16

1 ఒకసారి కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి, "యేసూ, నువ్వు నిజంగా దేవుడే నిన్ను పంపాడని మాకు నమ్మకం కుదిరేలా దేవుడి శక్తిని ఉపయోగించి ఒక అద్బుతం చేసి చూపించు" అన్నారు. 2 అందుకు యేసు వాళ్ళతో, "మన దేశంలో సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా కనబడితే "రేపంతా వాతావరణం చక్కగా ఉంటుంది" అని చెబుతాం."

3 "అదే పొద్దున పూట ఆకాశం ఎర్రగా కనిపిస్తే, "ఈ రోజు మబ్బులతో గాలివాన కురుస్తుందేమో" అని చెబుతాం. ఆకాశంలోకి చూసి మన చుట్టుపక్కల ఏమి జరగబోతుందో మీరు చెప్పగలుగుతున్నారు గానీ దేవుడు చేసే పనులను గురించి మీరు అర్థం చేసుకోలేరు. 4 చెడ్డవాళ్లైన మీరు సూచక క్రియలు అడుగుతున్నారు గాని మీరు దేవుని మనసారా పూజింపరు. కాబట్టి ఒక పెద్ద చేప కడుపులో మూడు రోజులు గడిపి తిరిగి వచ్చిన యోనా ప్రవక్తను గురించిన సూచక క్రియ తప్పించి మీకు ఎలాంటి సూచనా ఇవ్వడం జరగదు" అన్నాడు.

5 తరువాత యేసు శిష్యుల్ని వెంటబెట్టుకుని గలిలయ సముద్రం ఒడ్డుకు బయలుదేరాడు. అక్కడకు చేరిన తరువాత, తినడానికి ఏమీ తమతోపాటు తెచ్చుకోలేదన్నసంగతి శిష్యులకు గుర్తుకు వచ్చింది. 6 అదే సమయంలో యేసు, "పొంగజేసే పదార్థం లాంటి పరిసయ్యుల, సద్దూకయ్యుల పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు. 7 యేసు చెప్పిన ఈ మాటలను శిష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. తినడానికి ఏమీ తేలేదని యేసు ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు. 8 యేసు వాళ్ళు మాట్లాడుకుంటున్నది తెలుసుకుని, "నేను పరిసయ్యులు, సద్దూకయ్యుల వంటి పొంగజేసే పిండిని గురించి మాట్లాడుతుంటే మీరేమో మనం రోజూ తినే రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. నాకెంతో బాధ కలుగుతుంది. నేను చిన్న చిన్నపనులు మాత్రమే చేస్తానని నమ్ముతున్నారు."

9 "నేను తిండి గురించి కంగారు పడుతున్నానని అస్సలు అనుకోవద్దు. నేను ఒకసారి ఐదు రొట్టెలను దీవించి ఐదు వేలమంది ఆకలి తీర్చాను. అప్పుడు మిగిలిపోయిన రొట్టెలు మీరే గంపల్లోకి పోగుచేశారు. 10 ఇంకోసారి ఏడు రొట్టె ముక్కలతో నాలుగు వేలమంది ఆకలి తీర్చానన్న సంగతి మీరు మర్చిపోయారా? అప్పుడు కూడా మిగిలిపోయిన రొట్టెలు గంపల్లోకి ఎత్తింది మీరే కదా.

11 "నేను రొట్టెల గురించి మాట్లాడడం లేదని మీరు అర్థం చేసుకోవాలి. పరిసయ్యులు, సద్దూకయ్యుల వంటి పొంగజేసే పిండిని గురించి నేను మాట్లాడుతున్నాను." 12 అప్పుడు శిష్యులు, యేసు రొట్టేలలో వేసే పొంగజేసే పిండి గురించి మాట్లాడడం లేదనీ, పరిసయ్యులు, సద్దూకయ్యులు బోధించే తప్పుడు విషయాల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్నారు.

13 తరువాత యేసు తన శిష్యులతో కలసి కైసరయ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చాడు. "నేను నిజంగా మనుష్యకుమారుడినని ప్రజలు చెప్పుకుంటున్నారా?" అని శిష్యుల్ని అడిగాడు. 14 అప్పుడు వాళ్ళు, "కొందరు నువ్వు మళ్ళీ బ్రతికి వచ్చిన బాప్తిసమిచ్చే యోహానువనీ, మరికొందరు దేవుడు చెప్పినట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఏలీయావనీ, కొందరేమో పూర్వం జీవించిన యిర్మీయా లాంటి ప్రవక్తలలో ఒకడివని చెప్పుకుంటున్నారు" అని చెప్పారు.

