14

1 ఆ కాలంలో హేరోదు అంతిప దేశాన్ని ఏలుతున్నాడు. అతడు యేసు చేసిన అద్భుతాలు గురించి వార్తలు విన్నాడు. 2 అతను తన సేవకులతో, "అతడు బాప్తిసమిచ్చే యోహానై ఉంటాడు. చనిపోయినవాడు బ్రతికి ఉంటాడు. అందుకే అతనికి అద్భుతాలు చేసే శక్తి వచ్చింది" అన్నాడు.

3 హేరోదు విషయంలో జరిగింది ఇది - హేరోదు తన సోదరుడు ఫిలిప్పు ఇంకా బ్రతికి ఉండగానే, అతని భార్య హేరోదియను పెళ్ళిచేసుకున్నాడు. 4 కాబట్టి యోహాను నువ్వు దేవుని నియమానికి వ్యతిరేకంగా చేసావు అని హేరోదుతో అన్నాడు. ఆ మాట హేరోదియకు రుచించలేదు. హేరోదు ఆమెను సంతోషపెట్టడానికి యోహానును సైనికులను పంపి బంధించాడు. వాళ్ళు యోహానును గొలుసులతో బంధించి, చెరసాలలో వేశారు. 5 యోహాను తల నరికేయాలని హేరోదు తన మనుషులకి ఆజ్ఞ జారీ చేయాలనుకున్నాడు కాని, దేవుని తరుపున మాట్లాడే ప్రవక్తగా యోహానును సాధారణ జనం నమ్మారు. కాబట్టి హేరోదు వాళ్లకి భయపడ్డాడు.

6 ఒకరోజు హేరోదు తన పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఉండగా హేరోదియ కూతురు అతిథుల కోసం నాట్యం చేసింది. ఆ నాట్యం హేరోదుని ఎంతో సంతోషపెట్టింది. 7 నీకు ఏమి కావాలో అది ఇస్తాను అని మాట ఇచ్చాడు. పైగా దేవుని సాక్షిగా ప్రమాణం చేసాడు. 8 హేరోదియ కూతురు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏమి అడగమంటావని సలహా అడిగింది. ఏమి అడగాలో చెప్పింది. అప్పుడు హేరోదియ కూతురు హేరోదు దగ్గరికి వెళ్ళి, "బాప్తిసమిచ్చే యోహాను తల నరికి, నిజంగా చనిపోయాడో లేదో తెలియడానికి అతని తల పళ్ళెంలో పెట్టి, తెచ్చి ఇవ్వండి" అంది.

9 హేరోదియ కూతురుకి ఏమి కావాలో అది ఇస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసినందుకు చాలా బాధపడ్డాడు. అతిధులందరూ అలా ప్రమాణం చెయ్యడం విన్నారు కాబట్టి అలా చెయ్యక తప్పలేదు. తన సేవకులకు ఆమె అడిగింది చెయ్యమని ఆజ్ఞ జారీ చేసాడు. 10 యోహాను తల నరికి తెమ్మని సైనికులను పంపాడు. 11 వాళ్ళు ఆ ప్రకారమే యోహాను తల పళ్ళెంలో పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి తెచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది. 12 తరవాత యోహాను శిష్యులు జైలుకు వెళ్ళి యోహాను శరీరాన్ని తెచ్చి పాతిపెట్టారు. తరవాత వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు.

13 యేసు ఆ వార్త విన్న తరవాత తన శిష్యుల్ని మాత్రమే వెంటబెట్టుకుని గలిలయ సరస్సు పడవలోదాటి ఎవ్వరూ లేని ప్రదేశానికి బయలుదేరాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ప్రజలు తెలుసుకుని, కాలినడకన అక్కడికి వెళ్ళారు. 14 యేసు ఒడ్డుకు చేరేసరికి చాలా పెద్ద ఎత్తున జన సమూహం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళల్లో ఉన్న రోగుల్ని స్వస్థపరిచాడు.

