22

1 యేసు యూదు నాయకులకు అనేక ఉపమానాలు చెప్పాడు. వాటిల్లో ఇది ఒకటి. 2 "పరలోక రాజ్య పాలన ఒక రాజు తన కొడుకు పెళ్ళికి విందు భోజనాలు ఏర్పాటు చేసినట్టు ఉంది. 3 ఆ విందు సిద్ధం అయినప్పుడు భోజనానికి పిలిచిన వాళ్ళనందరినీ ఆహ్వానించమని తన సేవకులను పురమాయించాడు. సేవకులు ఆ కబురు చెప్పినప్పుడు వాళ్ళంతా విందుకు రాకుండా సాకులు చెప్పసాగారు."

4 "అప్పుడు అతడు వేరే సేవకులను వాళ్ళ దగ్గరకు పంపుతూ, "ఆహ్వానితులందరికీ ఇలా చెప్పండి. రాజు మీతో ఇలా చెప్పమన్నాడు, నేను మీ కోసం విందు సిద్ధం చేశాను. కొవ్విన దూడల మాంసం, ఎద్దుల మాంసం వండించాను. అంతా సిద్ధంగా ఉంది. పెళ్ళి విందు మొదలయ్యే సమయం అయింది."

5 "సేవకులు ఈ కబురు చెప్పినప్పుడు వాళ్ళంతా రకరకాల సాకులు చెప్పారు. కొందరేమో పొలానికి వెళ్ళాలనీ, మరి కొందరేమో వ్యాపారం నిమిత్తం వెళ్ళాలనీ చెప్పి రాకుండా మానివేశారు. 6 మిగిలినవాళ్ళు రాజు సేవకులను పట్టుకుని అవమానపరిచి చంపివేశారు. 7 జరిగినది తెలుసుకున్న రాజుకు చాలా కోపం వచ్చింది. వాళ్ళందరినీ చంపివేసి ఆ ఊరంతటినీ తగలబెట్టమని తన సైనికులను పంపించాడు. 8 సేవకులు ఆ పని చేసినప్పుడు, రాజు మరికొంతమంది సేవకులను పిలిచి "నేను పెళ్ళి విందు సిద్ధం చేశాను. కానీ వాళ్ళంతా విందు ఆరగించడానికి యోగ్యులు కారు. 9 కాబట్టి మీరు వెళ్ళండి, దారి వెంట మీకు కనిపించిన వాళ్ళందరినీ పెళ్ళి విందుకు తీసుకురండి" అని చెప్పాడు. 10 సేవకులు వెళ్ళారు, తమకు కనిపించిన వాళ్ళందరినీ పోగుచేశారు. వాళ్ళలో కొందరు మంచివాళ్ళూ, కొందరు చెడ్డవాళ్ళూ ఉన్నారు. వాళ్ళందరినీ విందు జరిగే భోజనాల గదికి తీసుకువచ్చారు. ఆ హాలంతా నిండిపోయింది."

11 "రాజు అక్కడ కూర్చున్న అతిధులను చూడడానికి లోపలికి వచ్చాడు. వచ్చిన వాళ్ళలో పెళ్ళి విందు బట్టలు వేసుకోకుండా ఉన్న ఒకడు కనిపించాడు. 12 రాజు అతనితో, "మిత్రమా, పెళ్ళి విందుకు అతిథులు వేసుకోవలసిన బట్టలు వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు?" అని అడిగాడు. ఆ వ్యక్తికి ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా ఉండిపోయాడు. 13 అప్పుడు రాజు సైనికులను పిలిచి, "ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటి గదిలో పడవేయండి. అక్కడ మనుషులు ఏడుస్తూ, పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు" అని ఆజ్ఞాపించాడు."

14 తరువాత యేసు, "ఈ ఉపమానం ఉద్దేశం ఏమిటంటే దేవుడు తన దగ్గరికి రమ్మని అందరినీ పిలుస్తున్నాడు. అయితే ఆయన దగ్గర ఉండేందుకు అర్హత ఉన్నవాళ్ళు కొద్దిమందే" అన్నాడు.

