21

1 వాళ్ళు యెరూషలేము దగ్గరలో ఉన్న ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే అనే ఊళ్ళోకి వచ్చారు. 2 యేసు తన ఇద్దరు శిష్యులను పిలిచాడు. వాళ్ళతో "మీరు ఎదురుగా ఉన్న ఊళ్ళోకి వెళ్ళండి. ఊరు మొదట్లోనే కట్టేసి ఉన్న ఒక గాడిద, దాని పిల్ల కనబడతాయి. వాటి కట్లు విప్పి నా దగ్గరికి తోలుకురండి. 3 ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, "ఇవి ప్రభువుకు కావాలి"అని చెప్పండి. అప్పుడు అతడు వాటిని మీతో పోనిస్తాడు" అని చెప్పాడు. 4 ఇద్దరు శిష్యులు వెళ్ళి యేసు చెప్పినట్టు చేశారు. 5 గాడిదను, దాని పిల్లను యేసు దగ్గరికి తీసుకువచ్చారు. 6 యేసు కూర్చునేందుకు వీలుగా తమ బట్టలు తీసి దాని పైన వేశారు. 7 యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు.

8 జనులు గుంపులుగా యేసు చుట్టూ సమకూడి తమ బట్టలు దారి పొడవునా పరిచారు. మరికొందరు ఒలీవ చెట్టు కొమ్మలు నరికి వాటిని దారిలో పరిచారు. 9 జనులు యేసు ముందూ వెనుకా నడుస్తూ,
"దావీదు కుమారుడైన మెస్సీయకు స్తోత్రం!"
"దేవుడి ప్రతినిధిగా అధికారంతో వస్తున్న ఈయనను దేవుడు దీవిస్తాడు గాక!"
"ఉన్నత స్థలంలో ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక!"

అంటూ కేకలు వేశారు.

10 యేసు యెరూషలేములోనికి రాగానే ప్రజలు అనేకులు "వీళ్ళు ఈయనను ఇలా ఎందుకు పొగుడుతున్నారు?" అంటూ కలవరం చెందారు.

11 యేసుతో ఉన్న జనులు "ఈయన యేసు, గలిలయలోని నజరేతు నుంచి వచ్చిన ప్రవక్త" అని జవాబిచ్చారు.

12 తరువాత యేసు కోవెలలోకి వెళ్ళి గుమ్మం దగ్గర రకరకాల వస్తువులు అమ్ముతున్న, కొంటున్న వాళ్ళనందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లకి రోము నాణేల మారకం చేసేవాళ్ళ బల్లలనూ, అర్పణల కోసం పావురాలు అమ్మేవాళ్ళ పీటలను పడద్రోశాడు. 13 అప్పుడు ఆయన వాళ్ళతో, "దేవుడు ప్రవక్త ద్వారా పలికించినట్టు "నా ఆలయం ప్రార్థనలకు నిలయం" అని ఉంది. కాని మీరు దాన్ని దొంగల నిలయంగా చేశారు."

14 తరువాత అనేకమంది గుడ్డివాళ్ళూ, కుంటివాళ్ళూ యేసు దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళందరినీ బాగుచేశాడు.

15 ప్రధాన యాజకులు, యూదు చట్టాలు బోధించే పండితులు యేసు చేసిన ఈ అద్భుత కార్యాలన్నీ చూశారు, ఇంకా చిన్న పిల్లలు యేసు గురించి "దావీదు కుమారుడైన మెస్సీయకు స్తోత్రం!" అని వేస్తున్న కేకలు విన్నారు. 16 వాళ్లకు కోపం వచ్చింది. "వీళ్ళు వేస్తున్న కేకలు వింటున్నావా? అలా చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు?" అని అడిగారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, "అవును, వింటున్నాను. మీరు లేఖనాల్లో, చిన్న పిల్లలు నన్ను స్తుతిస్తారని, అందునుబట్టి దేవుడు ఆనందిస్తాడని రాసిన మాటలు మీరు మర్చిపోయారా? కీర్తనకారుడు తన కీర్తనలలో "చిన్న పిల్లలకు, చంటి బిడ్డలకు నిన్ను స్తుతించడం నేర్పించావు" అని రాశాడు కదా."

17 తరువాత యేసు ఆ ఊరిని విడిచిపెట్టి బయలుదేరి బేతనియ చేరుకొని అక్కడే ఆ రాత్రి గడిపాడు.

18 తెల్లవారగానే లేచి తిరిగి పట్టణంలోకి వస్తూ ఉండగా ఆయనకు ఆకలి వేసింది. 19 దారి పక్కనే అంజూరుు చెట్టు కనిపించింది. ఆ పండ్లు తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకి ఆకులు తప్ప కాయలేమీ లేవు. అందుకని ఆయన ఆ చెట్టుకేసి చూసి, "ఇక ముందు నువ్వు ఎన్నటికీ కాపు కాయవు" అని చెప్పాడు. ఫలితంగా ఆ అంజూరుు చెట్టు ఎండిపోయింది.

