2

1 మహా హేరోదు రాజు పరిపాలించే కాలంలో యూదయలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టాడు. కొంతకాలం గడిచిన తరువాత తూర్పున ఉన్న సుదూర ప్రాంతం నుండి, నక్షత్రాలను పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ ఉండే కొందరు యెరూషలేముకు వచ్చారు. 2 వాళ్ళు అక్కడి వాళ్ళతో "యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టాడని తెలియచేసే నక్షత్రాన్ని మేము తూర్పు దిక్కున చూసాము. ఆయనను ఆరాధించడానికి వచ్చాం" అన్నారు.

3 వాళ్ళు అడుగుతున్న విషయాన్ని గురించి హేరోదు రాజు విని చాలా కంగారుపడ్డాడు. యెరూషలేములో చాలామంది కూడా కంగారుపడ్డారు. 4 అప్పుడు రాజు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు అందరినీ పిలిపించాడు. "క్రీస్తు ఎక్కడ పుడతాడని ప్రవక్తలు ముందుగా చెప్పారో చూడండి" అని వారిని అడిగాడు. 5 అందుకు వాళ్ళు "యూదయలోని బేత్లేహేము అనే గ్రామంలోనే ఆయన పుట్టాలి. ఎందుకంటే చాలాకాలం కిందట మీకా అనే ప్రవక్త ముందుగానే రాశాడు. 6 యూదయలోని బేత్లేహేము గ్రామమా, యూదా పట్టణాలన్నిటికీ నువ్వేమీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను పాలించేవాడు నీలో నుండే వస్తాడు."

7 అప్పుడు హేరోదు నక్షత్రాల సూచనలు చూసే ఆ శాస్త్రజ్ఞులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలాలను వాకబు చేశాడు. 8 తరువాత వారిని బేత్లేహెముకు పంపిస్తూ "మీరు వెళ్ళి ఆ పిల్లవాడి కోసం బాగా వెదకండి. మీరు ఆయనను చూశాక నాకూ చెప్పండి. నేను వచ్చి ఆయనను ఆరాధిస్తాను" అన్నాడు.

9 రాజు చెప్పింది విన్న తరువాత ఆ మనుషులు బేత్లెహేము వైపుకు బయలుదేరారు. ఆశ్చర్యం! తూర్పున వాళ్ళు చూసిన నక్షత్రం మళ్లీ వాళ్ళకి ముందుగా వెళుతూ కనపడింది. 10 ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎగిరి గంతేసి దాన్ని వెంబడించారు. అది ఆ పిల్లవాడు ఉన్న ఇంటిపైగా ఆగింది.

11 వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడినీ, తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి నమస్కరించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, ఖరీదైన సాంబ్రాణి , బోళం అనే పరిమళ ద్రవ్యం కానుకలుగా ఆయనకు సమర్పించారు. 12 దేవుడు వాళ్ళకి కలలో కనపడి హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని హెచ్చరించాడు. కాబట్టి వాళ్ళు వేరే దారిలో తమ దేశం వెళ్ళిపోయారు.

13 వాళ్ళు బేత్లేహేమును వదిలి వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, "పిల్లవాడినీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపో. నేను నీకు మళ్ళీ చేప్పేవరకు అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ పిల్లవాడిని చంపాలని తన సైనికులను పంపిస్తున్నాడు" అని చెప్పాడు. 14 ఆ రాత్రివేళ యోసేపు లేచి పిల్లవాడినీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉండి, తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తిరిగి వచ్చారు.
15 "ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచాను." అని హోషేయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.

16 జ్ఞానులు తనను మోసం చేసారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. జ్ఞానులు ఆ నక్షత్రం ద్వారా తన దగ్గరకు వచ్చిన కాలాన్ని లెక్కగట్టి ఆ పిల్లవాడి వయస్సును అంచనా వేసుకున్నాడు. దాని ప్రకారం బెత్లెహేములో, చుట్టూ ఉన్న గ్రామాల్లో రెండేళ్ళు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపమని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. 17 దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఈ విధంగా నెరవేరాయి.
18 రామాలో స్త్రీలు శోకిస్తూ ఉన్నారు. రాహేలు చనిపోయిన తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.
పిల్లలందరూ చనిపోవటం వల్ల ఎంత ఆదరించాలని చూసినా ఆమె ఓదార్పు పొందలేకపోయింది.

19 హేరోదు చనిపోయిన తరవాత ప్రభువు దూత ఐగుప్తులో ఉన్న యోసేపుకు కలలో కనపడి, 20 "పిల్లవాడి ప్రాణం తీయాలని ప్రయత్నించిన వాళ్ళు చనిపోయారు. కనుక నువ్వు లేచి పిల్లవాడినీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు" అని చెప్పాడు. 21 అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణి, తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళాడు.

22 అయితే అర్కేలా తన తండ్రి హేరోదుకు బదులుగా యూదయ ప్రాంతాన్ని ఏలుతున్నాడని యేసేపు విని, అక్కడికి వెళ్ళటానికి భయపడ్డాడు. తరువాత దేవుడు కలలో అతడితో చెప్పటంతో యోసేపు, మరియ, ఆ పిల్లవాడు గలిలయలోని నజరేతుకు వెళ్ళారు. 23 యేసును నజరేయుడు అంటారని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.