15 ఈ సంగతి చెప్పిన తరువాత, పరిసయ్యులు పోగయ్యారు. యేసు చేత ఏదైనా తప్పు మాటలు పలికించి ఆయనను ఇరికించాలని పథకం వేశారు. 16 కొంతమంది హేరోదు వర్గానికి చెందిన మనుషులతోపాటు తమ అనుచరులను యేసు దగ్గరికి పంపించారు. వాళ్ళు యేసుతో, "బోధకా, నువ్వు నీతిమంతుడవనీ, దేవుడు కోరినట్టు జీవించాలనే సత్యాలు బోధిస్తున్నావనీ మాకు తెలుసు. నీ బోధల్లో ఎలాంటి లోపమూ లేదనీ, ఎవ్వరి విషయంలోనూ పక్షపాతం చూపించవనీ మాకు తెలుసు. 17 అయితే ఒక విషయం చెప్పు. రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం న్యాయమేనా, కాదా?"

18 వాళ్ళు మనసులో చెడు ఆలోచన పెట్టుకుని తనను ఇరికించాలని చూస్తున్నారని యేసు గ్రహించాడు. తాను ఇచ్చే జవాబు వల్ల అటు రోమా అధికారుల ద్వారా గానీ, ఇటు యూదు అధికారుల ద్వారా గానీ తనను ఇబ్బందులపాలు చెయ్యాలని వీళ్ళు చూస్తున్నారు. యేసు ఇలా చెప్పాడు, "మోసగాళ్ళారా, మీరు నా చేత తప్పుడు మాటలు పలికించాలని చూస్తున్నారు. 19 ఏదీ రోమా పన్ను చెల్లించే ఒక నాణెం చూపించండి." వాళ్ళు ఒక నాణెం చూపించారు.

20 "ఈ నాణెం మీద ఉన్న బొమ్మ ఎవరిదీ?" యేసు అడిగాడు. 21 వాళ్ళు "రోమ ప్రభుత్వ అధికారి సీజరుది" అని చెప్పారు. "అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి." 22 యేసు చెప్పిన ఈ జవాబుకి వాళ్ళు అవాక్కయ్యారు. ఇక నోరెత్తలేక పోయారు. ఆయన్ని విడిచిపెట్టి అక్కడినుంచి వెళ్ళిపోయారు.

23 అదేరోజు కొందరు సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చారు. వీళ్ళు చనిపోయినవాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకరు అని నమ్మే యూదులలో ఒక గుంపుకు చెందినవాళ్ళు. వాళ్ళు యేసుతో ఇలా అన్నారు, 24 "బోధకా, మోషే రాసిన గ్రంథాల్లో "ఒక పురుషుడు తనకు పిల్లలు లేకుండా చనిపోతే అతని తమ్ముడు చనిపోయిన వ్యక్తి భార్య ద్వారా పిల్లల్ని కనాలి. ఆ విధంగా ఆ పిల్లలు చనిపోయిన వ్యక్తికి వారసులు అవుతారు" అని ఉంది కదా."

25 "ఒక కుటుంబంలో ఏడుగురు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో పెద్దవాడు పెళ్ళి చేసుకుని తనకు పిల్లలు లేకుండానే చనిపోయాడు. కాబట్టి రెండవవాడు మొదటివాడి భార్యని పెళ్ళి చేసుకున్నాడు గానీ అతడు కూడా పిల్లల్ని కనకుండానే చనిపోయాడు. 26 అలాగే మూడవవాడు, తరువాత మిగిలిన నలుగురూ ఆమెను పెళ్ళి చేసుకుని పిల్లలు లేకుండానే చనిపోయారు. 27 చివరకు ఆ స్త్రీ కూడా చనిపోయింది. 28 దేవుడు చనిపోయినవాళ్ళను మళ్ళీ బ్రతికించినప్పుడు ఆ ఏడుగురు అన్నదమ్ములలో ఆ స్త్రీకి ఎవరు భర్తగా ఉంటారు? ఇక్కడ బతికి ఉన్నప్పుడు అందరూ ఆమెకు భర్తలయ్యారు కదా."

