27

1 ఉదయాన్నే ముఖ్య యాజకులందరూ, మహా సభ పెద్దలందరూ కలిసి యేసును చంపడానికి రోమన్లకు ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచించారు. 2 వాళ్ళు ఆయన చేతులు కట్టేసి రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు.

3 అప్పుడు యేసుని పట్టించిన యూదా, వాళ్ళు యేసును చంపడానికే తీర్మానించారని గ్రహించాడు. కాబట్టి తాను చేసిన దానికి మనస్తాపం చెందాడు. తనకు వాళ్ళు ఇచ్చిన ముప్ఫై నాణాలు పట్టుకుని ముఖ్య యాజకుల దగ్గరికీ, పెద్దల దగ్గరికీ వెళ్ళాడు. 4 "నేను పాపం చేశాను, నిర్దోషి అయిన మనిషిని మీకు అప్పగించాను" అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళు, "అయితే మాకేంటి? అది నీ సమస్య. నువ్వే చూసుకో" అన్నారు. 5 అప్పుడు యూదా ఆ డబ్బులు తీసుకొని ఆ దేవాలయ వసారాలో విసిరేశాడు. తరవాత వెళ్ళి ఉరివేసుకొని చనిపోయాడు.

6 ప్రధాన యాజకులు ఆ నాణేలు తీసుకొని, "ఇది ఒక మనిషిని చంపడానికి ఇచ్చిన డబ్బు. వీటిని కానుకల పెట్టెలో వేయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం" అని చెప్పుకున్నారు. 7 కాబట్టి ఆలోచించి ఆ డబ్బుతో ఒక పొలం కొన్నారు. దాన్ని కుమ్మరి వాడి పొలం అని పిలుస్తారు. పరాయి దేశస్తులు ఎవరైనా, యెరూషలేములో చనిపోతే వాళ్ళని పాతిపెట్టడానికి ఆ పొలాన్ని కేటాయించారు. 8 అందుకే ఇప్పటికీ ఆ స్థలాన్ని "రక్తభూమి" అని పిలుస్తారు. 9 చాలా కాలం క్రితమే యిర్మీయా ప్రవక్త రాసిన ఈ మాటలు నెరవేర్పుకు వచ్చేలా వాళ్ళు ఆ కుమ్మరివాడి పొలం కొన్నారు, 10 "ఇశ్రాయేలు నాయకులందరూ కలిసి ఆయనకు కట్టిన వెల ముప్ఫై వెండి నాణేలు. ప్రభువు నాకు ఆజ్ఞాపించినట్టుగానే వాళ్ళు వాటితో ఒక కుమ్మరి వాడి పొలాన్ని కొన్నారు."

11 యేసు గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. "నువ్వు యూదుల రాజువి అని చెప్పుకున్నావా?" అని గవర్నర్ ఆయన్ని అడిగాడు. "అవును, నువ్వు అన్నట్టే" అని యేసు అతనికి జవాబిచ్చాడు.

12 అయితే ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద రక రకాలైన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నప్పుడు మాత్రం ఆయన ఏమీ తిరిగి జవాబు చెప్పలేదు. 13 పిలాతు ఆయనతో, "వాళ్ళు నీమీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో వింటున్నావా? నువ్వేమీ మాట్లాడవా?" అన్నాడు. 14 అయితే యేసు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు. తన మీద వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా తిరిగి జవాబివ్వలేదు. దీనికి గవర్నర్ చాలా ఆశ్చర్యపోయాడు.

15 ప్రతి సంవత్సరం, పస్కా పండగ జరిగే సమయంలో జైలులో ఉన్న ఒక ఖైదీని గవర్నర్ విడుదల చేయడం ఒక ఆనవాయితీ. ప్రజలు ఏ ఖైదీని కోరుకుంటే అతణ్ణి గవర్నర్ విడుదల చేస్తాడు. 16 ఆ సమయంలో యెరూషలేము జైల్లో బరబ్బ అనే పేరు మోసిన ఖైదీ ఉన్నాడు. 17 జనమంతా గుమికూడి ఉండగా పిలాతు వాళ్ళని, "మీరు ఏ ఖైదీని విడుదల చేయాలనుకుంటున్నారు? మెస్సీయ అని పిలిచే యేసునా?" అని అడిగాడు. 18 అతడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, ఆ ముఖ్య యాజకులు కేవలం యేసు మీద అసూయ చేతనే ఆయన్ని తన దగ్గరకు తీసుకొచ్చారని అతడు గ్రహించాడు. కాబట్టి ప్రజలంతా యేసుని విడిపించమంటారని అతడు అనుకున్నాడు.

