23

1 అప్పుడు యేసు గుంపు గూడిన జనంతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, 2 "మన యూదు ధర్మశాస్త్ర నియమాలను బోధించే పరిసయ్యులూ, వాళ్ళ మనుషులూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం మోషేకిచ్చిన ధర్మశాస్త్రం అర్థం చెప్పడం కోసం మాత్రమే తామున్నట్టు అనుకుంటారు. 3 మీరు ఒకటి చెయ్యండి, వాళ్ళు మీకు ఏది బోధిస్తే దాన్ని తప్పకుండా పాటించండి గానీ, వాళ్ళు చేసే పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు చేయమని చెప్తారు గానీ వాటిని వాళ్ళే చేయరు."

4 "చెయ్యడానికి కష్టమైనా ఎన్నో నియమాలు పాటించమని వాళ్ళు మీకు చెప్తారు. గానీ ఆ చెప్పిన నియమాల్ని అనుసరించడంలో కొంచెం కూడా సహాయం చెయ్యరు. ఇదెలా ఉందంటే మోయలేనంత బరువు మోపులు కట్టి మోయమని ఒక మనిషి భుజాల మీద పెట్టినట్టుంది. అయితే వాళ్ళు అది మోసేందుకు సహాయానికి మాత్రం తమ చిటికెన వేలు కూడా కదిలించరు. 5 వాళ్ళు ఏ పని చేసినా, మనుషులకు కనబడాలనే, తమను చూసి మెచ్చుకోవాలనే చేస్తారు. ఉదాహరణకు, తమ చేతులపై రాసిన రక్ష రేకులను ఇంకొంచెం వెడల్పుగా చేసుకుంటారు. దేవుణ్ణి గౌరవించేవాళ్ళు అని మనుషులు అనుకోవాలని తమ అంగీల కుచ్చులు పెద్దగా చేసుకుంటారు."

6 " మనుషులంతా తమను గొప్ప చేయాలని వీళ్ళు అనుకుంటారు. ఉదాహరణకు, విందుల్లో బాగా గొప్ప వాళ్ళు కూర్చునే చోట కూర్చుంటారు. సమాజ మందిరాల్లో కూడా గొప్ప ఆసనాలే కోరుకుంటారు. 7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, "బోధకా, బోధకా" అని పిలిపించుకోవడం వీళ్ళకి చాలా ఇష్టం."

8 "కాబట్టి శిష్యులారా, మీరు మాత్రం ఆ యూదు బోధకుల్లాగా "బోధకా, బోధకా" అని పిలిపించుకోవద్దు. నేను మాత్రమే మీ బోధకుణ్ణి. అంటే అర్థం మీరందరూ సోదరీ సోదరులు, అందరూ సమానమే. 9 ఈ భూమి మీద, "తండ్రి" అని ఎవ్వరూ పిలిపించుకోవద్దు. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడే మీ అసలైన తండ్రి. 10 అంతే కాదు, మనుషుల చేత మీరు "గురువు" అని పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తే మీ ఏకైక గురువు."

11 "దేవుడు మీ అందరిలో మిమ్మల్నే ముఖ్యులుగా గుర్తించాలనుకుంటే మీరు సేవకుల్లాగా ఇతరులకు సేవ చేసేవారి లాగా ఉండాలి. 12 తనకు తానే గొప్పవాడిని అని గొప్పలు చెప్పుకునే వాణ్ణి దేవుడు అణిచి వేస్తాడు, ఎవరైతే మేము చాలా తక్కువ వాళ్ళం అనుకుంటారో వాళ్ళని దేవుడు నిజంగా గౌరవిస్తాడు."

13-14 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషధారులు! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! ఎందుకంటే పరలోక రాజ్య అధికారం కిందికి మీరు రారు, ఇతరులను కూడా రానివ్వరు. మీరూ వెళ్లరు, వాళ్ళనీ రానివ్వరు."

15 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషదారులు! అయ్యో, దేవుడు ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాడో! మీరు చెప్పే బోధల్ని ఒక్క మనిషితో నమ్మించడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. ఎంతో కష్టపడితే గానీ ఒక వ్యక్తిని కూడా మీ బోధలు నమ్మేలా చేయలేరు. ఎట్టకేలకు మీరు బోధించిన దాన్ని ఎవరైనా నమ్మి మీ దగ్గరకి వస్తే, అతణ్ణి మీకంటే రెండింతలు ఎక్కువ నరకపాత్రుడుగా చేస్తారు."

