20

1 దేవుడు పరిపాలించే పరలోకరాజ్యం ఒక తోట యజమాని చేసిన పనిలాగా ఉంది. ఎలాగంటే, ప్రతిరోజూ పొద్దున్నే తోట యజమాని మార్కెట్టుకి వెళ్ళి అక్కడ కూర్చుని ఉండే పనివాళ్ళను తన ద్రాక్ష తోటలోకి పనికి కుదుర్చుకున్నాడు. 2 ఒక్కొక్కరికి వంద రూపాయలు కూలీ ఇచ్చేలా బేరం కుదుర్చుకుని వాళ్ళను పనిలోకి పంపించాడు.

3 "ఉదయం తొమ్మిది గంటలకి మార్కెట్టుకి వెళ్ళి అక్కడ చేయడానికి పని ఏమీ లేకుండా ఉన్న కొంతమంది పనివాళ్ళను చూశాడు. 4 అతడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, "పొద్దున్న వెళ్ళినవాళ్ళ లాగా మీరు కూడా నా ద్రాక్షతోటకి వెళ్ళి పనిచెయ్యండి. మీకు న్యాయమైన కూలీ ముట్టజెప్తాను" అన్నాడు.

5 "మధ్యాహ్నం పన్నెండు గంటలకి మార్కెట్టుకి వెళ్ళి అక్కడ ఉన్న పనివాళ్ళను సరియైన కూలీ ఇస్తానని చెప్పి తోటకు పంపించాడు. 6 మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మార్కెట్టుకి వెళ్ళి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్న పనివాళ్ళను చూశాడు. అతడు వాళ్ళతో, "పనేమీ చేయకుండా రోజంతా ఇలా ఉన్నారేమిటి?" అని అడిగాడు. 7 అందుకు వాళ్ళు "మమ్మల్ని ఎవ్వరూ పనిలోకి పెట్టుకోలేదు" అని చెప్పారు. "నేను మీకు పని ఇస్తాను. మీరు నా ద్రాక్షతోటకి వెళ్ళి అక్కడున్నవాళ్ళతో కలిసి పనిచెయ్యండి" అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు."

8 "పని సమయం ముగిసిన తరువాత యజమాని తన మేనేజర్ ని పిలిచాడు. "పనివాళ్ళందరినీ పిలిపించు. చివర వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి మొదట వచ్చిన వాళ్ళందరికీ కూలీ డబ్బులు ఇవ్వు" అని చెప్పాడు. 9 ఆ మేనేజర్ సాయంత్రం ఐదు గంటలకు పనికి వచ్చిన వాళ్ళతో కలిపి అందరికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చాడు. 10 పొద్దున్నే పని మొదలుపెట్టిన కూలీ డబ్బుల కోసం వెళ్ళినప్పుడు తమకు చెప్పిన కూలీ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కానీ వాళ్లకు ముందుగా చెప్పిన డబ్బులే అందాయి."

11 "అందువల్ల వాళ్ళంతా ద్రాక్షతోట యజమాని దగ్గరికి వెళ్ళి తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. 12 వాళ్ళు యజమానితో "ఇదేం బాగోలేదు. చివరగా వచ్చిన వీళ్ళు ఒక్క గంట మాత్రమే పనిచేశారు. మేమైతే పొద్దుటినుంచి ఎండలో కష్టపడి పనిచేశాం. నువ్వేమో అందరికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చావు" అన్నారు."

13 "అందుకు ద్రాక్షతోట యజమాని, "మిత్రమా, నేనేమీ మీకు అన్యాయం చెయ్యలేదు. నేను చెప్పిన జీతానికి పనిచెయ్యడానికి నువ్వు ఒప్పుకున్నావు. 14 నీ కూలీ నువ్వు తీసుకుని వెళ్ళిపో! మీరంతా పని మొదలు పెట్టిన తరువాత వచ్చిన వీరికి మీతోపాటు సమానంగా కూలీ ఇవ్వడం నా ఇష్టం. 15 నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు నాకు ఉంది. అవునా, కాదా? నా మంచితనాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా?" అన్నాడు. 16 ఇదేవిధంగా దేవుడిచ్చే బహుమతులు కూడా ఇలాగే ఉంటాయి. తక్కువ ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు కొందరికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంతో ముఖ్యమైన వాళ్ళుఅనుకునే కొందరికి ఆయన ఏ ప్రతిఫలాన్నీ ఇవ్వడు."

17 యేసు యెరూషలేముకు వెళ్లబోయేటప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఒకచోటికి తీసుకువెళ్ళి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాడు. 18 "జాగ్రత్తగా వినండి! మనం ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళబోతున్నాం. అక్కడ యూదు అధికారులు, యూదు చట్టాలు బోధించే పండితులూ మనుష్య కుమారుణ్ణి అయిన నన్ను బంధిస్తారు. నాకు తీర్పు తీర్చి మరణ శిక్ష విధిస్తారు. 19 నన్ను అవమానపరచి , హింసించి మేకులతో సిలువకు వేలాడదీసి చంపడానికి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు. అయితే చనిపోయిన నన్ను దేవుడు మూడవ రోజున తిరిగి బ్రతికేలా చేస్తాడు."