19 పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, "ఈ మనిషి గురించి ఉదయాన్నే నాకొక కల వచ్చింది. నువ్వు ఆ నిర్దోషికి శిక్ష వేయొద్దు. ఆయన జోలికి పోవద్దు" అని కబురు పంపింది. 20 కానీ ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బని విడుదల చేయమనీ, యేసుకు మరణ శిక్ష అమలు చేయమనీ పిలాతును అడగమని జనాలపై వత్తిడి తెచ్చారు. 21 ఆ విధంగా గవర్నర్ర్ వాళ్ళని "ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలి?" అని అడిగితే వాళ్ళు, "బరబ్బ" అని కేకలు వేశారు. 22 "అలా అయితే యేసును ఏంచేయాలి? మరి మీలో కొంతమంది ఆయన్ని మెస్సీయ అన్నారు కదా?" అని పిలాతు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు, "సిలువ వెయ్యమని నీ సైనికులకు ఆజ్ఞాపించు" అన్నారు.

23 అప్పుడు పిలాతు, "ఎందుకు? అతడు ఏ నేరం చేశాడు?" అని వాళ్ళని అడిగాడు. అయితే వాళ్లింకా గట్టిగా కేకలు వేస్తూ, "సిలువ వేయండి" అని అరిచారు.

24 ఇంకా దానికి బదులుగా ఏం చేయాలన్నా అల్లరి ఎక్కువవుతుందే గానీ తన ప్రయత్నాలేవీ సాగవని అనుకుని పిలాతు జనమంతా చూస్తుండగా, ఒక పళ్ళెం తీసుకొని అందులో తన చేతులు కడిగేసుకుని, "ఇలా చేతులు కడుక్కోవడం ద్వారా ఈ మనిషి మరణం విషయంలో నా తప్పేమీ లేదు, అదంతా మీ తప్పే అని చూపించడానికి ఇలా చేశాను" అన్నాడు.

25 అప్పుడు అక్కడి ప్రజలంతా, "అతని చావు వలన కలిగే అపరాధం మామీదా, మా పిల్లల మీదా కుడా ఉంటుంది గాక!" అని జవాబిచ్చారు. 26 అప్పుడు అతడు వాళ్ళకి బరబ్బని విడుదల చేయమని సైనికులకి ఆజ్ఞాపించాడు. అయితే యేసును మాత్రం కొరడాలతో కొట్టమని సైనికులకు చెప్పాడు. ఆ తరవాత యేసుని సిలువ వేయడం కోసం సైనికులకు అప్పగించాడు.

27 అప్పుడు గవర్నర్ కింద ఉన్న సైనికులు యేసుని సైనికుల శిబిరాల్లోకి తీసుకు వెళ్ళారు. ఆ పటాలమంతా ఆయన చుట్టూ పోగయ్యారు. 28 వాళ్ళు ఆయన బట్టలు లాగివేశారు. ఆయన ఒక రాజు అన్నట్టుగా ఒక మెరిసే ఎర్రని అంగీని ఆయనకు కప్పారు. 29 ముళ్ళతో ఉన్న ఒక చెట్టు తీగలను కోసి వాటిని ఒక కిరీటంలాగా అల్లి ఆయన తల మీద ఉంచారు. ఆయన కుడి చేతిలో ఒక రాజు దండం పట్టుకున్నట్టుగా ఒక గడ్డి రెల్లును ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, "యూదుల రాజుకు శుభం" అంటూ ఆయన్ని ఎగతాళి చేశారు.

30 వాళ్ళు ఆయన మీద ఉమ్ముతూనే ఉన్నారు. ఆయన చేతికర్రని తీసుకొని దానితో ఆయన తలమీద కొడుతూ ఉన్నారు. 31 అలాగ ఆయన్ని హేళన చేసిన తరవాత ఆయన అంగీని తీసేసి, ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగించారు. అక్కడినుండి ఆయన్ని సిలువ వేసే స్థలానికి నడిపించుకుంటూ వెళ్ళారు.

32 యేసు తన సిలువని కొంత దూరం మోసుకెళ్ళిన తరవాత ఆ సైనికులు కురేనే అనే పట్టణానికి చెందిన సీమోను అనే వ్యక్తిని చూశారు. యేసు సిలువను అతని చేత బలవంతంగా మోయించారు. 33 వాళ్ళు గొల్గొతా అనే స్థలానికి వచ్చారు. ఆ పేరుకి అర్థం, "కపాలం లాంటి స్థలం." 34 అక్కడికి చేరిన తరవాత ద్రాక్షరసంలో చేదు ద్రవాన్ని కలిపారు. వాళ్ళు ఆయన్ని మేకులతో సిలువకి కొట్టేటప్పుడు అంతగా బాధ కలగకుండా ఉండేందుకు దాన్ని యేసుకు తాగించారు. అయితే ఆయన దాన్ని రుచి చూసి దాన్ని తాగడానికి నిరాకరించాడు. కొంతమంది సైనికులు ఆయన బట్టలు లాగేసుకున్నారు.

