18

1 రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చారు. "దేవుడు నిన్ను పరలోకానికి రాజుగా చేసినప్పుడు మాలో ఎవరిని గొప్పవాడుగా ఎంచుతావు?" అని యేసును అడిగారు. 2 అప్పుడు యేసు ఒక పిల్లవాణ్ణి పిలిచి మధ్యలో నిలబెట్టాడు. 3 "నిజం చెప్తున్నాను వినండి. మీరు మార్పు చెంది ఇలాంటి చిన్నపిల్లల వంటి తగ్గింపు మనస్సు పొందకపోతే మీరు ఎన్నటికీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు."

4 "చిన్నపిల్లవాడిలాగా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు పరలోకంలో గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. 5 ఇంకా, ఇలాంటి పిల్లల్ని నా పేరట ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టుగానే దేవుడు చూస్తాడు."

6 "నన్ను నమ్మినవాళ్ళను, లేదా చిన్నపిల్లలను అల్పులుగా భావించి వాళ్ళను పాపం చేయమని పురిగొల్పే వ్యక్తిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. అలాంటి వాడి మెడకు ఒక పెద్ద బరువైన రాయి కట్టి లోతుగా ఉన్న సముద్రంలో పడవేయడమే అలాంటివాడికి తగిన శిక్ష."

7 "ఇతరులను పాపం చేయడానికి ప్రేరేపించడం ఎంత దారుణం! పాపంలో పడేసే అనేక శోధనలు ఎదురౌతాయి. అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తిని పాపంలో పడేలా చేయడం క్షమించరాని నేరం. 8 కాబట్టి నీ చేతులు గానీ, కాళ్ళు గానీ పాపం చేయాల్సివస్తే వాటిని వాడడం మానేయండి. తప్పని పరిస్థితిలో పాపం చేయాల్సివస్తే పాపం చెయ్యకుండా ఉండేందుకు వాటిని నరికివేయండి. ఒకవేళ నువ్వు రెండు కాళ్ళు, రెండు చేతులు కలిగి ఉండి దేవుడి చేత నరకంలో త్రోయబడి నానా యాతనలు పడేకంటే, ఒక చెయ్యి ఒక కాలుతో పరలోకంలో కలకాలం జీవించడం మంచిది కదా."

9 "అవును, నీ కళ్ళతో పాపపు పనులు చూడాల్సివస్తే అలాంటి పనులు చూడకు. తప్పనిసరి అయితే పాపం చూడకుండా, చెయ్యకుండా ఉండేందుకు నీ కంటిని పెరికి వెయ్యి. రెండు కళ్ళు కలిగి ఉండి నిత్యమైన నరక శిక్ష అనుభవించేకంటే, ఒంటి కన్నుతో దేవునితో కలసి పరలోకంలో కలకాలం జీవించడం మేలు కదా."

10 "చిన్నపిల్లలలో ఎవరినీ తక్కువగా చూడవద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరలోకంలో దూతలు పిల్లల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారు. 11 మీలో ఎవరైనా చిన్న పిల్లలకు హాని కలిగిస్తే దూతలు మీపై దేవుడికి ఫిర్యాదు చేస్తారు."

12 "ఒక విషయం చెబుతాను, ఆలోచించండి. నీకు వంద గొర్రెలు ఉన్నాయనుకో. వాటిల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను వెదకడానికి వెళ్తావు కదా. 13 ఆ గొర్రెపిల్ల కనబడినప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా. మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు నీకు కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది. 14 అదే విధంగా తప్పిపోయిన గొర్రె విషయం గొర్రెల కాపరి ఆనందించినట్టు ఈ చిన్నపిల్లల్లో ఎవ్వరూ తప్పిపోయి నరకంలో పడకుండా ఉండాలని పరలోకంలోని తండ్రియైన దేవుడు కోరుకుంటున్నాడు."

15 "నీ తోటి విశ్వాసి ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతణ్ణి కలుసుకుని అతనితో మాట్లాడు. అతడు నువ్వు చెప్పినది విని చేసిన తప్పును గ్రహించి క్షమాపణ కోరితే నువ్వు మంచి స్నేహితుణ్ణి సంపాదించుకున్నవాడివౌతావు. 16 ఒకవేళ అతడు నీ మాట వినకపోతే ఇద్దరు విశ్వాసులను వెంటబెట్టుకు వెళ్ళు. ప్రతి విషయం ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల ఎదుట రుజువు కావాలి గనక ఈ విధంగా చెయ్యి."

17 "అప్పుడు కూడా నీ విషయంలో తప్పు చేసిన వ్యక్తి మాట వినకపోతే అతణ్ణి సరిదిద్దమని మీ సంఘం అంతటికీ విషయం చెప్పు. అప్పుడు కూడా అతడు వాళ్ళ మాట వినకపోతే ఇక అతణ్ణి సమాజం నుంచి వెలివేయబడిన వాడుగా, మనసు లేని కసాయివాడిగా ఎంచు."