16 "యూదు నాయకుల్లారా, అయ్యో, దేవుడు ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాడో! మీరే గుడ్డి వాళ్ళు, అయినా మీరు ఇతరులను నడిపించాలని చూస్తున్నారు. మీరు, "కోవెల ఏదో ఒక మనిషి అన్నట్టుగా దానిమీద ఒట్టు పెట్టుకొని ఒక పని చేయడంలో విఫలమైతే అది పరవాలేదు గానీ కోవెలలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం అతడు ఆ మాటకి కట్టుబడి ఉండాలని మీరు చెప్తారు. 17 మీరు బుద్ధి లేని వాళ్ళలా, గుడ్డివాళ్ళలా ఉన్నారు. కోవెలలోని బంగారం గొప్పదే గానీ, కోవెల అంతకన్నా గొప్పది కదా! ఎందుకంటే దేవుని కోసం ఆ బంగారాన్ని పవిత్ర పరిచేది దేవాలయమే కదా!"

18 "అలాగే బలిపీఠం ఒక వ్యక్తి అన్నట్టు దాని మీద ఒట్టు పెట్టుకొని అలా చేయడంలో విఫలమైతే అది పరవాలేదు గానీ బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం ఆ మాటకి కట్టుబడి తీరాల్సిందే అని కూడా మీరు చెప్తారు. 19 మీరు గుడ్డివాళ్ళులా ఉన్నారే! బలిపీఠం మీద ఉన్న అర్పణ గొప్పదే గానీ ఆ అర్పించిన అర్పణను దేవునికోసం పవిత్ర పరిచే బలిపీఠం అంతకన్నా గొప్పది కదా!"

20 "బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, బలిపీఠం తోడనే కాకుండా దానిపై ఉన్న అర్పణ తోడని కూడా ఒట్టుపెట్టుకుంటున్నాడు. 21 అవును, అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునే వాడు దేవాలయం తోడనీ, దానిలో నివసించే దేవుని తోడని కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడన్న మాట. 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునేవాడు, దేవుని సింహాసనం తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో దానిపై కూర్చున్న దేవుని తోడనీ ఒట్టు పెట్టుకుంటున్నాడు."

23 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, అయ్యో, మిమ్మల్ని దేవుడు ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు కపట వేషదారులు. ఎందుకంటే, పుదీనా, సోంపు, జీలకర్రల్లో దేవునికి పదో వంతు ఇస్తారు గానీ, వీటికంటే ఎంతో ప్రాముఖ్యమైన దేవుని నియమాలకు మాత్రం లోబడరు. ఉదాహరణకు, మీరు పక్కవారి విషయంలో న్యాయంగా ఉండరు, జాలీ, కరుణా చూపించరు. వాళ్ళ వస్తువుల్ని బలవంతంగా లాగేసుకుంటారు. పుదీనాలో, సొంపులో పదో వంతు దేవునికి ఇవ్వడం మంచిదే గానీ, దేవుని ఆజ్ఞలు పాటించడం మరీ ముఖ్యం. 24 మీరు గుడ్డివాళ్ళు. అయినాగానీ మీకేదో కనపడుతున్నట్టు పక్కవాడికి దారి చూపడానికి ప్రయత్నిస్తారు. దేవుడికి కోపం తెప్పించ కూడదని మంచి నీళ్ళు తాగేటప్పుడు చిన్న పురుగును కూడా వడకట్టి చూసుకుంటూ జాగ్రత్తగా తాగుతారు. కానీ మీ ప్రవర్తన ఎంత అధ్వాన్నంగా ఉందంటే, మీరు ఒంటెల్ని మింగేసేవాళ్ళ లాగా ఉన్నారు."

25 "కపట వేషదారులైన ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు బయటికి చాలా మంచివాళ్ళలాగా కనిపిస్తారు. చాలా నిజాయితీపరులని ఇతరులు అనుకునేలా బయటి వాళ్ళకి గొప్పగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే నిజానికి వాళ్ళకి వ్యతిరేకంగా పాపం చేస్తూ అత్యాశతో మీ స్వంత సుఖభోగాల కోసం వాళ్లకు చెందినవాటన్నిటినీ లాగేసుకుంటారు. మీరు బయట శుభ్రంగా ఉన్న గిన్నె, పళ్ళెం లాంటి వాళ్ళు. అవి బయట చాలా శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, లోపలంతా మురికిగా ఉంటాయి. 26 గుడ్డి వాళ్లైన పరిసయ్యులారా, ముందు మీరు పక్కవాడి దగ్గర దోచుకోవడం మానెయ్యండి. అప్పుడు లోపలా, బయటా, రెండు వైపులా శుభ్రంగా ఉన్న పాత్రల్లాగా నిజాయితీగా ఉండగలుగుతారు."