35 అప్పుడు వాళ్ళు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. తరవాత చీట్లు వేసి ఆయన బట్టల్లో ఏది ఎవరికీ వస్తుందో చూసి పంచుకున్నారు. 36 ఎవరైనా ఆయన్ని కాపాడటానికి వస్తారేమో అని ఆ సైనికులు సిలువకు కాపలాగా కూర్చున్నారు. 37 యేసుని ఎందుకు సిలువకు మేకులతో కొట్టామో చెప్పడానికి ఒక చెక్క ముక్కను యేసు తలపైగా సిలువకు తగిలించారు. దానిపైన, "ఈయన యూదులకు రాజైన యేసు" అని రాసి ఉంది.

38 అదే సమయంలో వాళ్ళు ఇద్దరు బందిపోట్లను కూడా సిలువ వేశారు. ఒక సిలువని యేసుకు కుడివైపునా, మరొకటి ఎడమ వైపునా నిలబెట్టారు. 39 ఆ పక్కగా వెళ్తున్న ప్రజలు ఆయన్ని చూసి ఆయనేదో ఒక దుర్మార్గుడైనట్టుగా తమ తలలు ఊపుతూ ఎగతాళి చేస్తున్నారు. 40 వాళ్ళు ఆయనతో, "మన దేవాలయాన్ని కూలదోసి మళ్ళీ మూడు రోజుల్లోనే దాన్ని కడతానని చెప్పావు. ఆ విధంగా చేసేవాడివైతే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా! నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగి రా!" అన్నారు.

41 అదే విధంగా ముఖ్య యాజకులూ, యూదా ధర్మశాస్త్రాన్ని బోధించే వారూ, పెద్దలు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. 42 "ఈయన రోగుల్ని స్వస్థ పరిచాడు గానీ తనకు తాను సహాయం చేసుకోలేడు. తను ఇశ్రాయేలుకు రాజునని చెప్పుకున్నాడు కాబట్టి సిలువ మీద నుండి దిగి రావాలి. అప్పుడు మేము ఆయన్ని నమ్ముతాం."

43 "తాను దేవునిలో విశ్వాసముంచాననీ, తాను మానవునిగా ఉన్న దేవుడిననీ అన్నాడు. ఒకవేళ దేవుడికి అతనంటే ఇష్టమైతే ఇప్పుడే దేవుడు అతణ్ణి విడిపించాలి!" ఇలాంటి రక రకాల మాటలతో వాళ్ళు ఆయన్ని హేళన చేశారు. 44 అలాంటి మాటలే పలుకుతూ ఆయనకు అటూ ఇటూ సిలువలపై ఉన్న బందిపోట్లు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు.

45 మధ్యాహ్నం అయినప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మేసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ అలా చీకటిగానే ఉండిపోయింది. 46 సుమారు మూడు గంటల సమయంలో యేసు, "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?" అని పెద్దగా అరిచాడు. దాని అర్థం, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టావు?" అని. 47 ఆ పక్కన నిలబడి ఉన్న కొందరు "ఏలీ" అనే మాట విని, ఆయన ఏలీయా ప్రవక్తని పిలుస్తున్నాడేమో అనుకున్నారు.

48 వెంటనే వాళ్ళలో ఒకడు పరిగెత్తి ఒక స్పాంజిముక్క తీసుకొచ్చాడు. దాన్ని చేదు ద్రాక్షరసంలో ముంచి, దాన్ని ఒక గడ్డి పుల్ల చివర తగిలించి యేసు దానిలోని ద్రాక్షరసాన్ని పీల్చుకుంటాడేమో అని దాన్ని ఆయన ముఖం దగ్గరకు ఎత్తి పట్టుకున్నాడు. 49 అక్కడ ఉన్న ఇంకొందరు, "ఆగాగు, ఏలీయా వచ్చి ఆయన్ని కాపాడతాడేమో చూద్దాం" అన్నారు. 50 అప్పుడు యేసు మళ్ళీ ఇంకొకసారి పెద్దగా కేక వేసి తన ఆత్మని దేవునికి అప్పగించి చనిపోయాడు.