15 "అలాగైతే నా గురించి మీరు ఏమనుకుంటున్నారు?" అని యేసు అడిగాడు. 16 అప్పుడు సీమోను పేతురు "నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన మెస్సీయవి" అన్నాడు. 17 అప్పుడు యేసు, "యోనా కొడుకువైన సీమోనూ, నువ్వు ఈ మాట చెప్పి దేవుడికి సంతోషం కలిగించావు. వేరే మనుషులెవ్వరూ నీకు ఈ విషయం చెప్పలేదు. పరలోకంలో ఉన్న దేవుడే నువ్వు ఈ విషయం గ్రహించేలా చేశాడు. 18 ఇదిగో చెప్తున్నా విను: నువ్వు పేతురువు. అంటే నువ్వు రాయిలాంటి వాడివి. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది రాయి ఎంత ముఖ్యమో నువ్వు అలాంటివాడివి. నన్ను నమ్మిన వాళ్ళందరికీ నువ్వు అండగా ఉంటావు. మృత్యు బలం కూడా నీ ముందు నిలబడలేదు."

19 యేసు ఇంకా ఇలా అన్నాడు, "ఈ మనుషులు దేవుని రాజ్యంలో ప్రవేశించే తలుపులు తీయడానికి, మూయడానికి నీకు అధికారం ఇవ్వబడుతుంది. ఇక్కడ నువ్వు ఒప్పుకున్నవాటిని పరలోకంలో దేవుడు ఒప్పుకుంటాడు, నువ్వు కాదన్నవాటిని దేవుడు కాదంటాడు."

20 తరువాత యేసు, తానే మెస్సీయ అన్నవిషయం ఎవ్వరికీ చెప్పవద్దని తన శిష్యులను గట్టిగా హెచ్చరించాడు.

21 ఇక అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళవలసి ఉన్నదనీ, అక్కడ అధికారులైన పెద్దల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, యూదు చట్టాలు బోధించే పండితుల ద్వారా హింసించబడి చనిపోతాననీ, తరువాత మూడవ రోజున మళ్ళీ బ్రతికి తిరిగి లేస్తాననీ చెప్పడం మొదలుపెట్టాడు. 22 ఇది విన్న పేతురు యేసును పక్కకు తీసుకువెళ్ళాడు. "ప్రభూ, దేవుడు ఇలా జరగకుండా చెయ్యాలి. ఇది నీకు ఎట్టి పరిస్థితిలో జరగకూడదు" అని గద్దింపు స్వరంతో అన్నాడు.

23 అప్పుడు యేసు పేతురు వైపు చూసి, "నా దగ్గర నుండి వెళ్ళిపో! సాతాను నీలో ప్రవేశించి ఇలా మాట్లాడిస్తున్నాడు. నువ్వు నాచేత పాపం చేయించాలని చూస్తున్నావు, నువ్వు దేవుడు ఆలోచిస్తున్నట్టు కాకుండా మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు."

24 తరువాత యేసు శిష్యులతో, "ఎవరైనా నన్ను నమ్మి నా అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటే వాళ్ళు తమకున్నవన్నీ విడిచిపెట్టి, తమ సొంత సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి." 25 తన ప్రాణం కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవాడు అందుకు బదులు తన ప్రాణం పోగొట్టుకుంటాడు. అయితే నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 26 ఒక మనిషి ఈ లోకంలో తాను కోరుకున్నదంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి దక్కుతుంది? తన ప్రాణంకన్నా విలువైనది మనిషి ఏమి ఇవ్వగలడు?

27 జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుడినైన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం నుండి దూతలతో కలసి ఈ లోకానికి తిరిగి వస్తాను. అప్పుడు తండ్రి మహిమ వెలుగు నాపై ఉంటుంది. నేను ఈ లోకంలో ప్రతివారికీ వాళ్ళు చేసిన అన్ని రకాల పనులబట్టి వాళ్లకు బహుమతులు ఇస్తాను. 28 ఇప్పుడు ఇక్కడ నన్ను చూస్తున్నవాళ్ళలో కొందరు వాళ్ళు చనిపోకముందే నేను రారాజుగా పరలోకం నుండి దిగి రావడం చూస్తారని మీతో కచ్చితంగా చెప్తున్నాను.