27 "కపట వేషదారులారా, ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు సమాధుల మీద ఉన్న కట్టడాల్లాటి వాళ్ళు. అవి సున్నం వేసి ఉండటం వలన మనుషులు వాటిని చూసి, సమాధులని గమనించి వాటిని ముట్టి మైల పడకుండా పక్కనుండి వెళ్ళిపోతారు. అవి బయటికి అందంగా కనిపిస్తాయి గానీ, వాటి లోపలంతా చనిపోయిన వారి ఎముకలతో, కుళ్ళు వాసనతో నిండి ఉంటుంది. 28 మీరు ఆ సమాధుల్లాటి వాళ్ళు. మనుషులు మీ వైపు చూసినప్పుడు మీరు చాలా నిజాయితీగా, నీతిమంతుల్లాగా కనిపిస్తారు. గానీ, లోపల మీరు కపట వేషధారులు. ఎందుకో తెలుసా, మీరు దేవుని ఆజ్ఞలకు లోబడనే లోబడరు."

29 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషధారులు. దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! పూర్వ కాలంలో ఎవరో చంపిన ప్రవక్తల సమాధులు తిరిగి మళ్ళీ కట్టిస్తున్నారు. నీతిమంతుల స్తూపాలను అలంకరిస్తున్నారు. 30 మీరు "మా పూర్వికులు జీవించిన కాలంలో మేము ఉండి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో మేము వాళ్ళతో కలిసే వాళ్ళమే కాదు" అంటారు. 31 ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపినవాళ్ళ సంతానం నుండి వచ్చామని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళ లాటి వాళ్ళే."

32 "ఇంకేంటి, మీరు కూడా మీ పూర్వీకులు చేసిన పాపాలను పూర్తి చేసేయండి. 33 మీరు దుష్టులు. విష సర్పాల కంటే కూడా ప్రమాదకరమైన వాళ్ళు. మీరు తప్పకుండా దేవుని శిక్షనుండి, అంటే నరక శిక్ష నుండి తప్పించుకుంటామని బుద్ధిహీనంగా అనుకుంటారు."

34 "కాబట్టి వినండి, అందుకే నేను ప్రవక్తలనూ, పండితుల్నీ, బోధకుల్నీ పంపుతాను. వాళ్ళల్లో మీరు కొందరిని సిలువ వేసీ, కొందరిని మరో రకంగానూ చంపుతారు. కొంతమందినేమో సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొంతమందిని ఊరినుండి తరిమి తరిమి కొడతారు. 35 ఆదాము కొడుకూ నీతిమంతుడూ అయిన హేబెలు మొదలు, పరిశుద్ధ స్థలానికీ, బలిపీఠానికీ మధ్యలో మీ పూర్వికులు చంపిన బరక్యా కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధం అంతా మీ మీదికి వస్తుంది. 36 నా పరిచర్యను గమనిస్తున్న మీరు దీని గురించి ఆలోచించండి. ఆ ప్రవక్తలను చంపినందుకు దేవుని శిక్ష వారి మీదికి కచ్చితంగా వస్తుందని మీతో చెబుతున్నాను."

37 "యెరూషలేము ప్రజలారా, పూర్వకాలం నుండీ ప్రవక్తలను చంపుతూ, దేవుడు మీ దగ్గరకు పంపిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపినవాళ్ళు మీరు. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్టు ఎన్నో సార్లు నేను మిమ్మల్ని పోగుచేసి కాపాడాలని అనుకున్నాను కానీ మీరు నన్ను అలా చేయనివ్వ లేదు. 38 కాబట్టి ఇక వినండి. మీ పట్టణం మనుషులు నివసించడానికి వీలు లేనిదిగా తయారవుతుంది. 39 ఇది గుర్తుంచుకోండి. నేను మళ్ళీ తిరిగి రావడం మీరు చూస్తారు. అప్పుడు "దేవుని అధికారంతో వస్తున్న ఈ మనిషి దేవునికెంతో ప్రియమైనవాడు" అని మీరు నా గురించి చెప్పుకుంటారు."