15
దేవుడు అబ్రాముతో నిబంధన చెయ్యడం

1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. <<అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని>> అన్నాడు. 2 అబ్రాము <<ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3 నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు>> అన్నాడు.

4 యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి <<ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు>> అన్నాడు. 5 ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి <<నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు>> అని చెప్పి <<నీ సంతానం కూడా అలా అవుతుంది>> అని చెప్పాడు.

6 అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన 1 అతనికి నీతిగా పరిగణించాడు. 7 యెహోవా <<నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే>> అని చెప్పినప్పుడు 8 అతడు <<ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?>> అన్నాడు.

9 ఆయన <<మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా>> అని అతనితో చెప్పాడు. 10 అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. 11 ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.

12 చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది. 13 ఆయన <<దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.

14 వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు. 15 కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు. 16 అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో>> అని అబ్రాముతో చెప్పాడు.

17 సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి. 18 ఆ రోజున యెహోవా <<ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను. 19 కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, 20 హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, 21 అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను>> అని అబ్రాముతో నిబంధన చేశాడు.


1 15:6 ఇక్కడ నీతి నే మాట మొదటి సరి కనిపిస్తున్నది. గలతి 3:6; రోమ్ 4:3; యాకోబు 3:26 చూడండి