19

1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో కలసి గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది పక్కన ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. 2 అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు. వాళ్ళలో జబ్బు పడి ఉన్న చాలా మందిని యేసు బాగుచేశాడు.

3 కొందరు పరిసయ్యులు యేసుకు చిరాకు కలిగించి ఆయనతో వాదులాట పెట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసుని, "ఎలాంటి కారణం వలనైనా ఒక పురుషుడు తన భార్యను వదిలెయ్యడాన్ని యూదుల చట్టం ఆమోదిస్తుందా?" అని అడిగారు. 4 అప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "దేవుడు సృష్టి కార్యం తరువాత మొదటగా పురుషుడినీ, తరువాత స్త్రీనీ చేశాడని మీరు గ్రంథాలలో చదివారు కదా. 5 అందుకే పురుషుడు తన తల్లినీ తండ్రినీ విడిచిపెట్టి తన భార్యను పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిలాగా కలిసి జీవిస్తారు, అని చెప్పాడు. 6 అదేవిధంగా మొదట వేరు వేరుగా ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వీళ్ళు ఇప్పుడు కలసి ఏక శరీరులుగా ఉంటారు. ఇది సత్యం గనుక, దేవుడు ఏకం చేసిన వీళ్ళను ఏ మనిషీ విడదీయకూడదు."

7 అందుకు పరిసయ్యులు, "అదే నిజమైతే, ఒకడు తన భార్య నుంచి విడిపోవాలని కోరుకుంటే అందుకు కారణం తెలుపుతూ విడాకుల పత్రం రాసి ఇవ్వొచ్చు అని మోషే ఆజ్ఞాపించాడు గదా" అన్నారు. 8 అందుకు యేసు, "మీ పూర్వీకుల హృదయకాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పి ఉండవచ్చు గానీ మొదటగా దేవుడు స్త్రీ పురుషుడ్ని సృష్టించినప్పుడు వారిద్దరూ కలిసి ఉండాలి గానీ విడిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. 9 నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒకడు తన భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, తన భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే అతడు వ్యభిచారం అనే పాపం చేసినట్టుగా దేవుడు ఎంచుతాడు."

10 శిష్యులు "అదే నిజమైతే పురుషులు పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే మంచిది" అన్నారు. 11 అందుకు యేసు, "దేవుడు అనుమతించిన వాళ్ళు తప్ప మరి ఇంకెవ్వరూ ఈ బోధను అంగీకరించరు. 12 పుట్టినప్పటి నుంచి పురుషత్వం లోపం కారణంగా పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. నపుంసకులుగా మార్చబడిన వాళ్ళు, అలాగే పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళూ పెళ్ళికి దూరంగా ఉన్నారు. పెళ్ళి గురించి నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకున్నవాడు వాటిని అంగీకరించి పాటిస్తాడు" అని చెప్పాడు.

13 తరువాత కొందరు యేసు తమ పిల్లల తలలపై చేతులుంచి ప్రార్ధించాలని ఆశించి పిల్లలను యేసు దగ్గరకు తీసుకువచ్చారు. అయితే శిష్యులు వాళ్ళను యేసు దగ్గరకు రానీయకుండా అడ్డుకున్నారు. 14 అది చూసిన యేసు, "ఆ పిల్లలను ఆపకండి. నా దగ్గరకు రానీయండి. పరలోక రాజ్య పాలనలో వినయం, నమ్మకత్వం ఉన్న ఇలాంటి పిల్లలకే స్థానం దక్కుతుంది" అని చెప్పాడు. 15 ఆ పిల్లలపై చేతులు వేసి వాళ్ళను దీవించాడు. తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

16 యేసు వీధిలో నడుస్తూ ఉండగా ఒక యువకుడు యేసును కలుసుకుని, "నేను దేవుడి రాజ్యంలో కలకాలం ఉండాలంటే ఎలాంటి మంచి పనులు చెయ్యాలి?" అని అడిగాడు.

