3

1 యేసు నజరేతులో ఉన్నప్పుడు, బాప్తిసమిచ్చే యోహాను యూదయ అరణ్యంలో ఒంటరిగా ఉంటూ తన దగ్గరకు వచ్చే ప్రజలకు పరలోకరాజ్యం గురించి చెపుతూ ఉన్నాడు. 2 "పాపం చేయకండి. పరలోకరాజ్యం దగ్గరగా ఉంది. మీరు ఇంకా పాపం చేస్తూ వుంటే దేవుడు మిమ్మల్ని తిరస్క రిస్తాడు" అని బోధిస్తూ ఉన్నాడు. 3 చాలాకాలం క్రితం యెషయా ప్రవక్త, "అరణ్యంలో ఒక స్వరం ఘోషిస్తూ ఉంది. ప్రభువు వస్తున్నాడు. అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆయన కోసం అన్నీ సిద్ధం చెయ్యండి" అని రాసింది ఇతని గురించే.

4 యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు బెల్టు కట్టుకునేవాడు. అడవిలో దొరికే మిడతల్నీ తేనెనూ తినేవాడు. 5 యెరూషలేము, యూదయ, యోర్దాను నదీ ప్రాంతాల వారంతా యోహాను బోధ వినడానికి వచ్చేవారు. 6 అతని బోధ విన్న తరవాత వాళ్ళు తమ పాపాలను ఒప్పుకున్నారు. యోహాను వారందరికీ బాప్తిసం ఇచ్చేవాడు.

7 చాలామంది పరిసయ్యులూ, సద్దూకయ్యూలూ ఆయన దగ్గరకు బాప్తిసం పొందడానికి రావడం యోహాను చూసి వారితో, "మీరు పాముపిల్లలు. మీ పాపాలను బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని మిమ్మల్ని ఎవరూ హెచ్చరించలేదా? దేవుని నుండి తప్పించుకోవచ్చని మీరు ఎప్పటికీ అనుకోవద్దు. 8 మీరు నిజంగా పాపం చేయడం మానేస్తే, దానికి రుజువుగా మంచి పనులు చెయ్యండి. 9 అబ్రాహాము సంతానానికి తోడుగా తాను ఉన్నానని దేవుడు చెప్పిన సంగతి నాకు తెలుసు. కాని "మేము అబ్రాహాము సంతానం, మేము పాపం చేసినా కూడా దేవుడు మమ్మల్ని శిక్షించడు" అని మీరు అనుకోవద్దు. మీకు తెలుసా? దేవుడు ఈ రాళ్ళ నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు. 10 మంచి కాయలు కాయని ప్రతి చెట్టును నరికి మంటల్లో పడేస్తారు. అలాగే దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు" అని చెప్పాడు.

11 "నా వరకు నేను అంత ముఖ్యమైనవాణ్ణి కాదు. ఎవరైనా తమ పాపాలను ఒప్పుకుంటే నేను కేవలం నీళ్ళతో బాప్తిసం ఇస్తాను. కాని గొప్ప శక్తిమంతుడు తొందరలో రాబోతున్నాడు. అతడు నాకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పులను మోయటానికి కూడా నేను పనికిరాను. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిసం ఇస్తాడు. 12 మంచి గోదుమలను పొట్టు నుండి వేరు చేయటానికి తూర్పారబట్టే చేట ఆయన పట్టుకుని ఉన్నాడు. రైతు మంచి గోదుమలను తన గిడ్డంగిలో దాచుకున్నట్టు దేవుడు కూడా నీతిమంతులను పరలోకానికి తీసుకు పోతాడు. పొట్టును మంటల్లో వేసి కాల్చినట్టుగా ఆయన చెడ్డవారిని ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు."

13 ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం తీసుకోటానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. 14 యేసు యోహానును బాప్తిసం ఇమ్మని అడిగాడు. యోహాను "అసలు నేను నీచేత బాప్తిసం తీసుకోవాలి. నువ్వు పాపివి కాదు గదా, అలాటిది నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి?" అన్నాడు. 15 అందుకు యేసు, "ప్రస్తుతానికి బాప్తిసం ఇవ్వు. మనం ఇద్దరం ఈ విధంగా చేయడం దేవుని సంకల్పం" అన్నాడు. దాంతో యోహాను ఆయనకు బాప్తిసమిచ్చాడు.

16 యేసు బాప్తిసం తీసుకొని ఒడ్డుకి వచ్చిన వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురం లాగా తన మీదకి వాలడం ఆయన చూశాడు. 17 "ఈయన నా ఇష్టమైన కుమారుడు. నేను ఈయనను ప్రేమిస్తున్నాను. ఈయనంటే నాకెంతో సంతోషం" అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.