20 అప్పుడు జెబెదయి కొడుకులైన యాకోబు, యోహానుల తల్లి ఈ ఇద్దరినీ వెంటబెట్టుకుని యేసు దగ్గరికి వచ్చి యేసుకు నమస్కరించి తన కోసం ఒక పని చేసిపెట్టమని అడిగింది. 21 అదేమిటో చెప్పమని యేసు ఆమెతో అన్నాడు. అందుకామె, "యేసూ, నువ్వు రాజుగా తిరిగి వచ్చినప్పుడు నా కొడుకులిద్దరినీ నీ కుడిపక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుంటావని నాకు మాట ఇవ్వు" అంది.

22 అప్పుడు యేసు ఆమెతో, ఆమె కొడుకులిద్దరితో ఇలా చెప్పాడు, "మీరు అడుగుతున్నదేమిటో మీకు అర్థం కావడం లేదు. నేను హింసలు పొందబోతున్నట్టుగా మీరు హింసలు పొందుతారా?" అని అడిగాడు. అందుకు వాళ్ళు "హింసలు భరించగలం" అని చెప్పారు. 23 యేసు, "అవును, నేను హింసలు పొందినట్టు మీరు కూడా పొందగలరు. అయితే కుడి పక్కన, ఎడమ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుని పాలించే అధికారం నాకు లేదు. నా తండ్రియైన దేవుడు వీటిని ఎవరి కోసం నియమించాడో వాళ్ళకే దక్కుతాయి."

24 మిగిలిన పది మంది శిష్యులు యాకోబు యోహానుల కోరిక విని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా యేసు పక్కన కూర్చునే మహా భాగ్యం తమకు కూడా దక్కాలని కోరుకుంటున్నారు.

25 యేసు వాళ్ళను తన దగ్గరికి పిలిచి, "యూదులు కాని ప్రజల్లో అధికారులు ప్రజలపై పెత్తనం చెలాయిస్తారని మీకు తెలుసు. అలాగే ప్రముఖులైన అధికారులు తమ క్రిందివాళ్ళమీద అధికారం చూపిస్తారు. 26 మీరు వాళ్ళలాగా ఉండకూడదు. అందుకు భిన్నంగా మీలో గొప్పవాడుగా ఉండాలని కోరుకునేవాడు మీకు సేవకుడుగా ఉండాలి."

27 "అవును, మీలో ఎవరిని దేవుడు గొప్పవాడిగా ఎంచాలని కోరుకుంటాడో వాడు మిగిలినవాళ్ళందరికీ దాసుడుగా ఉండాలి. 28 నాలాగా చెయ్యండి. నేను మనుష్య కుమారుడినైనప్పటికీ నేను ఇతరుల చేత సేవలు చేయించుకోవడానికి రాలేదు. అందుకు బదులుగా ఇతరులకి సేవ చేయడానికీ, వాళ్ళ చేతుల్లో ప్రాణం కోల్పోయి అనేకమంది పాపాల కోసం నా ప్రాణం ఇవ్వడానికీ వచ్చాను." 29 వాళ్ళు యెరికో పట్టణం దాటిపోతూ ఉన్నప్పుడు జనులు పెద్ద గుంపుగా ఆయనను వెంబడించారు. 30 వాళ్ళు నడుస్తూ ఉండగా దారి పక్కన ఇద్దరు గుడ్డివాళ్ళు కూర్చుని ఉండడం చూశారు. ఆ గుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వెళ్తున్నాడని విని, "ప్రభూ, దావీదు కుమారా, నువ్వే మెస్సీయ్యవు. మమ్మల్ని కనికరించు" అంటూ కేకలు వేశారు. 31 గుంపులో ఉన్న మనుషులు వాళ్ళపై కోపగించుకుని నెమ్మదిగా ఉండమని వాళ్ళను హెచ్చరించారు. అయితే ఆ గుడ్డివాళ్ళు ఇంకా గట్టిగా "ప్రభూ, దావీదు కుమారా, మెస్సీయా, మమ్మల్ని కనికరించు!" అని కేకలు వేశారు.

32 యేసు అక్కడే ఆగిపోయి వాళ్ళను తన దగ్గరకు తీసుకురమ్మని పిలిచాడు. వాళ్ళను "నేను మీకేం చెయ్యాలి?" అని అడిగాడు. 33 అందుకు వాళ్ళు "ప్రభూ, మేము చూడగలిగేలా మా కళ్ళు బాగుచెయ్యి" అని అడిగారు. 34 యేసు వాళ్ళను చూసి జాలిపడి తన చేతులతో వాళ్ళ కళ్ళు తాకాడు. వెంటనే వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. యేసుని వెంబడిస్తూ ముందుకు సాగారు.