51 అదే క్షణంలో దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉండే బరువైన, మందమైన తెర పైనుండి కిందికి రెండుగా చిరిగిపోయింది. భూమి కంపించింది, కొన్ని చోట్ల పెద్ద రాతి బండలు చీలిపోయాయి. 52 సమాధులు తెరుచుకున్నాయి. దేవునిపై భయభక్తులతో జీవించి చనిపోయిన చాలా మంది శరీరాలు తిరిగి జీవం పొందాయి. 53 వాళ్ళు సమాధుల నుండి బయటికి వచ్చారు. యేసు తిరిగి లేచిన తరవాత వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి చాలామందికి కనిపించారు.

54 యేసుని సిలువకు మేకులతో కొట్టిన సైనికులను పర్యవేక్షించే అధికారి అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఆ సిలువలకు కాపలాగా ఉన్న సైనికులు కూడా అక్కడే ఉన్నారు. భూకంపం రావడం, ఇంకా అక్కడ జరిగిన ఇతర విషయాలను చూసినప్పుడు వాళ్ళు భయంతో వణికిపోయారు. "ఈయన నిజంగా దేవుని కుమారుడు" అని వాళ్ళు పెద్దగా చెప్పుకున్నారు.

55 అక్కడ చాలామంది స్త్రీలు కూడా దూరంనుండి చూస్తున్నారు. యేసుకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేయడానికి వారంతా గలిలయనుండి ఆయనతో కలిసి వచ్చారు. 56 వారిలో మగ్దలకు చెందిన మరియ, యాకోబు, యోసేపుల తల్లి అయిన ఇంకొక మరియ, యాకోబు, యోహానుల తల్లి ఉన్నారు.

57 సాయంకాలం అయినప్పుడు యోసేపు అనే ఒక ధనవంతుడు అక్కడికి వచ్చాడు. అతడు అరిమతయియ అనే ఊరువాడు. అతడు కూడా యేసు శిష్యుడే. 58 అతడు పిలాతు దగ్గరకి వెళ్ళి యేసు శరీరాన్ని తీసుకువెళ్ళి సమాధి చేయడానికి అనుమతి అడిగాడు. అతణ్ణి ఆ శరీరాన్ని తీసుకుపోనిమ్మని పిలాతు సైనికులకు ఆజ్ఞాపించాడు.

59 కాబట్టి యోసేపు, ఇతరులు కలిసి ఆ శరీరాన్ని శుభ్రమైన తెల్లని గుడ్డతో చుట్టారు. 60 దాన్ని యోసేపు ఒక కొండ రాతిలో తన పనివారి చేత స్వంతగా తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచారు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద గుండ్రని చదునైన రాయిని దొర్లించి వెళ్ళిపోయారు. 61 మగ్దలేనే మరియ, ఇంకో మరియ, ఆ సమాధికి అవతల కూర్చొని గమనిస్తూ ఉన్నారు.

62 తరువాతి రోజు యూదులకు విశ్రాంతి రోజైన శనివారం. ముఖ్యయాజకులు, కొంతమంది పరిసయ్యులు పిలాతు దగ్గరకి వెళ్ళారు. 63 వాళ్ళు అతనితో, "ఈ మోసగాడు బతికి ఉన్న సమయంలో "నేను చనిపోయిన మూడు రోజులకి మళ్ళీ సజీవంగా తిరిగి లేస్తాను" అని చెప్పినట్టు మాకు జ్ఞాపకం. 64 కాబట్టి ఆ సమాధిని మూడు రోజుల పాటు కాపలా కాయమని మీ సైనికులకు ఆజ్ఞాపించండి. మీరు అలా చేయకపోతే అతని శిష్యులు వచ్చి అతని శరీరాన్ని దొంగిలించవచ్చు. అప్పుడు వాళ్ళు ఆయన చనిపోయినా తిరిగి బతికి లేచాడని ప్రజల్లో ప్రచారం చేస్తారు. అలా చెప్పి వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తే అది అంతకు ముందు అతడు చేసిన దానికంటే ఎక్కువ మోసం అవుతుంది" అన్నారు.

65 అప్పుడు పిలాతు వాళ్ళతో, "మీరు కొంతమంది సైనికుల్ని తీసుకు వెళ్ళొచ్చు. సమాధి దగ్గరకు వెళ్ళి మీకు చేతనయినంత వరకు దానికి కావలి ఏర్పాటు చేసుకోండి" అన్నాడు. 66 కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ సమాధి మీద ఉంచిన రాతిని అటూ ఇటూ కొండకు తాళ్ళతో కట్టి దానిపై ముద్ర వేశారు. ఆ సమాధికి కొంతమంది సైనికుల్ని కూడా కాపలా పెట్టారు.