18 "ఈ విషయం గుర్తు పెట్టుకోండి. మీ సమాజంలో ఎవరినైతే మీరు దండించాలని కోరుకుంటారో, లేదా మెచ్చుకుంటారో అదే విధంగా పరలోకంలో కూడా జరుగుతుంది. 19 మరో విషయం, ఈ లోకంలో కనీసం ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కువమంది కూడుకుని కలసి ఏక మనసుతో దేని గురించైనా ప్రార్ధిస్తే దాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు. 20 ఇది నిజం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నన్ను నమ్మి కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను."

21 తరువాత పేతురు యేసు దగ్గరకు వచ్చి, "నా తోటి విశ్వాసి నాపట్ల తప్పు చేసి క్షమాపణ కోరితే నేను అతణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లు సరిపోతుందా?" అని అడిగాడు. 22 అందుకు యేసు, "ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్భై ఏడు సార్ల వరకైనా క్షమించాలని నేను నీతో చెప్తున్నాను" అని చెప్పాడు.

23 దీనిని పరలోక రాజ్యాన్ని తన సేవకులతో డబ్బు లెక్కలు సరిచూసుకునే రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు తనకు బాకీ ఉన్న సేవకుల నుండి డబ్బు వసూలు చేసుకోవాలని కోరుకున్నాడు.

24 సేవకులు తమ తమ లెక్కలు సరిచూసుకునేందుకు రాజు దగ్గరకు వచ్చారు. రాజు సేవకుడు బాకీ ఉన్న ఒకణ్ణి తీసుకువచ్చాడు. వాడు రాజుగారికి మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. 25 అయితే బాకీ తీర్చడానికి వాడి దగ్గర అంత డబ్బు లేదు. రాజు వాడి భార్యా పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.

26 అంత పెద్ద మొత్తం తీర్చే స్తోమత వాడికి లేదు. కాబట్టి వాడు రాజుగారి కాళ్ళమీద పడి, "అయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను బాకీ తప్పకుండా తీరుస్తాను" అని బతిమాలుకున్నాడు.

27 వాడు తన బాకీ తీర్చలేడని రాజు గ్రహించాడు. వాడి మీద జాలిపడ్డాడు. వాడు ఇవ్వాల్సిన బాకీ మొత్తం రద్దు చేసి వాణ్ణి విడిచిపెట్టాడు.

28 "అప్పుడు వాడు తనకు చిన్న మొత్తం బాకీ ఉన్న మరొక సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. వాడి పీక పట్టుకుని "నా బాకీ వెంటనే తీర్చు"అంటూ అతణ్ణి వేధించడం మొదలుపెట్టాడు. 29 అందుకు ఆ సేవకుడు వాడి కాళ్ళు పట్టుకుని "కొంచెం ఓపిక పట్టు. నీ బాకీ నెమ్మదిగా తీర్చుకుంటాను" అని వేడుకున్నాడు."

30 "అయితే ఆ మొదటి సేవకుడు ఏ మాత్రం జాలి చూపకుండా బాకీ రద్దు చేయడానికి నిరాకరించాడు. అందుకు బదులు అతణ్ణి గురించి అధికారులకు ఫిర్యాదు చేసి తన బాకీ తీర్చేవరకు జైలులో పెట్టించాడు. 31 ఇదంతా గమనించిన మిగిలిన పనివాళ్ళు వాడు చేసిన పనికి బాధపడ్డారు. వాళ్ళు రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా రాజుకు వివరించారు."

32 "రాజుకి కోపం వచ్చింది. వెంటనే రాజు తన సేవకుల్ని పంపించాడు, వాళ్ళు రాజుకు పెద్ద మొత్తం బాకీ ఉన్న ఆ సేవకుణ్ణి బంధించి తీసుకువచ్చారు. అప్పుడు రాజు, "నీ నీచమైన బుద్ది బయటపెట్టావు. దుర్మార్గుడా, నువ్వు బతిమాలుకున్నావని నీమీద జాలిపడి నీ బాకీ మొత్తం రద్దు చేశాను. 33 అలాగే నేను చేసినట్టు నువ్వు కూడా నీకు బాకీ ఉన్నవాడిపై జాలి చూపించి వాణ్ణి వదిలిపెట్టాలి కదా, అని చెప్పి, 34 "తన సైనికులని పిలిచి వాడు తనకు బాకీ ఉన్న మొత్తం చెల్లించే వరకు వాణ్ణి తీవ్రంగా హింసించి చెరసాలలో ఉంచమని ఆజ్ఞాపించాడు."

35 "మీలో ప్రతి ఒక్కరూ మీ సాటి విశ్వాసుల విషయంలో నిజాయితీ కలిగి, కనికరం చూపించకపోతే దేవుడు కూడా మీ విషయంలో అలాగే ప్రవర్తిస్తాడు" అని వాళ్ళతో చెప్పాడు.