20 తరువాతి రోజు ఆ అంజూరు చెట్టు పూర్తిగా ఎండిపోయి ఉండడం శిష్యులు చూశారు. "ఈ చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో కదా" అని యేసుతో అన్నారు.

21 అందుకు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "ఇది వినండి: మీరు దేవుడిని నమ్మినప్పుడు సందేహం లేకుండా ఎలాంటి పనులైనా చెయ్యగలరు. ఈ అంజూరు చెట్టు విషయంలో నేను చేసినది మీరు చూశారు కదా. అంతే కాదు, మీకు పూర్తి నమ్మకం ఉంటే నాలాగా అద్భుతాలు మీరు కూడా చేయగలరు. ఆ కొండను చూడండి, దానితో "నువ్వు లేచి ఆ సముద్రంలో పడిపో" అని మీరు చెప్తే అది తప్పక జరుగుతుంది. 22 దీనికి తోడు మీరు దేనికోసమైనా దేవుడికి ప్రార్థించినప్పుడు దాన్ని దేవుడు ఇస్తాడనీ, దాన్ని మీరు పొందారని నమ్మండి."

23 ఆ తరువాత యేసు కోవెల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న మనుషులకు బోధించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కొందరు ప్రధాన యాజకులు, మత పెద్దలు అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసుతో, "నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? నిన్న నువ్వు చేసిన పనులకు నీకు అధికారం ఎవరిచ్చారు?" అని అడిగారు. 24 అందుకు యేసు, "నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. అప్పుడు నేను ఈ పనులు ఏ అధికారంతో చేస్తున్నానో చెప్తాను. 25 బాప్తిసమిచ్చే యోహానుకు తన మాటలు నమ్మిన వాళ్లకు బాప్తిసం ఇచ్చే అధికారం ఎక్కడినుంచి వచ్చింది? అతడు ఆ అధికారం దేవుడినుంచి పొందాడా లేక మనుషులు ఇచ్చారా?"

వాళ్ళు ఏమి జవాబు చెప్పాలో తమలో తాము చర్చించుకున్నారు. "ఇప్పుడు గనక మనం దేవుడి నుంచే అని చెప్తే, అందుకు ఆయన అలాగైతే మీరు అతడి సందేశం నమ్మవలసినది గదా, అంటాడు.

26 అలా కాక, మనుషుల నుంచి, అని చెప్తే జనం మనపై తిరగబడతారు." ఎందుకంటే ప్రజలు యోహాను దేవుడు పంపిన ఒక ప్రవక్త అని నమ్ముతున్నారు. 27 అందుకని వాళ్ళు "యోహాను ఆ అధికారం ఎక్కడినుంచి పొందాడో మాకు తెలియదు" అని చెప్పారు. అప్పుడు యేసు, "నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు గనక నిన్న నేను చేసిన పనులకు ఎవరు అధికారం ఇచ్చారన్నదానికి నేను కూడాజవాబు చెప్పను" అన్నాడు.

28 ఆయన ఇంకా మాట్లాడుతూ, "నేను చెప్పబోయేదాని గురించి మీకేమనిపిస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులున్నారు. అతడు తన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, "బాబూ, మన ద్రాక్షతోటకు వెళ్ళి పనిచెయ్యి" అని చెప్పాడు. 29 అప్పుడు వాడు, "నాన్నా నేను వెళ్ళను" అని చెప్పాడు. తరువాత వాడు తన మనసు మార్చుకుని తోటకు వెళ్ళి పనిచేశాడు. 30 తరవాత ఆ తండ్రి చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి పెద్ద కొడుకుకు చెప్పినట్టు చెప్పాడు. అయితే చిన్న కొడుకు, "సరే నాన్నా, తోటకి వెళ్తాను" అని చెప్పాడు గానీ ఆ పని చెయ్యలేదు."

31 "కాబట్టి ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరు తండ్రి మాట విన్నట్టు?" అని అడిగినప్పుడు వాళ్ళు "పెద్ద కొడుకే" అని చెప్పారు. అప్పుడు యేసు, "అయితే వినండి, మీరు పన్నులు వసూలు చేసేవాళ్ళను, వ్యభిచారులను వాళ్ళు మోషే నియమించిన చట్టాలను ఆచరించరని వాళ్ళను చిన్నచూపు చూస్తుంటారు గానీ దేవుడు వాళ్ళనే మొదటగా చేర్చుకుంటాడు. 32 నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిసమిచ్చే యోహాను మంచి మార్గంలో నడవాలని చెప్పిన మాటలు మీరు వినలేదు. అయితే పన్ను వసూలు చేసేవాళ్ళు, వ్యభిచారులు అతని మాటలు నమ్మి, తమ పాప స్వభావాన్ని మార్చుకున్నారు. దాన్ని చూసి కూడా మీరు అతని మాటలు వినలేదు, పాపం చెయ్యడం మానలేదు."