17 అందుకు యేసు, "మంచి పనులను గురించి నన్నెందుకు అడుగుతున్నావు? నిజంగా మంచి వాడు దేవుడొక్కడే. అయితే నిత్య జీవం కోసం నీ ప్రశ్నకు జవాబేమిటంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చు" అని చెప్పాడు.

18 ఆ యువకుడు "ఏ ఆజ్ఞలు నేను నెరవేర్చాలి?" అని అడిగాడు. యేసు, "నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, దొంగతనం చెయ్యవద్దు, దొంగ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పక్కన ఉన్నవాణ్ణి కూడా ప్రేమించు" అని చెప్పాడు.

20 ఆ యువకుడు, "ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను. నిత్య జీవం కోసం ఇంకా నేనేం చెయ్యాలి" అని అడిగాడు.

21 అప్పుడు యేసు, "అయితే నువ్వు తప్పకుండా చెయ్యాలని దేవుడు కోరేది ఒకటుంది. ఇంటికి వెళ్ళి, నీకు ఉన్నదంతా అమ్మివేసి, వచ్చినదంతా పేదవాళ్ళకు పంచిపెట్టు. అప్పుడు పరలోకంలో నీకు ఆస్తి సమకూరుతుంది. తరువాత నా శిష్యుడిగా మారి నన్ను వెంబడించు" అన్నాడు. 22 ఆ యువకుడు బాగా ఆస్తిపరుడు. తన ఆస్తి ఇతరులకు పంచడం అతనికి ఇష్టం లేదు. అందువల్ల ఈ మాటలు విన్న అతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు.

23 అప్పుడు యేసు తన శిష్యులతో, "ఇది మనసులో ఉంచుకోండి, ధనవంతులు తమ జీవితాలను దేవుని పాలనకు లోబరచుకోవడం ఎంతో కష్టం. 24 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జం గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక" అని చెప్పాడు.

25 ఈ మాటలు విన్న శిష్యులు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ధనవంతులను దేవుడు ఎక్కువగా దీవిస్తాడని వాళ్ళు అనుకునేవాళ్లు. అప్పుడు వాళ్ళు, "అలాగైతే మరి ఎవ్వరూ రక్షింపబడలేరు" అన్నారు.

26 యేసు వాళ్ళకేసి తీక్షణంగా చూశాడు. "అవును, మనుషులు తమను తాము రక్షించుకోవడం అసాధ్యమే. అయితే దేవుడు వాళ్ళను రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడికి అంతా సాధ్యమే" అని చెప్పాడు. 27 అప్పుడు పేతురు, "అయ్యా, మేము మాకున్నదంతా విడిచిపెట్టి నీ శిష్యులంగా నీతోపాటు ఉంటున్నాము. ఈ సంగతి నీకూ తెలుసు. మరైతే దీనివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?" అని అడిగాడు.

28 అందుకు యేసు, "ఇది మీ మనస్సుల్లో ఉంచుకోండి. మీకు గొప్ప మేలు కలుగుతుంది. దేవుడు నిర్మించే కొత్త లోకంలో మనుష్య కుమారుడినైన నేను మహిమ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను వెంబడిస్తున్న మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలకు తీర్పు తీరుస్తారు."

29 "నా శిష్యులైన మీరు నా కోసం మీ ఇళ్ళను, భూములను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, భార్యా పిల్లలను నా కోసం విడిచిపెట్టి వచ్చారు గనుక దేవుడు తగిన బహుమతి ఇస్తాడు. మీలో ప్రతివాడూ ఇంతకు వంద రెట్లు ప్రతిఫలం పొందుతారు. దాంతోపాటు దేవుడితోపాటు కలకాలం జీవిస్తారు. 30 ఈ లోకంలో ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు అనేకమంది భవిషత్తులో సామాన్యులు అవుతారు, ముఖ్యులు కానివారు చాలామంది ముఖ్యులు అవుతారు."