15 సాయంత్రం అవుతుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది ఎవ్వరూ నివసించే ప్రదేశం కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. జనాన్ని పంపించేస్తే దగ్గరలో ఉన్న గ్రామాల్లో తినడానికి ఏమైనా కొనుక్కుంటారు" అన్నారు. 16 కానీ యేసు తన శిష్యులతో, "భోజనం కోసం వాళ్ళు వెళ్లక్కరలేదు. వాళ్ళు తినడానికి మీరే ఏమన్నా ఇవ్వండి" అన్నాడు. 17 దానికి శిష్యులు, "కానీ మన దగ్గర ఇప్పుడు ఐదు రొట్టెలు, రెండు వండిన చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి" అన్నారు. 18 ఆయన, "వాటిని నా దగ్గరికి తీసుకురండి" అని, 19 జన సమూహాన్ని అక్కడ ఉన్న గడ్డి మీద కూర్చోమని చెప్పాడు. ఐదు రొట్టెలు, రెండు చేపల్ని చేతుల్లోకి తీసుకుని ఆకాశం వైపు చూసి దేవునికి వందనాలు చెప్పి, వాటిని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు శిష్యులకు ఇచ్చి అందరికీ పంచిపెట్టమని చెప్పాడు. వారు ఆయన చెప్పినట్టే చేశారు. 20 అందరూ ఆకలి తీరే వరకూ తిన్నారు. మిగిలిన ముక్కల్ని కొందరు పోగుచేస్తే, మొత్తం పన్నెండు గంపలు అయ్యాయి. 21 స్త్రీలు పిల్లలు కాకుండా లెక్క బెడితే ఇంచు మించు ఐదు వేలమంది పురుషులు అక్కడ తిన్నారు.

22 ఇది జరిగిన తరవాత యేసు ఆ జనాన్ని ఇంటికి పంపించేస్తూ తన శిష్యులతో పడవ ఎక్కి తన కంటే ముందు గలిలయ సముద్రం అవతలి వైపుకు వెళ్ళమని చెప్పాడు. 23 వాళ్ళను పంపించేశాక ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోడానికి కొండల్లోకి వెళ్ళాడు. సాయంత్రమైపోయినా ఆయన ఇంకా అక్కడే ఒంటరిగా ఉన్నాడు.

24 ఆ సమయానికి శిష్యులు తీరంనుండి చాలా దూరం లోపలికి వెళ్ళిపోయారు. శిష్యులు పడవ నడుపుతుంటే ఎదురు గాలి బలంగా వీస్తూ ఉంది. గాలికి చాలా పెద్ద అలలు ఏర్పడి, అలల తాకిడికి పడవ విపరీతంగా ఊగిసలాడుతూ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది.

25 అప్పుడు యేసు కొండల్లోనుండి సరస్సు దగ్గరికి వచ్చాడు. తెల్లవారు జామున మూడు, ఆరు గంటల మధ్యలో పడవ దగ్గరికి నీటి మీద నడుస్తూ వచ్చాడు. 26 ఆయన నీటి మీద నడవడం శిష్యులు చూసి భూతం అనుకున్నారు. వాళ్ళు హడలిపోయి, భయంతో గగ్గోలు పెట్టారు. 27 వెంటనే యేసు వాళ్ళను వారిస్తూ, "నేనే, భయంలేదు. ధైర్యం తెచ్చుకోండి" అన్నాడు.

28 పేతురు ఆయనతో, "ప్రభూ, నువ్వే అయితే నీ దగ్గరికి నేను నడిచి రావచ్చా?" అన్నాడు. 29 యేసు పేతురుతో "రా!" అన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసు వైపు వెళ్ళాడు. 30 కానీ పేతురు దృష్టి బలంగా వీచే గాలి మీదకు మళ్ళినప్పుడు అతనికి భయం వేసింది. నీళ్ళల్లో మునిగిపోతూ "ప్రభూ రక్షించూ!" అని అరిచాడు. 31 వెంటనే యేసు అతని దగ్గరికి చేరి, పేతురును పైకి లాగాడు. ఆయన పేతురుతో, "నువ్వు నా శక్తిని కొంతవరకే నమ్మావు. నువ్వు మునిగిపోడానికి నేను వదిలేస్తానని ఎందుకు అనుమానించావు?" అన్నాడు. 32 తరువాత యేసూ పేతురూ పడవ ఎక్కారు. వెంటనే అప్పటి వరకూ బలంగా వీస్తున్న గాలి ఆగిపోయింది. 33 పడవలో ఉన్న శిష్యులందరూ వంగి యేసుకు నమస్కారం చేసి, "నువ్వు నిజంగా దేవుని కుమారుడివే!" అన్నారు.

34 వాళ్ళు సరస్సు చుట్టు తిరిగి గెన్నేసరెతు తీర ప్రాంతానికి చేరుకున్నారు. 35 అక్కడి వాళ్ళు యేసును గుర్తుపట్టారు. యేసు వచ్చాడనే వార్తను ఆ ప్రాంతమంతా తెలిపారు. అక్కడి ప్రజలు యేసు దగ్గరికి రోగుల్ని తీసుకుని వచ్చారు. 36 రోగులు ఆయన్ని ఒకసారి ముట్టుకోనిమ్మని, ఆయన అంగీ అంచు అయినా సరే ముట్టుకుంటే స్వస్థపడతామని వాళ్ళని బతిమాలారు. ఆయన్ను, కనీసం ఆయన అంగీ అంచును ముట్టిన వాళ్ళందరూ స్వస్థత పొందారు.