28

1 విశ్రాంతి దినం అయిపోగానే ఆదివారం ఉదయాన్నే మగ్దల గ్రామానికి చెందిన మరియ, ఇంకొక మరియ కలిసి యేసు సమాధి దగ్గరకి వెళ్ళారు. 2 ఒక బలమైన దేవదూత పరలోకం నుండి దిగిరావడం వలన అక్కడ పెద్ద భూకంపం కలిగింది. అతడు వచ్చి ఆ సమాధి ముఖద్వారానికి అడ్డుగా నిలిపిన ఆ రాతిని దొర్లించి వేసి, ఆ రాతి మీద ఎక్కి కూర్చున్నాడు. 3 అతని రూపం మెరుపులాగా వెలిగిపోతున్నది. అతని వస్త్రాలు మంచులాగా తెల్లగా ఉన్నాయి.

4 అక్కడ కావలి ఉన్న భటులు భయంతో వణికిపోయారు. చివరికి వాళ్ళు చచ్చిపోయిన వారిలాగా కింద పడిపోయారు.

5 ఆ దూత ఆ స్త్రీలతో ఇలా చెప్పాడు, "భయపడాల్సిన పని లేదు! సిలువకు మేకులతో కొట్టిన యేసు కోసం మీరు వెదకుతున్నారని నాకు తెలుసు. 6 ఆయన ఇక్కడ లేడు! యేసు మీతో ఏమని చెప్పాడో అలాగే దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. రండి, వచ్చి ఆయన శరీరం ఉంచిన స్థలం చూడండి! 7 తరవాత వెంటనే వెళ్ళి "ఆయన మరణం నుండి తిరిగి లేచాడు! మీకంటే ముందుగా గలలియకు వెళ్తాడు, అక్కడ మీరు ఆయన్ని చూడొచ్చు" అని ఆయన శిష్యులతో చెప్పండి. నేను మీతో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి!"

8 వెంటనే ఆ స్త్రీలు సమాధిని వదిలి వెళ్ళిపోయారు. వాళ్లకి చాలా భయం వేసింది గానీ అదే సమయంలో చాలా సంతోషంతో నిండిపోయారు. ఏమి జరిగిందో శిష్యులతో చెప్పడానికి పరుగెత్తి వెళ్ళారు. 9 వాళ్ళు పరుగెత్తుతూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళకి యేసు ప్రత్యక్షం అయ్యాడు. "మీకు శుభం కలుగుతుంది!" అని ఆయన వారితో అన్నాడు. ఆ స్త్రీలు ఆయన దగ్గరగా వచ్చి ఆయన పాదాలకు మొక్కారు. 10 అప్పుడు యేసు వారితో, "భయపడవద్దు! వెళ్ళి, నా శిష్యులందరూ గలలియకు వెళ్లాలని వారితో చెప్పండి. వాళ్ళు నన్నక్కడ చూస్తారు."

11 ఆ స్త్రీలు వెళ్తూ ఉండగా, ఆ సమాధిని కాపలా కాస్తున్న కొందరు సైనికులు నగరంలోకి వెళ్ళారు. అక్కడ ఏమేమి జరిగిందో అదంతా ప్రధాన యాజకులకి వివరించారు. 12 ఆ వెంటనే ప్రధాన యాజకులూ, యూదా మత పెద్దలూ కలిసి సమావేశమయ్యారు. ఆ సమాధి ఎందుకు ఖాళీగా ఉన్నదో వివరించడానికి ఒక ప్రణాళిక వేశారు. వాళ్ళు ఆ సైనికులకి లంచంగా చాలా సొమ్ము ముట్టజెప్పారు. 13 వారితో, "మేము నిద్ర పోతుండగా యేసు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళారు"అని చెప్పండి."

14 "ఈ సంగతి గవర్నర్ గారికి తెలిస్తే ఆయన మీ మీద కోపం తెచ్చుకోకుండా మేము చూసుకుంటాం. కాబట్టి మీరేమీ కంగారు పడవద్దు" అని చెప్పారు. 15 కాబట్టి ఆ సైనికులు ఆ డబ్బు తీసుకొని వాళ్ళు తమకి చెప్పినట్టుగానే చేశారు. ఈనాటి వరకూ ఆ కథ యూదుల మధ్య ప్రచారంలో ఉంది.

16 ఆ తరవాత పదకొండు మంది శిష్యులు గలలియ జిల్లాకి వెళ్ళారు. యేసు తమకి వెళ్ళమని చెప్పిన ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. 17 వాళ్ళు ఆయన్ని అక్కడ చూసి ఆయన్ని ఆరాధించారు. అయితే వారిలో కొంతమంది మాత్రం యేసు నిజంగా బ్రతికాడా అని సందేహించారు.

18 అప్పుడు యేసు వారికి దగ్గరగా వచ్చి, "పరలోకంలో, భూలోకంలో అంతటి మీదా, సర్వ మానవుల మీదా నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు. 19 కాబట్టి మీరు వెళ్ళి నా అధికారాన్ని ఉపయోగించి సమస్త జాతుల ప్రజలకూ నా సందేశం వినిపించి వారిని కూడా నా శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మల అధికారం కింద వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి. 20 నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో దానినంతటినీ వాళ్ళకి బోధించండి. నేను ఈ యుగాంతం వరకూ మీతో ఎల్లప్పుడూ ఉంటానని జ్ఞాపకం ఉంచుకోండి."