33 "మరొక ఉపమానం చెప్తా వినండి. ఒక ద్రాక్ష తోట నాటించిన ఒక యజమాని ఉన్నాడు. అతడు తన తోట చుట్టూ ప్రహరీ గోడ కట్టించి ఒక ద్రాక్ష గానుగ ఏర్పాటు చేశాడు. ఒక ఎత్తైన గోపురం కట్టించి తోటకు కాపలా నియమించాడు. ప్రతి యేడూ పంట తనకు అప్పగించేలా కొంతమందికి తన తోట కౌలుకు ఇచ్చాడు. తరువాత అతడు వేరే దేశానికి వెళ్ళాడు."

34 "కొంత కాలం గడచిన తరువాత పంట చేతికొచ్చే సమయంలో ఆ యజమాని తన వంతు తీసుకురమ్మని కొందరు పనివాళ్ళను కౌలుదారుల దగ్గరికి పంపించాడు. 35 ఆ కౌలుదారులు ఆ సేవకులను బంధించి ఒకణ్ణి కొట్టారు. ఒకణ్ణి చంపివేశారు, మరొకడిని రాళ్ళతో కొట్టి చంపారు."

36 "తరువాత ఆ యజమాని ఇంకా ఎక్కువమంది సేవకులను పంపాడు. ఆ కౌలుదారులు ముందు వచ్చిన వాళ్ళకు చేసినట్టుగానే వీళ్ళ పట్ల కూడా ప్రవర్తించారు. 37 ఇది విన్న యజమాని "నా కొడుకునైతే వాళ్ళు తప్పకుండా గౌరవిస్తారు, ఎలాంటి హానీ తలపెట్టరు"అనుకుని తోటలో భాగం కోసం తన కొడుకుని పంపించాడు."

38 "యజమాని కొడుకు వస్తూ ఉండడం చూసిన కౌలుదారులు "ఆ వచ్చేవాడు ఈ ఆస్తి మొత్తానికి వారసుడు. మనం వీణ్ణి గనక చంపేస్తే ఇక ఈ ఆస్తి అంతా మనం పంచుకోవచ్చు" అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. 39 వాళ్ళు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటకు ఈడ్చుకువెళ్లి చంపి పడేశారు."

40 "నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ యజమాని వచ్చి ఆ కౌలుదారుల్ని ఏమి చేస్తాడని మీరు అనుకుంటున్నారు?" అని యేసు అడిగాడు.

41 అందుకు వాళ్ళు, "యజమాని ఆ దుర్మార్గుల్ని నాశనం చేస్తాడు. తనకు సక్రమంగా పంటలో భాగమిచ్చే వేరే కౌలుదారులకు అతని తోటను అప్పగిస్తాడు" అని బదులిచ్చారు.

42 అప్పుడు యేసు, "మీరు లేఖనాల్లో చదివిన ఈ మాటలను జాగ్రత్తగా ధ్యానం చెయ్యండి.
ఇల్లు కట్టేవాళ్ళు తీసి పడవేసిన రాయి చివరికి ఇతరులు కట్టుకునే ఇళ్ళకి అదే ముఖ్యమైన పునాది రాయి అయింది.
ప్రభువే దీనిని చేశాడు, ఇది మనకెంతో ఆశ్చర్యకరం."

43 "కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, అలాంటి ప్రజలను దేవుడు తనవాళ్ళుగా ఉండనీయకుండా తీసివేస్తాడు. తాను కోరుకున్న విధంగా ఉండే ప్రజలను తన సొంత ప్రజలుగా స్వీకరిస్తాడు. 44 ఎవడైనా ఒక బండ రాయి మీద పడితే వాడు ముక్కలు ముక్కలు అవుతాడు, అదే రాయి వాడి మీద పడితే వాడు నజ్జు నజ్జు అయిపోతాడు."

45 ఈ ఉదాహరణ విన్న పరిసయ్యులు, యూదుల పెద్దలు తాము ఈ యేసును మెస్సీయ అని నమ్మకపోవడం వలన ఇది తమ గురించే చెప్పాడని అనుకున్నారు.

46 వాళ్ళు యేసును పట్టుకుని బంధించాలని చూశారు. అయితే ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తూ ఆయన చెప్పే మాటలు వింటున్నారు గనుక ఆ ప్రజలు తిరగబడతారని భయపడ్డారు.