1

1 అబ్రాహాము, దావీదుల వంశం వాడైన యేసు క్రీస్తు పూర్వీకుల జాబితా.

2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.

3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.

4 ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను.

5 శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి.

6 యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను.

7 సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా.

8 ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా.

9 ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.

10 హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.

11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.

12 బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి.

యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.

13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు.

14 అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు.

15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు.

16 యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె యేసుకు తల్లి. ఈ యేసునే క్రీస్తు అని పిలిచారు.

17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు.

18 ఇది యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏమి జరిగింది అనే దాని వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో నిశ్చితార్థం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి నివసించక ముందే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆమె గర్భవతి అయిందని వాళ్ళకి తెలిసింది. 19 ఆమెను పెళ్ళాడనున్న యోసేపు దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకునే ముక్కుసూటి మనిషి. కానీ ఆమెను నలుగురిలో పరువు తీసే పాపం నాకెందుకులే అనుకున్నాడు. అందువల్ల గుట్టు చప్పుడు కాకుండా వివాహ ప్రయత్నం విరమించుకుందామనుకున్నాడు.

20 అతడు ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ప్రభువు దూత ఒకడు అతనికి కలలో కనిపించాడు. "యోసేపూ, దావీదు రాజు వంశస్తుడా, మరియను పెళ్ళి చేసుకోడానికి వెనకాడవద్దు. ఆమె గర్భవతిగా ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. 21 ఆమె కొడుకును కంటుంది. తన ప్రజలను పాపం నుండి రక్షించేది ఆయనే గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు. 22 పూర్వకాలం దేవుడు యెషయా ద్వారా పలికించిన మాట నిజమయ్యేలా ఇది జరుగుతుంది. యెషయా ఇలా రాశాడు.
23 "వినండి, కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.
ఆయనకు "దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థమిచ్చే "ఇమ్మానుయేలు" అనే పేరు పెడతారు."

24 యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. 25 అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.