15

1 కొందరు పరిసయ్యులూ యూదు పండితులూ కొందరు యెరూషలేము నుండి యేసుతో మాట్లాడడానికి వచ్చారు. 2 వాళ్ళు, "మన పూర్వీకుల దగ్గరనుండి ఆచరిస్తున్న సంప్రదాయాన్ని మీ శిష్యులు పాటించడం లేదు. భోజనం చేసే ముందు చేతులు కడిగే ఆచారాన్ని పాటించడం లేదు" అన్నారు.

3 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "మీరు మీ పితరులు నేర్పించినవి పాటిస్తూ, దేవుడి ఆజ్ఞలకి లోబడడం తోసిపుచ్చుతున్నారు. 4 దేవుడు ఈ రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. "మీ తలిదండ్రుల్ని గౌరవించాలి, తలిదండ్రులను గురించి చెడ్డగా మాట్లాడే వాళ్లకు మరణ శిక్ష వేయాలి" అని. 5 కానీ ప్రజలకు మీరేమి చెప్తారంటే, "నేను మీకు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేస్తానని ప్రమాణం చేసాను" అని తమ తలిదండ్రులకి చెప్పొచ్చు. 6 మీరు అలా చేస్తే మీ తలిదండ్రులకి ఏమీ ఇవ్వక్కరలేదు అంటారు. ఇలా దేవుడు ఆజ్ఞాపించింది పట్టించుకోరు కానీ మీ పూర్వికులు చెప్పింది చెప్పినట్టే తప్పకుండా పాటిస్తారు."

7 మీరు మంచి వాళ్ళల్లా మాత్రమే నటిస్తారు. మీ పితరుల గురించి దేవుడి ఆలోచన యెషయా ప్రవక్త చెప్పినప్పుడు మీ గురించి నిజాన్ని మాట్లాడుతూ, 8 "వీళ్ళు నన్ను గౌరవించినట్టు మాట్లాడతారు కానీ వాళ్ళు అసలు నన్ను పట్టించుకోరు. 9 ప్రజలు అనుకున్నవే సిద్ధాంతాలుగా బోధిస్తారు కాబట్టి వాళ్ళు నన్ను ఆరాధించడం వ్యర్థం" అన్నాడు. 10 అప్పుడు యేసు జనాన్ని తన దగ్గరికి పిలిచాడు. ఆయన వాళ్ళతో, "నేను మీతో చెప్పేది విని అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి. 11 ఒక వ్యక్తి తినడానికి నోటిలో పెట్టుకున్నదేదీ అతన్ని కలుషితం చెయ్యదు కాని, నోటి నుండి వచ్చే మాటలు మనిషిని దిగజారుస్తాయి" అన్నాడు.

12 తరవాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, "నువ్వు చెప్పిన మాటలు పరిసయులకు కోపం తెప్పించాయి. నీకు తెలుసా?" అన్నారు. 13 అప్పుడు యేసు వాళ్లకు ఈ ఉపమానం చెప్పాడు. "ఒక రైతు తను నాటని మొక్కని ఎలా వ్రేళ్ళతో సహా పీకి పడేస్తాడో, అలా పరలోకంలో ఉన్న నా తండ్రి తను చెప్పిన వాటికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళని వదిలించేసుకుంటాడు."

14 "పరిసయుల్ని ఏమీ పట్టించుకోవద్దు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. అలా చేస్తే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు. అలాగే దేవుని ఆజ్ఞల్ని ప్రజలు అర్థం చేసుకోడానికి వాళ్ళు సాయం చెయ్యలేరు." 15 ఒక వ్యక్తి తినే భోజనం గురించి చెప్పిన ఉదాహరణ వివరించమని యేసును పేతురు అడిగాడు. 16 యేసు వాళ్ళకు ఇలా జవాబు చెప్పాడు, "నేను మీకు బోధించేది కచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోలేక పోవడం నన్ను నిరాశ పరిచింది."

17 "మీరు తప్పక అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, మనుషులు ఏది తిన్నా అది వాళ్ళ కడుపులోకి వెళ్తుంది. తరవాత శరీరంలో నిలిచిపోయింది బయటికి వచ్చేస్తుంది. 18 నోటితో మాట్లాడే చెడ్డమాటలు దేవుడు ఆ వ్యక్తిని తృణీకరించేలా చేస్తుంది. హృదయంలో మనిషి చేసే చెడు ఆలోచనల నుండి అవి వస్తాయి. 19 చెడు ఆలోచనలు, హత్య, వ్యభిచారం, ఇతర లైంగిక పాపాలు, దొంగతనం, అబద్ద సాక్ష్యం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం హృదయంలోనుండే వస్తాయి. 20 దేవుడు మనుషుల్ని అంగీకరించకుండా చేసేవి అవే. కానీ చేతులు కడుక్కోకుండా తినడం దేవుడు తృణీకరించడానికి కారణం కాదు."

