17

1 ఒక వారం రోజులు గడిచిన తర్వాత యేసు పేతురు, యాకోబు, యాకోబు తమ్ముడు యోహానులను వెంటబెట్టుకుని మనుషులకు దూరంగా ఒక ఎత్తైన కొండ పైకి తీసుకువెళ్ళాడు. 2 వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో శిష్యులు ముగ్గురూ చూస్తూ ఉండగానే యేసు రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వేసుకున్న బట్టలు వెలుగుతో ధగధగలాడాయి.

3 ఉన్నట్టుండి పూర్వ కాలంలో జీవించిన ప్రవక్తలు మోషే, ఏలీయాలు అక్కడికి దిగివచ్చి యేసుతో మాట్లాడుతున్నారు. 4 ఇది చూసిన పేతురు యేసుతో, "ప్రభూ, మనం ఇక్కడే ఉండిపోతే చాలా బాగుంటుంది. నువ్వు చెప్తే నీకు ఒకటీ, మోషేకి ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పాకలు వేస్తాను" అన్నాడు.

5 పేతురు అలా మాట్లాడుతూ ఉండగానే, గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వాళ్ళను కమ్మివేసింది. ఆ మేఘంలో నుంచి దేవుడు పలికిన మాటలు వినబడ్డాయి, "ఈయన నేను ప్రేమించే నా కుమారుడు. ఈయన గురించి నేను ఆనందంగా ఉన్నాను. మీరు ఈయన మాట తప్పకుండా వినండి."

6 దేవుని మాటలు విన్న ఆ ముగ్గురు శిష్యులు భయంతో వణికిపోయారు. నేల మీద బోర్లా పడిపోయారు. 7 యేసు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళను తట్టి లేపాడు. "ఏమీ భయం లేదు, లేచి నిలబడండి" అని చెప్పాడు. 8 వాళ్ళు లేచి చూసినప్పుడు అక్కడ యేసు తప్పించి ఇంకెవ్వరూ వాళ్లకు కనబడలేదు.

9 వాళ్ళు కిందికి దిగి వచ్చేటప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచే రోజుదాకా మీరు చూసిన ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు." 10 అప్పుడు శిష్యులు, "నువ్వు చెప్తున్నది నిజమైతే, యూదు చట్టాలు బోధించే బోధకులు మెస్సీయ రాక ముందు మొదట ఏలీయా రావాలని చెప్తున్నారు కదా. ఏది నిజం?" అని అడిగారు.

11 యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మీరు అంటున్నది నిజమే, మెస్సీయ రాకను సిద్ధం చేయడానికి ఏలీయాను పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. 12 అయితే ఇది గమనించండి: ఏలీయా ఇప్పటికే వచ్చాడు. మన నాయకులు అతణ్ణి చూశారు గానీ, అతడే మెస్సీయా కంటే ముందుగా పంపబడినవాడని వాళ్ళు గుర్తించలేదు. బదులుగా వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు అతణ్ణి బాధించారు. అదే విధంగా వాళ్ళు పరలోకం నుండి వచ్చిన నన్ను కూడా శ్రమలపాలు చేస్తారు." 13 యేసు, ఏలీయాను బాప్తిసమిచ్చే యోహానుతో పోల్చి చెబుతున్నాడని శిష్యులు అర్థం చేసుకున్నారు.

14 తరువాత యేసు తన ముగ్గురు శిష్యులతో దిగి వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు, జన సమూహాలు వాళ్ళతో కలిశారు. అప్పుడు ఒక వ్యక్తి యేసు ఎదుటికి వచ్చి ఆయన ముందు మోకరించి, ఇలా చెప్పాడు, 15 "అయ్యా, నా కొడుకుని కనికరించి, వాణ్ణి బాగుచెయ్యి. వాడు మూర్చరోగంతో బాధపడుతున్నాడు. ఈ రోగంవల్ల వాడు పదే పదే నీళ్ళలో, నిప్పుల్లో పడిపోతూ ఉన్నాడు. 16 నీ శిష్యులు బాగుచేస్తారని వాళ్ళ దగ్గరకి తీసువెళ్ళాను, వాళ్లకు వీలవ్వలేదు."