29 అందుకు యేసు, "మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లేఖనాల్లో రాసి ఉన్నది మీరు గ్రహించలేదు. దేవుడికి చనిపోయినవాళ్ళను తిరిగి బ్రతికించే శక్తి ఉన్నదని మీకు తెలియదు. 30 ఆ స్త్రీ ఎవ్వరికీ భార్యగా ఉండదు. ఎందుకంటే దేవుడు బ్రతికించిన వాళ్ళు పరలోకంలో దేవదూతలుగా మారిపోతారు. అక్కడ ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు."

31 "అయితే తిరిగి బ్రతికిన వాళ్ళను గురించి దేవుడు మాట్లాడాడు. దీనిని మీరు చదివే ఉంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయిన చాలాకాలం తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ, 32 "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కొలిచిన దేవుణ్ణి" అన్నాడు. చనిపోయిన వాళ్ళు దేవుని ఆరాధించలేరు. బ్రతికి ఉన్నవాళ్ళు మాత్రమే ఆరాధిస్తారు. కనుక చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇంకా బ్రతికి ఉన్నాయని మనం నమ్మాలి" అన్నాడు.

33 యేసు చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.

34 సద్దూకయ్యులు యేసుతో వాదించడానికి వెళ్ళి యేసు ఇచ్చిన జవాబులకు ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చారని పరిసయ్యులు తెలుసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. యేసుని కలుసుకుని ఆయనతో ఏ ఏ విషయాలు మాట్లాడాలో సిద్ధం చేసుకున్నారు. 35 దేవుడు మోషేకి ఇచ్చిన చట్టాలు బాగా చదివిన న్యాయవాది ఒకడు వాళ్ళలో ఉన్నాడు. అతడు యేసుతో వాదించడానికి సిద్ధపడ్డాడు.

36 అతడు యేసుతో, "బోధకా, దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞల్లో అత్యంత ముఖ్యమైనది ఏది?" అని అడిగాడు.

37 రాసిఉన్న ఆజ్ఞలను యేసు అతనికి గుర్తుచేస్తూ, "నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి. నీ కోరికల్లో, నీ ఆలోచనల్లో, నీ పనుల్లో ఆయన ప్రేమను చూపించాలి. 38 ఇదే దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞలలో ముఖ్యమైనది."

39 "తరువాతి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, "నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి." 40 ఈ రెండు ఆజ్ఞలు మోషే రాసిన పుస్తకాల్లో, ప్రవక్తలు రాసిన పుస్తకాల్లో ప్రధానమైనవి."

41 పరిసయ్యులు ఒకచోట గుమిగూడి ఉన్నప్పుడు యేసు వాళ్ళను ఇలా అడిగాడు, 42 "మెస్సీయ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎవరి వంశానికి చెందినవాడు?" అందుకు వాళ్ళు, "ఆయన దావీదు వంశంవాడు" అని బదులిచ్చారు. 43 అప్పుడు యేసు, "మెస్సీయ దావీదు వంశానికి చెందినవాడైతే దావీదు ఆయనను "ప్రభూ" అని పిలువనక్కరలేదు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనను అలా పిలిచాడు. 44 దావీదు మెస్సీయ గురించి రాస్తూ, "దేవుడు నా ప్రభువుతో, నేను నీ శత్రువులను నీ కాళ్ళకింద ఉంచేవరకూ నేను నిన్ను ఘనపరిచే విధంగా నా కుడిపక్కన కూర్చో" అని పలికాడు."

45 "కాబట్టి దావీదు మెస్సీయను "నా ప్రభూ" అని పిలిచాడంటే ఆయన దావీదు వంశం వాడు ఎలా అవుతాడు? ఆయన దావీదు కంటే గొప్పవాడు." 46 యేసు మాటలు విన్నవారిలో ఎవరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. దీని తరువాత ఆయనను ఇరకాటంలో పెట్టాలని చూసే ఎలాంటి ప్రశ్నా అడగడానికి వాళ్ళు సాహసించలేదు.