21 యేసు శిష్యుల్ని తీసుకుని గలిలయ జిల్లాకు వెళ్ళి, తూరు సీదోను పట్టణాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. 22 ఆ ప్రాంతంలో ఉంటున్న కానాను గుంపుకు చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. ఆమె గట్టిగా అరుస్తూ, "ప్రభూ నువ్వు దావీదు మహారాజు సంతతికి చెందిన వాడివి. నువ్వు క్రీస్తువు. నా మీద, నా కూతురు మీద జాలి చూపించు. ఆమె దయ్యం అదుపులో ఉండి, చాలా బాధపడుతుంది" అంది. 23 కానీ యేసు ఆమెకి జవాబు చెప్పలేదు. శిష్యులు ఆయనతో, "ఆమె అరుచుకుంటూ, మన వెనకే వస్తూ ఇబ్బంది పెడుతుంది. వెళ్ళిపొమ్మని చెప్పు" అన్నారు. 24 "తప్పిపోయిన గొర్రెల్లా ఉన్న ఇశ్రాయేలు ప్రజల కోసమే దేవుడు నన్ను పంపాడు" అని యేసు ఆమెతో చెప్పాడు. 25 కానీ ఆ స్త్రీ యేసుకు ఇంకా దగ్గరికి వచ్చి, ఆయన ముందు మోకరించి, బ్రతిమాలుతూ, "ప్రభూ, సాయం చెయ్యవా" అని అడిగింది.

26 అప్పుడు ఆయన ఆమెతో, "పిల్లల కోసం సిద్ధపరచిన ఆహారాన్ని ఇంట్లోని కుక్క పిల్లలకి వెయ్యడం భావ్యం కాదు" అన్నాడు. 27 కాని ఆ స్త్రీ జవాబిస్తూ, "ప్రభూ! మీరు చెప్పింది సబబే. కానీ కుక్కపిల్లలు కూడా యజమాని భోజనం చేసే బల్ల మీద నుండి క్రింద పడిన రొట్టె ముక్కల్ని తింటాయి కదా" అంది. 28 అప్పుడు యేసు ఆమెతో, "ఓ స్త్రీ! నా మీద నీకు స్థిరంగా నమ్మకముంది కాబట్టి నువ్వు కోరుకున్నట్టే నీ కూతుర్ని స్వస్థపరుస్తాను" అన్నాడు. ఆ క్షణమే ఆమె కూతుర్ని దయ్యం వదిలి పోయింది. ఆమె బాగయ్యింది.

29 తరవాత యేసు , ఆయన శిష్యులు ఆ ప్రదేశం వదిలి, గలిలయ సముద్రం దగ్గరలో ఉన్న కొండ పైకి ఎక్కి ప్రజలకి బోధించడానికి కూర్చున్నాడు. 30 అక్కడ తరవాతి రెండు రోజులూ జనం పెద్ద గుంపులుగా వస్తూనే ఉన్నారు. కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, మూగవాళ్ళని, ఇతర వ్యాధులతో ఉన్నవాళ్ళని యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. బాగు చెయ్యడానికి వాళ్ళని ఆయన ముందు ఉంచారు. ఆయన వాళ్ళని బాగుచేసాడు. 31 మూగవాళ్ళు మాట్లాడడం, కుంటివాళ్ళు నడవడం, వికలాంగులు బాగుపడడం, గుడ్డివాళ్లకు చూపు రావడం చూసి అక్కడివాళ్లు ఆశ్చర్యపడ్డారు. "ఇశ్రాయేలు దేశంలో మన మీద ఏలిక చేస్తున్న దేవునికి స్తోత్రం!" అన్నారు.

32 అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి, "వాళ్ళందరూ నాతో మూడు రోజులుగా ఉంటున్నారు. వాళ్లకి తినడానికి ఏమీ లేదని విచారంగా ఉంది. ఆకలితో వాళ్ళని పంపివేయడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే మధ్యలో వాళ్ళు మూర్చపోవచ్చు" అన్నాడు. 33 అప్పుడు శిష్యులు, "ఇది ఎవరూ నివసించే స్థలం కాదు. ఇంత పెద్ద జన సమూహానికి సరిపడేంత ఆహారం తేవడం కష్టం" అన్నారు. 34 "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి" అని యేసు వాళ్ళని అడిగాడు. వాళ్ళు, "ఏడు చిన్న రొట్టెలు, వండిన రెండు చిన్న చేపలు ఉన్నాయి" అన్నారు. 35 అప్పుడు యేసు జనాన్ని నేల మీద కూర్చోమన్నాడు.

36 ఆయన ఏడు రొట్టెలు, రెండు వండిన చేపల్ని తీసుకుని, దేవునికి వందనాలు చెప్పి, వాటిని ముక్కలు చేసి, వాళ్లకి ఇస్తూ ఉండమని శిష్యులకి చెప్పాడు. అప్పుడు శిష్యులు జనానికి పంచసాగారు. 37 యేసు అద్భుతంగా ఆహారాన్ని విస్తారం చేసాడు. వాళ్ళందరూ కావలసినంత తృప్తిగా తిన్నారు. శిష్యులు మిగిలిన ముక్కల్ని పోగుచేశారు. అవి ఏడు పెద్ద గంపలు అయ్యాయి. 38 అక్కడ భోజనం చేసిన పురుషులు నాలుగు వేల మంది. స్త్రీలని, పిల్లల్ని లెక్కపెట్టిన వాళ్ళు లేరు.

39 యేసు ప్రజలందరినీ పంపించేసి, ఆయన, శిష్యులు పడవ ఎక్కి సరస్సు మీద పడవ నడుపుకుంటూ మగదాను ప్రాంతానికి వెళ్ళారు.