17 అప్పుడు యేసు, "దేవుని శక్తిని నమ్మలేని గందరగోళ పరిస్థితిలో ఉన్న ఈ తరం మనుషులారా, నేను చేస్తున్నట్టు మీరు ఎప్పటికి చేయగలుగుతారు? నేను ఎంతకాలం మీతోపాటు ఉంటాను? ఆ పిల్లవాణ్ణి నా దగ్గరికి తీసుకురండి" అన్నాడు. 18 వాళ్ళు ఆ బాలుణ్ణి తీసుకువచ్చినప్పుడు యేసు అతణ్ణి పట్టి పీడుస్తున్న దురాత్మను తీవ్రంగా గద్దించాడు. ఆ దురాత్మ పిల్లవాణ్ణి విడిచిపెట్టింది. వెంటనే పిల్లవాడు బాగుపడ్డాడు.

19 తరువాత కొందరు శిష్యులు యేసు ఒక్కడే ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వచ్చి, "మేమెందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం?" అని అడిగారు.

20 ఆయన ఇలా జవాబిచ్చాడు, "మీరు దేవుని శక్తి మీద పూర్తి నమ్మకం ఉంచలేదు. ఇది ఆలోచించండి. ఆవగింజలు చూడండి, అవి చాలా చిన్నవి. అవి పెరిగినప్పుడు మొక్కలుగా అవుతాయి. 21 అదే విధంగా మీ విశ్వాసం కొంచెంగా ఉన్నప్పటికీ మీరు దేవుని ఏది అడిగినా ఆయన తప్పకుండా మీకు చేస్తాడు. ఈ కొండను చూసి, "ఇక్కడినుంచి అవతలికి వెళ్ళు" అని మీరు చెప్తే, అది మీరు చెప్పినట్లు పక్కకు వెళ్తుంది."

22 గలిలయ ప్రాంతంలో వాళ్ళంతా ఉన్నప్పుడు యేసు, "త్వరలో మనుష్య కుమారుడు విరోధుల చేతికి చిక్కుతాడు. 23 వాళ్ళు నన్ను చంపుతారు. అయితే నేను చనిపోయిన మూడవ రోజున దేవుడు నన్ను బ్రతికిస్తాడు." ఇది విన్న శిష్యులు ఎంతో విచారంలో మునిగిపోయారు.

24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూముకు చేరుకున్నారు. దేవాలయం పన్ను కట్టించుకునే వ్యక్తి పేతురు దగ్గరకు వచ్చి, "మీ గురువుగారు దేవాలయం పన్ను కట్టడా ఏంటి?" అని అడిగాడు.

25 అందుకు పేతురు "తప్పకుండా కడతాడు" అని చెప్పి యేసు ఉన్న గదిలోకి వచ్చే లోపుగానే యేసు సీమోనుతో, "సీమోనూ, రాజులు పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ సొంత దేశ ప్రజల నుండా, లేక ఆక్రమించుకున్న ఇతర దేశాల ప్రజల నుండా?" అని అడిగాడు.

26 అందుకు పేతురు "ఇతర దేశాల ప్రజల నుండే" అని చెప్పాడు. యేసు, "కాబట్టి సొంత దేశ ప్రజలు పన్ను కట్టనవసరం లేదు కదా? 27 అయినప్పటికీ వెళ్ళి మనందరి కోసం ఆలయం పన్ను కట్టు. లేకపోతే వాళ్ళకు కోపం వస్తుంది. పన్ను కట్టడానికి డబ్బు కోసం నువ్వు గలిలయ సముద్రానికి వెళ్ళు. అక్కడ గాలం వేసి చేపలు పట్టు. మొదటగా దొరికిన చేపను తీసుకుని దాని నోట్లో దొరికిన వెండి నాణెం తీసుకుని పన్ను వసూలుదారునికి చెల్లించు. దాని విలువ మనం కట్టాల్సిన పన్ను మొత్తానికి సరిపోతుంది" అని చెప్పాడు.