కావాలని కోర్టులో దావా వేస్తే అతనికి దానితోపాటు నీ పైబట్టను కూడా ఇచ్చెయ్యి. 41 ఒక రోమన్ సైనికుడు తన సరంజామాను ఒక మైలు దూరం మొయ్యమని నిన్ను బలవంతం చేస్తే రెండు మైళ్ళు మోసుకెళ్ళు.

42 ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే అతనికి ఇవ్వండి. ఎవరైనా అప్పు అడిగితే లేదనకుండా ఇవ్వండి."

43 "మీ సాటి ఇశ్రాయేలీయుణ్ణి ప్రేమించి శత్రువులైన విదేశీయులను ద్వేషించు అని దేవుడు మీ పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. 44 కాని ఇప్పుడు నేను చేప్పేది వినండి. మీ శత్రువులనూ స్నేహితులనూ సమానంగా ప్రేమించండి. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం ప్రార్ధించండి. 45 ఇలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన దేవునిలా మీరు ఉన్నట్టు. ఆయన అందరినీ దయగా చూస్తాడు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా సూర్యుణ్ణి సమానంగా ఉదయింపచేస్తాడు. తనకు లోబడేవారిపైనా లోబడని వారిపైనా కూడా వర్షం కురిపిస్తాడు. 46 మిమ్మల్ని ప్రేమిస్తున్న మనుషులను మాత్రమే మీరు ప్రేమిస్తే దేవుడు మెచ్చి మేకతోలు కప్పుతాడని చూడవద్దు. పన్నులు కట్టించుకునే వాళ్ళు చేసే పాతకాల వంటివి చేసే వాళ్ళు కూడా తమను ప్రేమించే వారినే ప్రేమిస్తారు. మీరు వారికంటే మెరుగ్గా ఉండాలి."

47 "ఇంకా మీరు మీ స్నేహితులను మాత్రమే యోగ క్షేమాలు కనుక్కుంటూ వారిని దీవించమని దేవుని కోరితే అందులో గొప్పేముంది? దేవునికి లోబడని యూదేతరులు సైతం అలాగే చేస్తారు గదా. 48 అందుకని పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మీపట్ల నమ్మకంగా ఉన్నట్టే మీరు కూడా పూర్తిగా ఆయనపట్ల నమ్మకంగా ఉండాలి."