4

1 తరువాత దేవుని ఆత్మ యేసుని అపవాది శోధనలను ఎదుర్కోవటానికి ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. 2 అప్పటికి ఆయన నలభై రాత్రింబగళ్ళు ఏమీ తినకపోవడంతో ఆయనకు చాలా ఆకలిగా ఉంది. 3 ఆయనను శోధించటానికి సాతాను ఆయన దగ్గరకు వచ్చాడు. "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే, తింటానికి ఈ రాళ్ళను రొట్టెలుగా మారమని చెప్పు" అన్నాడు. 4 కాని యేసు, "నేను అలా ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే

మనిషి కేవలం తిండి వల్ల మాత్రమే బతకడు.
దేవుడు మాట్లాడే ప్రతి మాట వినడం వల్ల బతుకుతాడు"

అని దేవుని వాక్యంలో రాసి ఉంది" అన్నాడు.

5 తరవాత సాతాను యేసును దేవుని పట్టణమైన యెరుషలేముకు తీసుకెళ్ళాడు. గుడి గోపురం మీద ఆయనను నిలబెట్టాడు. 6 "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే కిందకు దూకు. దూకినా నీకేమీ కాదు ఎందుకంటే,
"ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు.
వాళ్ళు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకొంటారు" అని లేఖనాలలో రాసి ఉంది కదా" అన్నాడు.

7 అందుకు యేసు "లేదు. నేను అలా దూకను.
"నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు" అని కూడా రాసి ఉంది" అని చెప్పాడు.

8 తరువాత సాతాను ఆయనను ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్ళాడు. అక్కడనుండి ప్రపంచ దేశాలనూ, వాటి వైభోగాలనూ ఆయనకు చూపించాడు. 9 "నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను పూజిస్తే ఈ దేశాలన్నింటినీ వాటిలో ఉన్న అద్భుతమైన వస్తువులనూ నీకిచ్చేస్తాను" అన్నాడు.

10 యేసు "సాతానూ అవతలికి పో. నేను నిన్ను ఎప్పటికీ పూజించను.
నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే పూజించాలి.
ఆయనకే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని రాసి ఉంది" అని చెప్పాడు.

11 దాంతో సాతాను ఆయనను వదిలి వెళ్ళాడు. వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు.

12 యేసు యూదయ ప్రాంతంలో ఉన్నప్పుడు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి హేరోదు రాజు యోహానును జైల్లో పెట్టించాడని చెప్పారు. అందుకని యేసు తిరిగి గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయాడు. 13 తరువాత నజరేతును విడిచి కపెర్నహూముకు వచ్చి అక్కడ నివసించాడు. అది గలిలయ సరస్సు తీరంలో జెబులూను, నఫ్తాలి తెగలు నివసించిన ప్రాంతం. 14 యెషయా ప్రవక్త చాలా కాలం క్రితం రాసిన మాటలు నెరవేరేలా యేసు అక్కడికి వెళ్ళాడు.
15 జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న
యూదేతరులు నివసించే గలిలయ ప్రాంతాల్లో
16 చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.
చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.

17 యేసు కపెర్నహూములో ఉన్నప్పుడే, "పరలోకం నుండి దేవుని రాజ్య పాలన సమీపిస్తూ ఉంది. ఆయన పరిపాలనలో మీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి పాపం చేయడం మానండి" అని బోధించడం మొదలుపెట్టాడు.

18 ఒకరోజు యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నాడు. అక్కడ ఇద్దరు మనుషులు కనిపించారు. వారిలో ఒకడు సీమోను, ఇంకొకడు అతని తమ్ముడు అంద్రెయ. వాళ్ళు సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు. 19 యేసు వారితో, "నాతో రండి. నాకు శిష్యులుగా చేయడం కోసం మనుషులను ఎలా తీసుకురావాలో నేను మీకు నేర్పుతాను. మనుషులను పట్టే జాలరులనుగా నేను మిమ్మల్ని చేస్తాను" అన్నాడు. 20 వెంటనే వాళ్ళు తాము చేస్తున్న పనిని వదిలి, ఆయనతో వెళ్ళారు.

21 అక్కడనుండి వాళ్ళు ముగ్గురూ వెళ్తుండగా యేసు మరి ఇద్దరిని చూశాడు. వాళ్ళు యాకోబూ అతని తమ్ముడు యోహానూ. వాళ్ళు తమ తండ్రితో కూడా పడవలో తమ వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు వాళ్ళను కూడా పిలిచాడు. 22 వాళ్ళు కూడా వెంటనే తమ తండ్రినీ వలలనూ విడిచి యేసుతో వెళ్ళారు.

23 యేసు ఆ నలుగురితో కలిసి గలిలయ ప్రాంతం అంతా తిరిగాడు. సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ దేవుని రాజ్య శుభవార్తను ప్రకటిస్తూ, రోగులను నయం చేస్తూ ఉన్నాడు. 24 సిరియాలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఈయన చేస్తున్నది విని రోగులందరినీ నానా విధాల వ్యాధుల చేతా యాతనలచేతా బాధలు పడుతున్న వారినీ దయ్యాలు పట్టినవారినీ మూర్ఛరోగులనూ పక్షవాత రోగులనూ ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు.

25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట వెళ్ళారు.